Showing posts with label కార్తిక. Show all posts
Showing posts with label కార్తిక. Show all posts

Tuesday, 17 January 2017

ఆలయాల్లో... అందుకే...  జ్వాలాతోరణం

అద్వైతసిద్ధికి, అమరత్వ లబ్ధికి అసలైన విలాసం కార్తికం. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలోని ఎనిమిదో మాసంగా కార్తికం మానవాళికి కొంగుబంగారం. సకల చరాచర జగత్తును వృద్ధి చేసే లక్ష్మీపతి, లయం చేసే శంకరుడు - ఏకోన్ముఖులై జీవజాలాన్ని ఆదుకునే గొప్ప సమయమిది. శివకేశవులు అభేదమనే నినాదం... పర్యావరణమే ప్రపంచానికి రక్ష అనే విధానం... ఆరోగ్య సూత్రాలు పంచివ్వగల దివ్యసందేశం.. కార్తికం నిండుగా అల్లుకున్నాయి. అందుకే  ఏ మాసానికీలేని ప్రత్యేకత దీనికే సొంతం.
శివకేశవులిద్దరినీ ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు కార్తికం గొప్పవరం. పున్నమి చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపాన సంచరిస్తాడు గనుకే దీనికి కార్తికమాసం అని పేరొచ్చింది. కార్తికంలో శివుడు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య ముఖాలుగా ఉదయసంధ్య నుంచి ప్రదోష కాలం వరకూ 5 రూపాలతో భక్తుల్ని అనుగ్ర హిస్తాడు - బోళాశంకరుడు.
పున్నమినాడు జ్వాలాతోరణం
కార్తికమాసంలో పున్నమినాడు శివాలయాలలో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహించడం ఆచారం. ఇలా మండుతున్న జ్వాలాతోరణం కింది నుంచి భక్తులు ఆనందోత్సాహాలతో పరుగు పెడతారు. ఇలా చేయడం వల్ల సకల పాపాలూ నివారణ అవుతాయని విశ్వాసం.
జ్వాలాతోరణం ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం. క్షీరసాగరమథన సమయంలో ముందుగా హాలాహలం వెలువడుతుంది. లోకాలనన్నింటినీ కబళించేలా ఆ హాలాహలం శరవేగంతో దూసుకుపోతుండడంతో దానిని ఉండగా చేసుకుని శివుడు మింగబోతాడు. అయితే దాన్ని తాను మింగితే ఉదరంలో ఉన్న లోకాలన్నీ నశిస్తాయి కాబట్టి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందుకే ఆయన నీలకంఠుడు, గరళకంఠుడు అయ్యాడు. అయితే పతి ఎంత శక్తిమంతుడైనప్పటికీ, సతికి తన భర్తకు ఏమైనా హాని కలుగుతుందేమోననే బాధే కాబట్టి పార్వతీ దేవి ఆ విషం తాలూకు వేడిబాధలను చల్లార్చమని అగ్నిదేవుణ్ణి ఆరాధించింది. తన జ్వాలలు పరమేశ్వరుడికి ఏ మాత్రం బాధ కలిగించకుండా అగ్నిదేవుడు చల్లారిపోయాడు. అందుకు ప్రతీకగా పార్వతీదేవి అగ్ని స్వభావం గల కృత్తికా నక్షత్రానికి సంకేతమైన కార్తిక మాసంలో పౌర్ణమినాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసి, దాన్ని భర్తతో కలిసి తాను దాటింది. ఆ మంటల నుంచి ఉపశమనం కలిగించడానికే శివుణ్ణి మనం నీటితోనూ, పంచామృతాలతోనూ అభిషేకిస్తుంటాం.
మరో కథనం మేరకు శివుడి రేతస్సును అగ్నిదేవుడు భరించలేక, గంగానదిలో పడవేస్తాడు. దాన్ని గంగ కూడా భరించలేక, ఒడ్డున ఉన్న రెల్లు గడ్డిలో వదిలింది. ఆ రేతస్సు నుంచి కుమారస్వామి జన్మించి, శరవణ భవుడయ్యాడు. శివుడికి పుట్టిన కుమారుడి చేతిలో తప్ప ఇతరులెవరి చేతిలోనూ మరణం సంభవించకుండా వరం పొందిన తారకాసురుడు ఇది తెలుసుకుని, ముందు జాగ్రత్తగా ఆ రెల్లు వనాన్ని అంతా తగులబెట్టించాడు. అయితే కుమారస్వామికి ఏ హానీ జరగలేదు. కారణజన్ముడైన కుమారస్వామిని అగ్ని ఏమీ చేయకుండా సురక్షితంగా ఉంచాడు. దానికి గుర్తుగా శివాలయాలలో కుమారస్వామి జన్మనక్షత్రమైన కృత్తికా నక్షత్రం వస్తుంది కాబట్టి కార్తిక పున్నమినాడు జ్వాలాతోరణం జరుపుతారు. జ్వాలాతోరణం నుంచి మూడుసార్లు వెళితే మహాపాపాలు హరిస్తాయనీ, గ్రహాల అననుకూలతలు తొలగి, భగవంతుని అనుగ్రహం లభిస్తుందనీ భక్తుల విశ్వాసం. గౌరీశంకరుల పల్లకి జ్వాలా తోరణం కింది నుంచి మూడుసార్లు వెళ్లిన తరువాత ఆ తోరణానికి మిగిలిన ఎండుగడ్డిని, సగం కాలిన గడ్డిని కూడా రైతులు గడ్డివాములలో కలుపుతారు. ఆ వాములలోని గడ్డిని మేసిన పశుసంతతి బాగా అభివృద్ధి చెందుతుందనీ, ధాన్యానికి లోటుండదనీ నమ్మకం.
శివకేశవుల చిత్తాన్ని గెలిచే ఉపాయం
కార్తికదీపం పేరిట ఈ మాసంలో వెలిగించే ప్రతీ జ్యోతీ అజ్ఞాన తిమిరాలను ఆవలకు నెట్టి, విజ్ఞాన రేఖలను విరబూయిస్తుంది. ఈమాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం మోక్షప్రదం. ముత్తయిదువలంతా కార్తిక దీపాలతో తమ కుటుంబాల్లో వెలుగు నింపే పుణ్యకాలమిది. ఈ దీపాల్ని కృత్తికా నక్షత్రానికి ప్రతీకలుగా భక్తులు తలుస్తారు. శివాలయాల్లో ఆకాశదీపాలు, కార్తిక శుక్లపక్ష పున్నమి నాటి జ్వాలాతోరణాలు దర్శిస్తే జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయని ‘కార్తిక పురాణం’ చెబుతోంది. కార్తికమాసంలో తమిళనాడులోని అరుణాచలంలో కొన్ని వందల టన్నుల ఆవునేతిలో, లేదంటే నువ్వులనూనెలో కొన్ని వందల బేళ్ల పత్తిని, నూలు వస్త్రాలను తడిపి అరుణగిరిపై వెలిగించే దీపానికే కార్తీక జ్యోతి అని పేరు. ఈ జ్యోతి కొన్ని రోజులపాటు వెలుగుతూ గిరిప్రదక్షిణ చేసేవారికి దారి చూపుతుంది. ఈ కమనీయ దృశ్యం చూడడం కోసమే చాలామంది కార్తికపున్నమికి అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తుంటారు.
కార్తిక పున్నమి నాడు ఏం చేయాలి?
చాంద్రమానాన్ని అనుసరించి, ఏ మాసంలోనైనా ఆ మాసపు సంపూర్ణ శక్తి, మహత్తు పున్నమి నాడు ఉంటాయి. కాబట్టి, ఆ మాసమంతా చేయలేకపోయినా, కనీసం పున్నమినాడు సదాచారాన్ని పాటిస్తే మాసమంతా చేసిన ఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు. కార్తీకమాసంలో పౌర్ణమినాడు ప్రాతఃకాలానే లేచి, సముద్రం, నది, కాలువ, మడుగు, ఏరు, బావి, లేదా అందుబాటులో ఉన్న కుళాయి నీటిలో అయినా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, దీపారాధన చేసి, పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శివాలయానికి వెళ్లి, 365 వత్తులతో దీపారాధన చేసి, రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. స్నాన, దాన, దీప, అర్చన, ఉపవాస, ఆరాధన, అభిషేక విధులనేవి దేనికది ఫలప్రదం కాబట్టి కనీసం మనం చేయగలిగే కొన్నింటినైనా ఎంచుకుని, వాటిని నిష్ఠగా ఆచరించడం వల్ల కూడా పరమేశ్వరానుగ్రహానికి నోచుకోవచ్చు.
-

కార్తీకపౌర్ణమి నాడు ఏంచేయాలి?

          సమస్త ప్రాణులకూ నేను మహోపకారం చేయగలను కార్తీకపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చెయ్యలేవు. నేను ఏమి చెయ్యగలను? దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేష ఫలితం. యధార్ధానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించాలి. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, "దామోదరమావాహయామి" అనిగాని, "త్రయంబకమావాహయామి" అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఈ శ్లోకం చెప్పాలి...

"కీటాఃపతంగా మశకా శ్చ వృక్షాః
జటేస్ధలే... ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్వాప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః"
(ఈ దీపము దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి ఈ దీపం వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటకములు, పురుగులు, పతంగాలు, దోమలు, వృక్షాలకు వెళ్ళాలి. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతుంది. కాబట్టి దామోదరుడి చెయ్యి దానిమీద పడినట్టే! త్రయంబకుని చెయ్యి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి. నీటిలో ఉండే చేపలు, కప్పలు, తాబేళ్ళ వంటి వాటిపై ఈ దీపపు వెలుతురు పడినప్పుడు, ఆ ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో వాటి పాపపుణ్యాలన్నీ నశించుపోవుగాక! ఇక వాటికి జన్మ లేకుండుగాక! ఉదర పోషణార్ధమే బ్రతుకుతున్న భయంకరమైన స్ధితిలో ఉన్న వాడిమీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించి వాడు వచ్చే జన్మలో అభ్యున్నతిని పొందుగాక!) నువ్వు ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు.
       మనం ఒక ఇల్లు కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. 365 రోజులూ దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్లీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి "కార్తీక పౌర్ణమి". అందుకే కార్తీకపౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం ఆవునేతిలో ముంచి వెలిగిస్తుంటారు.
      దీపాలు ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టి.వి చూస్తాను అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం వెలిగించాలి. ఇంట దీపం పెడితే కార్తీకపౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో దీపం పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం.

                   -

"ఓం నమఃశివాయ"
"ఓం నమఃశివాయ"
"ఓం నమఃశివాయ"

Friday, 13 January 2017

కార్తిక పురాణం - 2 వ భాగం


కార్తీక పురాణము -- ద్వితీయాధ్యాయం

అథద్వితీయాధ్యాయ ప్రారంభః
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్యచ! కర్మత్రయ కృతాత్పాపాత్ ముచ్యతే శ్రవణాదపి!! ఓ రాజా! కార్తీకమహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయములవలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీకమాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసనివాసియగును. కార్తీకమాసమున సోమవారమందు స్నానముగాని, దానమును గాని, జపమును గాని చేసినయెడల అశ్వమేధయాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్తభోజనము, స్నానము, తిలదానము, ఈఆరున్నూ ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు చాయానక్తము జేయవలెను. అందు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 ½ గంటలకు భుజించుట చాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినయినను ఆచరించినయెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమునుబొందును. స్త్రీలుగాని, పురుషులుగాని ఎవరు కార్తీకసోమవారమందు నక్షత్రములను జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును. కార్తీకసోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈవిషయమునందొక కథగలదు. చెప్పెద వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును. కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశశ్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి ఆదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును. ఈమిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామముగలదు. భర్యయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత ఆమెయందు రాగముతోనుండెను. అంతనొకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములును తృప్తిగా ఇచ్చి నిరంతరము నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశస్వయముగా తన భత శవము వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులును పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్ర ప్రవీణులును, వర్ణ సంకరకారకులును, అయిన అనేకజాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగముచేయుచుండెడిది. ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడియున్న భార్యలను దుర్బోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రతపరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనిందచేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయియుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వుచేతగాని, కపటముచేతగాని, విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇటుండగానే ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు మదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆవ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమదూతలు వచ్చి ఆకర్కశను పాశములచేత కట్టి యమునికడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు, ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆకర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆవేడి స్తంభమును సంభోగించుమనిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండుచెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆకర్కశ ఇట్లు తన పితృ పతామహులతోను, తన బాంధవులతో తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారితో ఘోరములందు నరకములందు మహాబాధలుపొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు పదిహేనుమార్లు కుక్కగ జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసమందు సోమవారము దినంబున పగలంతయి ఉపవాసముచేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను జేసి నక్షత్రమండలమును జూచి గృహమునకు బోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను. ఆకుక్క ఆనాడు పగలంతయి ఆహారము కొద్దియైనను దొరకనందున కృశించినదై కార్తీకసోమవారము రాత్రి విప్రుడువేసిన బలిని భక్షించెను. ఆబలిభోజనముచేత కుక్కకు పూర్వజాతిస్మృతిగలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము. రక్షింపుమని పలికెను. ఆమాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ శునకమా! మాఇంటిలో ఏమేమిచేసితివి. రక్షింపుమనుచున్నావు అని యడిగెను. కుక్క ఇట్లనెను. బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణస్త్రీని. పాపములను చేయుదానను. వర్ణసంకరము చేసినదానను. అన్యపురుషులను మరగి నిజభర్తను చంపితిని. ఈవిధిపాపములు అనేకములు చేసి చచ్చియమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము. విని తరించెదను. ఆబ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె. ఓ శునకమా! ఈకార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృతి గలిగినది. ఆమాటవిని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈకుక్కజాతి నుండి నాకెట్లు మోక్షముగలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆకుక్క యిట్లు ప్రార్థించగా పరూపకార బుద్ధితో కార్తీకసోమవారములందు తానుజేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను మాల్యములను, ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతోగూడ కైలాసానికిబోయి అచ్చట పార్వతీదేవివలె శివునితోగూడ ఆనందించుచుండెను. కాబట్టి కార్తీకమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తీకవ్రతమును నీవు చేయుము.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వితీయోsధ్యాయస్సమాప్తః

Thursday, 22 December 2016

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం
దీక్ష 41 రోజులే ఎందుకుచేయాలి. క్రిందచదవండి.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Ayyapa

గణపతి ప్రార్ధన


శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మయే !!

అయ్యప్ప స్వామి వారి ప్రార్ధన

అఖిల భువన దీపం భక్త చిత్తాజ్జ సూర్యం
సుర గణ ముని సేవ్యం తత్త్వ మస్యాది లక్ష్యం !
హరి హర సుత మీశం తారక బ్రహ్మ రూపం

శబరి గిరి నివాసం భావయే భూత నాదమ్ !!

|| అరిషడ్వర్గాల అంతానికే అయ్యప్పస్వామి దీక్ష ||
మానవ జన్మకి పరమార్థం మోక్షాన్ని పొందడమే - అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డు తగిలే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్యర్యాలనే అరిషడ్వర్గాలని అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను వహించాల్సి వుంది.

"జీవానాం నరజన్మ దుర్లభం" - సకల చరాచర జీవరాశులన్నిటికన్నా మానవుడే శ్రేష్టుడు గనుక, ఋషి అంతటి వాడవ్వల్సిన మనిషి మసై, బూడిదై పోకూడదని, ఈ జన్మలోనే ముక్తిని పొంది "మానవుడు తన జన్మను చరితార్థం చేసుకోవాలనే" ఉద్దేశంతో 41 రోజులు దీక్షను ఆచరించి, ఆ దీక్షలో పొందిన ఆధ్యాత్మిక ఆనంద, అనుభవాలను మానవుడు తన జీవితకాలమంతా పొంది తద్వారా మోక్షాన్ని పొంది తరించాలన్నదే భగవంతుని ఆంతర్యం.

ఈ దీక్షా కాలంలో కఠిన బ్రహ్మచర్యాన్ని, శీతలోదకస్నానం(చన్నీటి స్నానం), భూతలశయనం, ఏకభుక్తం, స్వయంపాకం వంటి పలు నియమాలు పాటిస్తారు. ఇంద్రియ నిగ్రహం కోసం 41 రోజులు దీక్ష తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళ్ళడంలో మనిషిని శారీరకంగా, మానసికంగా, దృఢంగా, క్రమశిక్షణలో ఉండేందుకు ఈ అయ్యప్ప దీక్ష ఎంతో ఉపకరిస్తుంది. శరీరంలో ఉన్న సమస్త కల్మషాలను దూరం చేసి శరీరాన్ని తేలిక పరిచే ఆరోగ్య నిధానం అయ్యప్ప దీక్షా విధానం.

భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు నియమనిష్ఠలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో, స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు జామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసి మాల, నుదుట విబూది గంధం బొట్టు ధరిస్తారు. దినచర్యలో అధిక భాగం పూజ, భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకుంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలను ఆచరిస్తారు.

కుల మత భేదాలకు అతీతంగా, జాతి, భాషల వ్యత్యాసం లేకుండా శాంతిప్రియులై, నియమ నిబంధనలతో కూడిన జీవన విధానముతో, నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ, సేవలు చేయుచూ జీవన శైలిని సుగమనము చేసుకోవటమే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను, ఇంద్రియ వికారములను, భవధారలను, భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజముగా సిద్ధింపజేయుటే అయ్యప్ప దీక్షలోని విశిష్టత.

Sunday, 18 December 2016

కార్తీక మాసం లో ఎక్కువ చలిలో కూడా చల్నీటి స్నానాలు ఎందుకు చేస్తారు..?? స్నానాలు ఎన్ని రకాలు..??

Dhyanam siva


 స్నానము అనేది శరీర శుభ్రత కోసము. అది ఏ కాలములో చేసినా ఏవిధముగా చేసినా అంతిమ ఉపయోగము మాత్రం ఆరోగ్యము కాపాడుకోవడమే.

ఉదయాన్నే దేహాన్ని శుభ్రం చేసుకోడానికి స్నానం చేస్తాం. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న ఉష్ణశక్తి ని బయటకు పంపడం స్నానపు ప్రధాన ఉద్దేశం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి ఉష్ణశక్తి ని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి ఉష్ణశక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే శరీరం లోకి చురుకుదనం ప్రవేశిస్తుంది.

మనలో నిరంతరం ఉష్ణశక్తి ప్రవహిస్తూ, ఉష్ణశక్తి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్న ఉష్ణశక్తి ఎక్కువగా బయటకు పోతుంది. శరీరంలో ఉష్ణశక్తి కొత్తగా తయారు అవుతూ బయటకు పోతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "Electro-magnetic Activity” అంటారు.

భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలకు, సముద్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. కార్తీక మాసంలోను పుష్కారాల సమయంలోను నదీ స్నానాలు పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానాలు చేయకూడదనే నియమం కనిపిస్తోంది. అలాగే నదుల్లో కూడా స్నానం చేయునప్పుడు పాటించవలసిన నియమాలను కూడా శాస్త్రం చెబుతోంది.

రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో గానీ సముద్రాలలో గాని స్నానం చేయకూడదు. ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించిన తరువాతే స్నానం చేయవలసి వుంటుంది. స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ పిండటంగాని చేయకూడదు. అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు. శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి. లేదంటే కొత్త పాపాలు తలకెత్తుకోవలసి వస్తుందనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు.

కార్తీక మాసంలో పుణ్యము కోసం స్నానాలు చేసే స్నాన విధాలు:
1. దివ్య స్నానం : ఉత్తరాయణంలో ఎండతో పాటు వాన కురుస్తున్నప్పుడు నిలిచి స్నానం ఆచరించటం.


2. ధ్యాన స్నానం : గంగ, యమున, సరస్వతి మొదలైన పుణ్య నదులను తలచుకొని ఆ జలంతో స్నానం చేయటం.

3. మంత్ర స్నానం : మంత్రాలను ఆచరించే స్నానం మృత్తికా స్నానం అంటే మంత్రాలు పఠిస్తూ పవిత్ర ప్రదేశాలనుండి తెచ్చిన మృత్తిక తో ఆచరించిన స్నానం.

4. మాన స్నానం : విభూతిని శరీరం మొత్తం పూసుకొని స్నానం చేయటం దీన్ని మహేశ్వరున్ని స్మరిస్తూ చేస్తారు.

5. వారుణ స్నానము : గోవిందా, హర హర అని దేవున్ని తలచుకొని స్నానము చేయుట .

6. కాపిల స్నానము : శరీరము పైబాగాన ఏదైనా గాయము, పుండు ఉన్నచో, బొడ్డు దిగువ భాగము పాదాలవరకు నీటితో స్నానము చేసి, బొడ్డు పై శరీరభాగాన్ని తడిగుడ్డతో తుడుచు కోవడము.

7. ఆతప స్నానము : శరీరము ఏవిధముగానైనా తడపనీయకుండా అనారోగ్యము చుట్టిముట్టి ఉన్నవారు లేదా తీవ్రమైన నీటికొరత ఉన్నప్పుడు ఎండలో గోవిందనామము ను ఉచ్చరిస్తూ కొంతసేపు ఉంటే అది ఆతప స్నానము అవుతుంది.

8. మానస స్నానము : పై స్నాన విధాలు ఏవిధంగాను సహకరించని వారు నేను స్నానము చేస్తున్నాను అని భావించి శరీరము అలా తడుపుతున్న భావనతో ఉండి కొంతసేపయ్యేక పరమేశ్వరుని స్నానము చేస్తూన్న ఓ దృశ్యాన్ని కళ్ళలో ఊహించుకొని చూడగలిగితే చాలు అది మానస స్నానము అవుతుంది.

ఇవి మనకు శాస్త్రలు తెలిపిన స్నానములు. మంచిగా స్నానము చేస్తే చర్మవ్యాధులు వచ్చే అవకాశము కూడా తక్కువే. అందరికి ఈరోజు శుభదినం కావాలని మనసారా  కోరుకొంటూ..
    

Friday, 2 December 2016

కార్తీకమాస విశిష్టత

*కార్తీకమాస విశిష్టత*

నకార్తీక సమోమాసః- న దేవః కేశవాత్పరమ్‌
నచవేద సమం శాస్త్రం- న తీర్థం గంగాయాసమమ్‌

కార్తీక మాసం ద్వాదశ మాసాల్లో ఒకటయినా ఈ కాలంలో వచ్చే తిథుల వైశిష్ట్యం, ఉత్సవాల వైభవం.. ఇతర మాసాలకు లేని ప్రశస్తిని ఈ మాసానికి కలిగిస్తున్నాయి. శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో ఏ దిక్కుకు తిరిగి నమస్కరించినా అది శివకేశవులకే చేరుతుంది. పంచ మహాపాతకాలను భస్మం చేసి పుణ్యకర్మలు మాత్రమే ఆచరించేలా మనసుకు మెరుగులుదిద్దే పవిత్రమాసం కార్తీకం.

కార్తీక స్నానం మహాపుణ్యప్రదం. ప్రతిరోజూ కృత్తికా నక్షత్రం అస్తమించేలోగా తెల్లవారుజామునే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.

కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కనుక ఇది శివ ప్రీతికరం. చన్నీటి స్నానం ఆచరించడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత క్రమబద్ధమై చక్కటి ఆకలి కలిగిస్తుంది.

ఈ మాసంలో పురాణ శ్రవణం, దానధర్మాచరణ వల్ల విశేష పుణ్యఫలం సిద్ధిస్తుంది.

శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో ఉపవాసానికి ప్రత్యేక స్థానం ఉంది. చాలామంది ఏక భుక్తంగా నక్త భోజనం ఒనరుస్తారు. ఇలా ఉండలేనివారు ఛాయానక్తంగా ఉంటారు. సాయం సమయంలో భోజనం చేస్తారు. మాసం మొత్తం నక్తం ఉండలేనివారు కార్తీక సోమవారం, పూర్ణిమ తిథినాడు నక్తములు ఉండవచ్చు.

సోమవారానికి చంద్రుడు అధిపతి. ఈ వారం నాడు ఉపవాసం చంద్రమౌళికి ప్రీతికరం. కార్తీక సోమవారం ఉపవాసం చేస్తూ, పంచామృతాలత రుద్రాభిషేకం చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది.

ఈ మాసంలో సాయం సమయాన శివాలయంలో భక్తితో గోపుర ద్వారం వద్ద, శిఖరం మీద, శివలింగం ముందు ఆవు నేతితో దీపారాధన చేసినవారు ధన్యులవుతారు.

దీపదానం విశేష ఫలాన్నిస్తుంది. పలు జాతుల చెట్లతో ఉన్న తోటలో ఉసిరిక చెట్టు కింద సాలగ్రామం ఉంచి హరిచందన పుష్పాలతో పూజ చేసి ఆ తోటలో భుజించాలి.

కార్తీక మాసంలో కమలాక్షుడైన శ్రీహరిని కమలాలతో పూజించేవారింట కమలవాసిని అయిన శ్రీ మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. శ్రీహరిని తులసీదళాలతో, జాజి పూలతో పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. మారేడు దళాలతో లక్ష బిల్వార్చన పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తినిస్తుంది.

తులసికోట ముందు గోమయంతో అలికి శంఖం- పద్మం- స్వస్తికం మొదలైన ముగ్గులు పెట్టిన సీ్త్ర విష్ణుప్రియ అవుతుంది.

సిరిభోజనం(ఇది కార్తికమాసం. వనభోజన మాసం)

ఇది కార్తికమాసం. వనభోజన మాసం. ఇంటిల్లపాదీ వనభోజనం చేయాలి.
ఆ వనంలో ఉసిరిచెట్టు ఉండాలి. భోజనంలో ఉసిరి వంట ఉండాలి.
ఇది సంప్రదాయం. అది ఎందుకంటారా...? ఆగండాగండి...
ఉసిరి అంటే... ‘సి’ విటమిన్ రిచ్. ఆరోగ్యం వెరీ మచ్. అందుకే...
ఉసిరి ఉన్న భోజనం... సిరిభోజనం.

*ఆమ్లా షర్బత్*

కావలసినవి: ఉసిరికాయలు- 500 గ్రా, చక్కెర- 200 గ్రా, జీలకర్ర పొడి- అర టీ స్పూన్, ఉప్పు - అర టీ స్పూన్, పుదీన ఆకులు - మూడు, ఐస్- పది క్యూబ్‌లు

తయారీ:  ఉసిరికాయలను కడిగి తగినంత నీటిని పోసి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత చేత్తో చిదిమి గింజలను తీసి వేయాలి.  ఉసిరిక గుజ్జులో చక్కెర, పుదీన ఆకులు, ఒక కప్పు చన్నీరు పోసి, మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి అందులో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. ఐస్‌క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేయాలి. దీనిని నిల్వ చేసుకోవచ్చు. గది వాతావరణంలో రెండు రోజులు, ఫ్రిజ్‌లో వారం తాజాగా ఉంటుంది.

గమనిక:  ఎప్పటికప్పుడు తాజాగా కావాలంటే ఉసిరి కాయలను తరిగి, గింజలు తీసి మిక్సీలో గుజ్జు చేయాలి. పలుచటి వస్త్రంలో వేసి రసం తీయాలి. ఆ గుజ్జుకు కొంత నీటిని చేరుస్తూ, మరలా మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. తేనె కలిపి సర్వ్ చేయాలి.

*ఆమ్లా  మురబ్బా*

కావలసినవి: ఉసిరికాయలు- 100 గ్రా, చక్కెర- 100 గ్రా, నీరు- 125 మి.లీ, కుంకుమ పువ్వు- ఐదు రేకలు, ఏలకుల పొడి- పావు టీ స్పూన్
తయారీ:  ఉసిరికాయలను కడిగి, తురమాలి. గింజలు లేకుండా మొత్తం కోరుకోవాలి.  ఒక పాత్రలో చక్కెర, నీరు కలిపి కరగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఉసిరికాయ కోరు వేసి, సన్న మంట మీద గరిటెతో కలుపుతూ ఉడికించాలి.  ఈ మిశ్రమం ఉడికి దగ్గరయ్యే వరకు అడుగు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి.  మిశ్రమం తీగలాగ సాగిన తర్వాత దించేసి కుంకుమ పువ్వు, ఏలకుల పొడి వేసి కలిపితే మురబ్బా రెడీ.  ఇది చల్లారిన తర్వాత తడిలేని గాజు జాడీలోకి తీసుకోవాలి. దీనిని తేమ తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటే ఏడాదిపాటు నిల్వ ఉంటుంది.ఉసిరి మురబ్బాను అలాగే తినవచ్చు. బ్రెడ్, చపాతీల మీద పలుచగా రాసి తినవచ్చు.

*ఉసిరి పులిహోర*

కావలసినవి: బియ్యం- ఒక కప్పు, ఉసిరికాయ తురుము- ఒక కప్పు, కొత్తిమీర- రెండు రెమ్మలు, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత
పోపు కోసం: ఆవాలు- ఒక టీ స్పూన్, మినప్పప్పు- ఒక టీ స్పూన్, పచ్చి సెనగపప్పు- ఒక టీ స్పూన్, అల్లం తరుగు- అర టీ స్పూన్, ఎండు మిర్చి- రెండు, పచ్చి మిర్చి- రెండు (తరగాలి), కరివేపాకు- రెండు రెమ్మలు, నూనె - ఒక టేబుల్ స్పూన్
తయారీ:  అన్నం వండి చల్లారబెట్టాలి.  బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేయాలి.  అవి వేగిన తర్వాత ఉసిరికాయ తురుము, పసుపు, ఉప్పు వేసి, రెండు నిమిషాల సేపు సన్న మంట మీద మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి.మిశ్రమం చల్లారాక అన్నంలో వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లాలి.

*ఉసిరి పప్పు*

కావలసినవి: కందిపప్పు- ఒక కప్పు, టొమాటో ముక్కలు- ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, ఉసిరికాయ ముక్కలు- అరకప్పు, మిరప్పొడి- ఒక టీ స్పూన్, పసుపు- చిటికెడు

పోపు కోసం:  నూనె- రెండు టీ స్పూన్‌లు, ఆవాలు- అర టీ స్పూన్, సెనగపప్పు- ఒక టీ స్పూన్, మినప్పప్పు- ఒక టీ స్పూన్, జీలకర్ర-  అర టీ స్పూన్, వెల్లుల్లి రేకలు- మూడు, ఎండు మిర్చి- రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు- ఒక టీ స్పూన్
తయారీ:  కందిపప్పును కడిగి ప్రెషర్‌కుకర్‌లో వేయాలి. అందులో టొమాటో, ఉల్లిపాయ, ఉసిరిముక్కలు, మిరప్పొడి, పసుపు, ఒకటిన్నర కప్పు నీరు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత పప్పులో ఉప్పు వేసి పప్పు గుత్తితో మెదపాలి.  ఒక పాత్రలో నూనె వేడి చేసి, ఆవాలు వేయాలి.  అవి వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులన్నింటినీ వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు పోపులో మెదిపి పక్కన ఉంచిన పప్పు వేసి కలపాలి.

గమనిక: మిరప్పొడి బదులు పచ్చి మిర్చి వేసుకోవచ్చు.

*ఉసిరి ఊరగాయ*

కావలసినవి: ఉసిరికాయలు- పావు కిలో, ఆవాల పొడి - 50 గ్రా, కారం - 50 గ్రా, పసుపు - ఒక టీ స్పూన్, ఉప్పు - 50 గ్రా, వెల్లుల్లి రేకలు - పది, నూనె - రెండు టేబుల్ స్పూన్‌లు పోపుదినుసులు  ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి

తయారీ:  ఉసిరికాయలను కడిగి తుడవాలి. బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఉసిరికాయలను వేసి సన్నమంట మీద మెత్తగా మగ్గనివ్వాలి. ఈ ఊరగాయకు ఉసిరి గింజలను తీయాల్సిన అవసరం లేదు.  మెత్తగా మగ్గిన కాయలను మరొక పాత్రలోకి తీసి అదే బాణలిలో పోపు దినుసులు వేయించాలి.  అందులో ముందుగా వేయించి పక్కన ఉంచిన ఉసిరికాయలను వేసి పైన కారం, పసుపు, ఆవాల పొడి, ఉప్పు , వెల్లుల్లి రేకలు వేయాలి. పైన మిగిలిన నూనె వేసి కలిపి చల్లారని వ్వాలి.  తర్వాత తేమలేని గాజు లేదా పింగాణి జాడీలో తీసుకోవాలి. ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. తేమ తగలకుండా వాడితే ఆరు నెలలు తాజాగా ఉంటుంది. ఈ ఊరగాయ చేసిన రోజు పైకి నూనె కనిపించదు. రెండు రోజులకు కాయల్లోని నూనె పైకి తేలుతుంది.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles