శ్లో॥ నినుఁ జింతించుచుఁ బాడుచుం బొగడుచున్ నీదివ్యచారిత్రముల్
వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన భవత్ప దాబ్జయుగమున్ విశ్వేశ! విశ్వంభరా!
తా॥
ఎల్లప్పుడు నిన్నే ధ్యానిస్తూ, నీ లీలలే గానం చేస్తూ, నిన్నే ప్రశంసిస్తూ, నీ పవిత్ర చరిత్రాలే వింటూ ఉండే వారు మాత్రమే, విశ్వేశ్వరా! విశ్వంభరా! శ్రీకృష్ణా! దురంతాలైన జన్మపరంపరలను అంతం చేసేవీ, పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవీ అయిన నీ పాదపద్మాలను, దర్శించగలుగుతారు. అంతేతప్ప మరింకే ఇతర ప్రయత్నాలు ఫలవంతాలూ కావు ॥