Showing posts with label భాగవతం. Show all posts
Showing posts with label భాగవతం. Show all posts

Friday 13 January 2017

భాగవతం - తృతీయ స్కంధము - 29 వ భాగం


యజ్ఞవరాహమూర్తియై వచ్చి భూమండలమును పైకెత్తాడు. అపుడు స్వామి అది నీటిలో నిలబడడానికి దానికి ఆధార శక్తిని ఇచ్చాడు. ఆ ఆధార శక్తిని ఇచ్చి మూపురమును పైకెత్తి నిలబడ్డాడు. ఇలా గోళ రూపంలో ఉన్న భూమందలమును పైకెత్తేసరికి భూదేవి పొంగిపోయి గాఢంగా ఆలింగనం చేసుకుంది. తత్ఫలితమే నరకాసుర జననము. ఈ దృశ్యాన్ని చూసిన ఋషులు పరమాత్మను అనేక విధములుగా స్తోత్రం చేశారు.

అపుడు స్వామి వారందరికీ అభయం ఇస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు యుద్ధమునకు వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమయిన యుద్ధం జరిగింది. ఒక స్థితిలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన గదా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి క్రింద పడిపోయింది. అపుడు వాడు ‘నేను ఆయుధం లేని వాడితో యుద్ధం చేయను’ అన్నాడు. అతని ధర్మమునకు స్వామి ఆశ్చర్యపోయారు. వెంటనే స్వామి సుదర్శన చక్రమును స్మరించారు. అపుడు చతుర్ముఖ బ్రహ్మ గారు ‘స్వామీ, నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది. వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేక పోతున్నాము. వాడిని సంహరించి ఉద్ధరించు. వాడికి ఒక శాపము విమోచనం అయిపోతుంది’ అన్నారు. అపుడు స్వామి సుదర్శన చక్రమును ప్రయోగిస్తే వాడు ఒక పెద్ద గదను ప్రయోగించాడు. ఆ గదను స్వామి అలవోకగా పట్టుకుని విరిచి అవతల పారేశారు. పిమ్మట ఆదివరాహమూర్తి హిరణ్యాక్షుడి గూబమీద ఒక లెంపకాయ కొట్టారు. అంతే, వాడు క్రిందపడిపోయాడు. నాసికారంధ్రముల వెంట, కర్ణ రంధ్రముల వెంట నెత్తురు కారిపోతూ ఉండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. ఇప్పుడు దితికి అర్థం అయింది. తన కొడుకును శ్రీహరి సంహరిస్తున్నాడని అర్థం చేసుకుంది. ఆవిడ స్తనముల లోంచి రక్తము స్రవించింది. శ్రీహరి హిరణ్యాక్షుడిని తన రెండు కోరలతో నొక్కిపెట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకీ ఒక శాపం తీరిపోయింది. పిమ్మట స్వామి భూమండలమును పైకి ఎత్తారు.

ఆదివరాహమై, యజ్ఞవరాహమై ఆనాడు రెండు కోరలతో భూమండలమును సముద్రములోంచి పైకి ఎత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడిన స్వామి మూర్తిని ఎవరు మానసికంగా దర్శనం చేసి, చేతులొగ్గి నమస్కరిస్తారో, అటువంటి వారి జీవనయాత్రలో ఈ ఘట్టమును చదివినరోజు పరమోత్కృష్టమయిన రోజై వారి పాపరాశి ధ్వంసం అయిపోతుంది.

5. కర్దముడు – కపిలుడు.

వ్యాస భగవానుడు గృహస్థాశ్రమం అనేది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తరించడానికి ఎటువంటి మార్గమును అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో అందులో తేడా వస్తే ఏమి జరుగుతుందో, భోగము అంటే ఏమిటో దానిని ఎలా అనుభవించాలో, అలా భోగమును అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి, ఒక అద్భుతమయిన ఆఖ్యానమును చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతుల జీవితము. స్వయంభువు అయిన బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశారు. అటువంటి ప్రజాపతులలో ఒకరు కర్దమ ప్రజాపతి. ఆయన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టిచేసిన పిదప, ఆయనను బ్రహ్మగారు పిలిచి ఒకమాట చెప్పారు. ‘నాయనా, నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి. ఇంకా సృష్టి కార్యమును నిర్వహించాలి.నీకు అనురూపయై నీతోపాటు శీలము సరిపోయే ఒక భార్యను స్వీకరించి సంతానమును కను. ఇది నాకోరిక’ అన్నాడు. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి జీవితము. కర్దముడు తండ్రి మాట పాటించాలి అని అనుకున్నాడు. అప్పుడు సరస్వతీ నదీ తీరంలో కూర్చుని శ్రీమన్నారాయణుని గూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేశాడు. అపుడు స్వామి ప్రత్యక్షం అయ్యారు. సాధారణంగా భగవద్దర్శనము అయినపుడు భక్తుని కన్నుల వెంట ఆనందభాష్పములు కారతాయని చెప్తాము. కానీ ఇక్కడ కర్దమ ప్రజాపతి తపస్సును మెచ్చిన శ్రీమన్నారాయణుని కన్నులవెంట ఆనందభాష్పములు జారి నీలమీద పడ్డాయి. అది ఎంత విచిత్రమయిన సంఘటన అంటే – ఆయన కన్నుల వెంట కారిన భాష్పబిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడినచోట ఒక సరోవరం ఏర్పడింది. అది సరస్వతీ నదిని చుట్టి ప్రవహించింది. ఈ సరోవరమును ‘బిందు సరోవరము’ అని పిలిచారు. పరమాత్మను చూసి కర్దమ ప్రజాపతి ‘ఈశ్వరా, నీవు కాలస్వరూపుడవై ఉంటావు. కాలము అనుల్లంఘనీయము. అది ఎవ్వరిచేత ఆపబడదు. అది ఎవ్వరి మాట వినదు. దానికి రాగాద్వేషములు లేవు. దానికి నా అన్నవాళ్లు లేరు. దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న కాలములో జీవులు వస్తూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. ఇలా వెళ్ళిపోతున్న కాలమునందు అల్పమయిన భోగములయందు తాదాత్మ్యం చెందకుండా నిన్ను చేరాలి. నిన్ను చేరుకోవడానికి అపారమయిన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమంలో ఉండి భోగము అనుభవించాలి. ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భాగమును అనుభవించి వైరాగ్యమును పొందాలి’ అన్నాడు. ఇటువంటి స్థితి కలిగిన కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు ‘నాయనా, నీవు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు?’ అని అడిగారు. అంటే ఆయన ‘నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకొక కర్తవ్యోపదేశం చేశారు. నన్ను ప్రజోత్పత్తి చేయమని, సంతానమును కనమని చెప్పారు. నా తండ్రి మాట పాటించడం నా ప్రథమ కర్తవ్యమ్. ఆయన మాట పాటించాలి అంటే ప్రజోత్పత్తి చెయ్యాలి అంటే నాకు సౌశీల్య అయిన భార్య కావాలి’ అని అద్భుతమయిన స్తోత్రం చేశాడు.

ఆయన స్తోత్రమునకు పరమాత్మ సంతోషించి ‘కర్దమ ప్రజాపతీ! నీ స్తోత్రమునకు నీ మాటకు నేను చాలా సంతోషించాను. నీకు కావలసిన భార్యను నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడకు స్వాయంభువ మనువు వస్తున్నాడు. ఆయనకు ‘అకూతి’, ‘దేవహూతి’, ‘ప్రసూతి’ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహూతి అనబడే ఆవిడ నీకు తగిన కన్య. దేవహూతిని రథం మీద కూర్చోబెట్టుకుని వచ్చి పిల్లను ఇస్తాను స్వీకరించమని అడుగుతాడు. ఆ పిల్లను స్వీకరించు. మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు’ అని ఆశీర్వదించి స్వామి గరుడ వాహనం మీద కూర్చుని గరుడుని రెక్కల సవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాడు. గరుడుని రెక్కలు కదుపుతున్నప్పుడు ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోనుండి సామవేదమును కర్దమ ప్రజాపతి విన్నాడు. గరుడ వాహనము అంటే ఒక పక్షి కాదు. సాక్షాత్తు వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. వేదమంత్రములను విని ప్రజాపతి పొంగిపోయాడు. కర్దమ ప్రజాపతి నిర్మించుకున్న ఆశ్రమవాటిక ఎంతో అందంగా ఉంది. శ్రీమన్నారాయణుడు చెప్పిన రోజు రానే వచ్చింది. స్వాయంభువ మనువు చేతిలో ధనుస్సు పట్టుకుని రథం మీద తన భార్యయైన శతరూప తోటి, తన కుమార్తె అయిన దేవహూతి తోటి వచ్చి కర్దమ ప్రజాపతి దర్శనం చేశారు. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు. కానీ జ్ఞానము చేత పెద్దవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదములకు స్వాయంభువ మనువు నమస్కరించి ‘నాకు ముగ్గరు కుమార్తెలు. అందులో ఇప్పుడు నాతో వచ్చిన పిల్లను దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగిన సౌశీల్యము కలిగినది. నారదుడు మా అంతఃపురమునకు వచ్చినపుడు నీ గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్నతర్వాత నిన్ను భర్తగా చేపట్టాలనే కోర్కె నా కుమార్తె యందు కలిగింది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి ధన్యుడిని చేయవలసినది’ అని అడిగాడు. అపుడు కర్దమ ప్రజాపతి ‘నీ కుమార్తె ఎంతటి సౌందర్య రాశో నాకు తెలుసు. ఎవరికీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే నీ కుమార్తెను చేపట్టగలరు.నాయందు లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయింది. అందుకే నాకు ఇటువంటి భార్యను ఇచ్చింది. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజున చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెను భార్యగా స్వీకరిస్తాను’ అన్నాడు. కర్దమ ప్రజాపతి దేవహూతిల వివాహం ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము. ఈ వివాహం మన అందరికీ మార్గదర్శకం. శ్రీమన్నారాయణుడు కర్దమునికి కొడుకుగా పుడతానని వరం ఇచ్చాడు. వివాహానంతరము స్వాయంభువ మనువు కూతురును కర్దమునికి అప్పజెప్పి భారమైన గుండెతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక తన రాజ్యమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళి పోతున్నప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మహాపురుషులను అందరినీ సేవించాడు.

భాగవతం - తృతీయ స్కంధము - 28 వ భాగం

జయవిజయులకు సనకసనందనాదుల శాపము.

శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులని ఇద్దరు పార్షదులు ఉన్నారు. వైకుంఠములో వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు ఏడు ద్వారములు ఉంటాయి. ఏడవ ద్వారం దాటి లోపలి వెళితే స్వామి దర్శనం అవుతుంది. జయవిజయులు ఏడవ ద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు. అప్పుడు సనకసనందనాడులు స్వామి దర్శనార్ధమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహా జ్ఞానులు. నిరంతరమూ భగవంతుని పాదములయందు భక్తితో ఉండే స్వరూపం ఉన్నవారు. వారు ఏడవ ద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. అపుడు జయవిజయులు వారిని ‘లోపలికి వెళ్ళడానికి వీలు లేదు’ అని అడ్డుపెట్టారు.

అపుడు సనకసనందనాదులు ‘ఇది వైకుంఠము. ఇక్కడ మాత్సర్యము ఉండదు. ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరము ఉండదు. అటువంటప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకుందుకు అభ్యంతరము ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్త పరాధీనుడు. భక్తులయిన వారు వస్తే చాలు ఆయనే ఆర్తితో ఎదురువచ్చే స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు లోపల ఉంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయంలో ఆయనను దర్శనం చేయాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డుపెట్టడం మీకు మించిన స్వాతంత్ర్యము. కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో దానిని మీరు చూడడం మొదలు పెట్టారు. కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలోకమునకు పొండి’ అన్నారు. అనేటప్పటికి జయవిజయులిద్దరూ సనకసనందనాడులు కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలు పెట్టారు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయన శరీరం మీద నల్లని పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది. ఆ పుట్టుమచ్చను శ్రీవత్సము అని పిలుస్తాము. ఆ పుట్టుమచ్చను చూసి, ఆయన స్వరూపమును చూసి సనక సనందనాదులు పొంగిపోయారు. ‘మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపమును దర్శనం చేయగలిగాము. మా భాగ్యం పండింది’ అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి ‘పుష్పములో చేరే గండు తుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరమూ నీ పాదములయందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది’ అని ప్రార్థించారు.

అపుడు శ్రీమన్నారాయణుడు – ‘మీ స్తోత్రమునకు నేను చాలా సంతోషించాను. కానీ ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్లు నాకు అనిపించింది. ఏమయింది?’ అని అడిగాడు.

అపుడు వాళ్ళు – ‘స్వామీ మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు. కానీ మేము లోపలకి వస్తున్నప్పుడు ఏడవ ద్వారం దగ్గర ఈ పారిషదులు మమ్ములను అడ్డుపెట్టారు. మత్సరములు ఉండడానికి అవకాశం లేని వైకుంఠమునందు నీ దర్శనమునకు మమ్మల్ని పంపలేదు కనుక, వారు మాయందు విముఖులయి ఉన్నారు కనుక వారిని భూలోకమునందు జన్మించమని శపించాము. ఇప్పుడు నీవు ఎలా చెపితే అలా ప్రవర్తిస్తాము. ఒకవేళ మావలన అపరాధం అంటే మన్నించవలసినది’ అన్నారు. అపుడు శ్రీహరి – ‘నా పాదములు మీవంటి బ్రహ్మ జ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు. కనుక ఇంతమంది చేత ఆరాధింపబడుతున్నాయి. మీవంటి వారిచేత పూజించబడి మిమ్మల్ని రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనం ఇస్తాను కనుక, నిత్యాపాయినియై నిరంతరమూ లక్ష్మి నావెంట వస్తోంది. నేను భక్త పరాధీనుడను. భక్తులయిన వారు పిలిస్తే పరుగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరుగెత్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించడంలో అడ్డువస్తే నా చేతిని నేను నరికేస్తాను’ అన్నాడు. ఎంతపెద్ద మాటో చూడండి! ఎందుకు అంటే ఆ చేయి లోకములనన్నితిని రక్షించే చేయి. అటువంటి మీరు నిరంతరమూ నన్ను తప్ప వేరొకరిని కొలవని వారు, ఎప్పుడూ నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు,చతుర్ముఖ బ్రహ్మ అంతరి వారు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చేయమంటే చేయకుండా కేవలము నా పాదపంజరము మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది.’ ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమయిన విషయమును ప్రతిపాదన చేశారు.

‘నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపమును అంగీకరిస్తున్నానో తెలుసా! వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఈ అధికారం నేను ఇచ్చాను. ఏడవ ప్రాకార ద్వారము వద్ద వుండి వచ్చిన వాళ్ళని లోపలి పంపించండి అని చెప్పాను, లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలి అని అంతరము తెలుసుకొని, ముందు వాళ్ళకి నమస్కారం చేసి, లోపలి ప్రవేశ పెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులయిన వారికి కలిగిన మనఃక్లేశము పట్టి కుదిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడడానికి నేను లోపల ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు నావద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమునందు పుట్టిన కుష్ఠు తనని పాడు చేసినట్లు నేను వీళ్ళకి పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయవిజయులు నాకే తప్పు పేరు తీసుకువస్తున్నారు. మీవంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింప బడితే భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకము పాడయిపోతుంది. నేను భక్త పరాధీనుడను. అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు. కాబట్టి వాళ్ళను మీరు శపించడం కాదు నేను చెపుతున్నాను.’
‘వీళ్ళు ఉత్తర క్షణం భూలోకమునకు వెళ్ళి రాక్షసయోని యందు జన్మించి ఉగ్రమయిన రాక్షసులై అపారమయిన లోభత్వమును పొందుతారు’ అన్నాడు.

అప్పుడు జయవిజయులిద్దరు శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి ‘స్వామీ, లోపల ఉన్నవాడి హృదయమును అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. మమ్ములను క్షమించు. మళ్ళా మాకు ఎప్పుడు వైకుంఠమునకు ఆగమనం’ అని అడిగారు. అపుడు స్వామి ‘మీరు మూడు జన్మలలో గొప్ప రాక్షసులు అవుతారు. కానీ మిమ్మల్ని మళ్ళా దునుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీ కోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళా తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా రక్షణే!

04. యజ్ఞ వరాహ మూర్తి:

ఇప్పుడు అందులో ఒకడయిన హిరణ్యాక్షుడు, పశ్చిమ సముద్రం అడుగున ఉన్న వరుణుడిని యుద్ధమునకు రమ్మనమని పిలుస్తున్నాడు. ఆ సమయమునకే యజ్ఞవరాహ మూర్తి జన్మించాడు. ఆయన అవతారం వచ్చింది. వరుణుడు అన్నాడు – ‘సముద్ర జలముల మీదకు ఒక కొత్త భూతం వచ్చింది. నీవు దానితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగా యజ్ఞవరాహ మూర్తిని ఎక్కడయినాఏదయినా ఫోటో చూసినప్పుడు, ఒక పండి స్వరూపమును వేసి దాని మూపు మీద రెండుకోరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లుగా వేస్తారు. కానీ పరమాత్మ అలా ఉండదు. యజ్ఞవరాహ మూర్తి అంటే ఎవరో తెలుసా! యజ్ఞవరాహ మూర్తి వర్ణన విన్నా ఆవిర్భావమును గూర్చి విన్నా, చదివినా, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమయిపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపముతో ఆయన దర్శనం ఇచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆ హుంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. ఆయన గుర్ గుర్ అని శబ్దం చేస్తున్నాడు. వ్యాసులవారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసు అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞ వరాహం. ఇప్పుడు ఆయననను స్తోత్రం చేయాలి. అందుకని ఋషులందరూ నిలబడి ఋగ్వేదములోంచి, యజుర్వేదము లోంచి, సామవేదంలోంచి సూక్తములను వల్లిస్తూ ఆ యజ్ఞవరాహమునకు నమస్కారం చేస్తున్నారు.

అపుడు యజ్ఞవరాహం అడుగులు తీసు అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించి తన నాసికతోటి మూపుతోటి సముద్ర అడుగు భాగమును కెలకడం ప్రారంభించింది. ముఖం అంతా నీతితో నిండిపోతోంది. యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను. ఒక్కసారి తన ముఖమును పైకెత్తి కనురెప్పలను ఒకసారి చిట్లించి మెడను అటూ ఇటూ విసురుతోంది.

అలా విసిరినప్పుడు దాని జూలులోంచి నీళ్ళు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయన నుండి పడిన నీటికోసమని దానిక్రింద తలపెట్టారు. ఈ కంటితో చూడరాని పరమాత్మ ఇవ్వాళ యజ్ఞవరాహంగా వచ్చారు. ఆ నీతితో తడుస్తున్నారు. ఆయన వెతికి వెతికి భూమిని పట్టుకుని దానిని మూపు మీదకు ఎత్తుకుని రెండు దంష్ట్రల మధ్య ఇరికించి, పైకి ఎట్టి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు.

భాగవతం - 5 వ భాగం

పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు.

శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!!

పోతనగారి శక్తి ఏమిటోపోతనగారి ఉపాసనాబలం ఏమిటో మీరు ఆ పద్యములలో చూడాలి. అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి – మీరు ఆ పద్యమును ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారనుకోండి – ఆ పద్యం ఒక్కటి చాలు – మీ జీవితమును మార్చేస్తుంది. ’ఈ భాగవతమును ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను? ఈ భాగవతమును ఆంధ్రీకరించి రాజులకు గాని లేక ఎవరో జమీందారులకు ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు’ అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు. కైవల్యము అనుమాట అద్వైత సాంప్రదాయమునకు చెందింది. కైవల్యము అంటే ఇంక మళ్ళీ తిరిగిరావలసిన అవసరం లేకుండ ఈశ్వరునిలో కలిసిపోవడం. అలా ’ఈశ్వరుడియందు నా తేజస్సువెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవాలి. అలా కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానము చేస్తున్నాను” అన్నారు. రామచంద్రమూర్తి రచింపజేస్తున్నారు. కాబట్టి చెయ్యి పోతనగారిది. ఆ చేతిని కదిపిన శక్తి రామచంద్రమూర్తిది.

పరమాత్మ లోకములను రక్షించుటను ఆరంభించినవాడు. లోకరక్షణము అసలు సృష్టించడంలో ప్రారంభం అవుతుంది. కాబట్టి ’ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను’. లోకమునంతటిని ఆయన రక్షిస్తూ ఉంటాడు. అదేపనిగా ఆయనపెట్టిన అన్నం తిని, ఆయన జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో ఈశ్వరుడిని తిట్టేవాని యందు కూడ ఈశ్వరుడు శక్తిరూపంలో ఉంటాడు. కాని తనను నమ్ముకొనిన వాళ్ళని, ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి పూనికతో వున్నవాళ్ళను రక్షించడం కోసం ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెడుతూ ఉంటాడు. ఈశ్వరుడు అలా పరుగెట్టే లక్షణం ఉన్నవాడు. దానవుల ఉద్రేకమును స్తంభింపజేయువాడు. రాక్షసులందరికీ చావులేదని అనుకోవడం వలననే వారికి అజ్ఞానం వచ్చేసింది. ’ఈలోకములనన్నిటిని లయం చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నమస్కరిస్తున్నాను.’ ఇందులో ఎవరిపేరునూ పోతనగారు చెప్పలేదు. ఆయన పరబ్రహ్మమును నమస్కరిస్తున్నారు. ’సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయకర్తయైన పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను. కేవలం తన చూపులచేత లోకములనన్నిటిని సృష్టించగల సమర్ధుడు ఎవరు వున్నాడో వానికి నేను నమస్కరిస్తున్నాను.’ భాగవతంలో పరబ్రహ్మంగా కృష్ణభగవానుడిని ప్రతిపాదించారు. కాని ఇక్కడ కృష్ణుడని అనడం లేదు. ’మహానందాంగన’ అని ప్రయోగించారు. వానిని గురించి నేను చెపుతున్నాను. వాడు చిన్న పిల్లవానిలా కనపడుతున్నాడు. కాని వాడు పరబ్రహ్మ అందుకని వానికథ నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. ఇంతేకాదు. అందులో ఒక రహస్యం పెట్టేశారు. పోతనగారిలా బతకడం చాలాకష్టం. పోతనగారి ఇలవేల్పు దుర్గమ్మ తల్లి. పోతనగారు తెల్లవారు లేచి బయటకు వస్తే విభూతి పెట్టుకుని రుద్రాక్షలు మెడలో వేసుకొని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు. నోరు విప్పితే ఆయన ఎల్లప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు. పోతనగారు ఎంతవిచిత్రమయిన మాట వాడతారో చూడండి –

’కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత
భవాండకుంభకు మహానందాంగనా దింభకున్’

అన్నారు. ఎవరు ఈ మహానందాగన? మీరు ఇంకొకరకంగా ఆలోచించారనుకోండి – మనం పొందే ఆనందమును శాస్త్రం లెక్కలుకట్టింది. ఆనందమును శాస్త్రం నిర్వచనం చేసింది. ఏదో మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము అని ఇలా చెప్పిచెప్పి చివరకు ఆనందము గొప్పస్థితిని ’మహానందము’ అని చెప్పింది. ఈ మహానందము అనేమాట శాస్త్రంలో ఎవరికి వాడారు? శ్రీ దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో అమ్మవారికి వాడారు. అమ్మవారికి ’మహానందమయి’ అని పేరు. అమ్మవారి డింభకుడు కృష్ణుడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? అమ్మవారి కొడుకుగా కృష్ణుణ్ణి ఎక్కడ చెప్పారు? మీరు లలితా సహస్రమును పరిశీలిస్తే అందులో

’కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః’

ఎదురుగుండా ఉన్న భండాసురుడు పదిమంది రాక్షసులను సృష్టించాడు. మళ్ళీ రావణాసురుడుని, హిరణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడిని సృష్టించాడు. వాళ్ళు పదిమంది మరల పుట్టాము అనుకొని యుద్ధానికి వస్తున్నారు. వారిని అమ్మవారు చూసి ఒకనవ్వు నవ్వింది. వారికేసి ఒకసారి చెయ్యి విదిల్చేసరికి ఆమె రెండుచేతుల వేళ్ళ గోళ్ళనుండి దశావతారములు పుట్టాయి. పుట్టి మరల రాముడు వెళ్ళి రావణుణ్ణి చంపేశాడు. కృష్ణుడువెళ్ళి కంసుడిని చంపేశాడు. అలా చంపేశారు. కాబట్టి ఇపుడు శ్రీమహావిష్ణువు అవతారములు అన్నీ ఎందులోంచి వచ్చాయి? అమ్మవారి చేతి గోళ్ళలోంచి వచ్చాయి. కాబట్టి ’శ్రీమహావిష్ణువు మహానందమయి కుమారుడు. మహానందమయి డింభకుడు. అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. ఎందుకు అంటే ఆయన స్వరూపం మహానందం. ఆయన పేరు కృష్ణుడు. నిరతిశయ ఆనందస్వరూపుడు.

పోతనగారు భాగవతమును అంతటినీ రచించి ఒక మంజూష యందు పెట్టారు. ఆయన ఎవ్వరికీ తాను అంత భాగవతమును రచించానని కూడ చెప్పలేదు. ’ఇది రామచంద్రప్రభువు సొత్తు – దానిని రామచంద్రప్రభువుకి అంకితం ఇచ్చేశాను’ అని అన్నారు. కొడుకును పిలిచి ఆ తాళపత్ర గ్రంథములను పూజామందిరంలో పెట్టమన్నారు. ఆ తాళపత్ర గ్రంథములు పూజామందిరంలో పెట్టబడ్డాయి. కొంత కాలమయిపోయిన తరువాత పోతనగారి కుమారుడు పెద్దవాడయిపోయి అనారోగ్యం పాలయ్యాడు. అతడు తన శిష్యుడిని పిలిచి ’మా నాన్నగారు రచించిన భాగవతం ఆ మంజూషలో ఉంది. దానిని జాగ్రత్తగా చూడవలసింది’ అని చెప్పాడు. తరువాత కొద్ది కాలమునకు అందులోంచి నాలుగయిదు చెదపురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యునికి. అపుడు ఆ శిష్యుడు మంజూషను తీశాడు. తీసిచూస్తే అందులో ఆంధ్రీకరింపబడిన భాగవతం ఉంది. ఇంతగొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథములకు ఎక్కించారు తప్ప పోతనగారు తన జీవితంలో ఎప్పుడూ తను ఇంత గొప్ప విషయమును రచించానని బయటకు చెప్పుకోలేదు. అదీ పోతనగారంటే! మహానుభావుడు అంత నిరాడంబరుడు

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles