Monday 30 November 2015

శృంగేరీ..సౌందర్యలహరీ!

శృంగేరీ..సౌందర్యలహరీ!


చూసే కనుదోయి అభిప్రాయాల అల్పత్వం దగ్గరే ఆగిపోకుండా, మనసును తాకి పరవశింప జేసే సౌందర్యాన్ని అణువణువునా నింపుకున్న ప్రదేశాలు అదృష్టవశాత్తూ మన దేశంలో ఇంకా చాలానే మిగిలి ఉన్నాయి. వెర్రి పోకడల నవనాగరికత నీడలు పడని, కాలుష్యమింకా తెరలను పరువని నిష్కల్మష పుణ్యస్థలమైన శృంగేరి శారదా పీఠం తప్పకుండా అదే కోవకు చెందుతుంది.

జాతి వైరాన్ని మరచి ఒక పాము కప్పకు తన పడగ చాటున నీడనిచ్చిన మహత్తరమైన ప్రదేశంలో ఒక్కసారైనా కాలు మోపాలన్న ఆశా, అద్వైతాన్ని నలుదిశలా ప్రచారం చేసి, సనాతన భారతీయ ధర్మోద్ధరణ గావించిన శ్రీ శంకర భగవత్పాదులు ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించిన శారదా పీఠాన్ని దర్శించుకుని ఒక రెండు రోజులు హడావుడి లోకానికి దూరంగా, ప్రశాంతంగా గడపాలన్న కోరిక - తొలుత ఈ రెండే మా అకస్మాత్తు ప్రయాణానికి ప్రేరణలు. అయితే, అనుకోని వరాల్లా, అక్కడ ఉన్న రెండు రోజుల్లోనే ముందు వినని, చదువని (చదివినా ఇంత మనోహరంగా ఉంటాయని ఊహించని) మరికొన్ని ప్రదేశాలు కూడా చూడగలిగాము.
అదృష్టమేనేమో కానీ, బెంగళూరు దాటి సగం దూరం ప్రయాణం చేసినప్పటి నుండీ వాన పడే ముందు ఉండే అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం, శృంగగిరి పీఠం ఇంకా చేరకుండానే మనఃస్థితి మొత్తాన్నీ మార్చేసింది. మలుపుల మయమైన ఘాట్ రోడ్ మీద కిటికి పక్కన కూర్చుని చేసిన ప్రయాణం, ఎంత వెనక్కు తోసినా మొహమంతా పరుచుకునే జుత్తు, చెవుల్లోకి సన్నని హోరుతో దూసుకెళ్ళే గాలి, కళ్ళకు హాయి గొలిపే చిక్కటి పచ్చదనం ప్రయాణంలో తొలి ఘడియల అనుభవాలు.

శృంగగిరి అడవి మధ్యలో ఉన్నట్టుంటుంది. నాకు సహజంగానే అడవి ప్రాంతాల పట్ల మక్కువ ఎక్కువ. అందునా పచ్చందనాల కౌగిళ్ళల్లో ఒదిగి హొయలొలికించే చిగురాకులలోనూ, చిరుజల్లుల తాకిడికి తడిసి తల విదుల్చుకునే లేలేత కుసుమాల కదలికల్లోనూ మానవ మేధస్సుకు అంతు పట్టని మార్మిక సౌందర్యమేదో మనసులకు ఎర వేసి లాగేస్తుంది. కాలాలను కట్టి పడేసి, బాహ్య స్మృతి విముక్తులను చేయగల అదృశ్య శక్తేదో ఆ అడవి తల్లి ఒడిలో మాత్రమే భద్రంగా ఉంది.




ఆది శంకరుల గుడిలోనూ, పలకలు చేత బుచ్చుకు అక్షరాభ్యాసం కోసం వచ్చిన మూడేళ్ళ చిన్నారులతో నిండి పోయిన శారదాంబ గుడిలోనూ అడుగేస్తే అర్థమయ్యే పాజిటివ్ ఎనెర్జీ గురించీ , కళ్ళు మూసుకున్న క్షణాల్లోనే ధ్యానంలో నిమగ్నమయ్యే శక్తినిచ్చే ఆ ప్రాంగణపు మహాత్మ్యము గురించీ నేను ఎక్కువగా రాయదల్చుకోలేదు. అవి తప్పకుండా చాలా మందికి అనుభవంలోకి వచ్చే విషయాలేనని నా నమ్మిక.

వాటిని పక్కనపెడితే, విశాలమైన ప్రాంగణము కలిగిన గుడి ఇది. ప్రసాదాలు కళ్ళ కద్దుకుంటూ కుటుంబ సమేతంగా బయటకు వచ్చిన అక్కడ కూర్చున్న వాళ్ళకు, ఆ పురాతన గుడి గోపురంలో గూళ్ళు కట్టుకున్న తెలతెల్లని పావురాలు రెక్కలల్లార్చుకుంటూ తిరగడం చూస్తుంటే బోలెడంత కాలక్షేపం. ఆ పాత రాతి కట్టడాల్లో చెప్పనలవి కాని అందమొకటి ఉంటుంది. మనవి (మన కాలంలోవి) కానివన్నీ అందమైనవే నీ కళ్ళకి - అంటూ నిష్ఠూరాలొద్దు కానీ, నిజంగానే ఈ పాత రాతి కట్టాడాల్లో, ఈ కాలపు నిర్మాణా లెరుగని అనిర్వచనీయమైన ఆకర్షణ ఉంటుంది.


అరె ఏటిలోని సేపలంట ..

దీనిని ఆనుకునే ప్రశాంతంగా పారే ఓ నది. గట్టిగా నాలుగడుగులేస్తే అందుకోగలిగిన ఆవలి తీరం - అయితే మాత్రమేం - మీరొక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అంత లోతైనదట ఆ నది. చూస్తే అలా ఏం అనిపించని కారణానికేమో, సెక్యూరిటీ అతను విజిల్ ఊదిన వాడు ఊదినట్టే ఉన్నాడు, జనాలను నియంత్రించడానికి. అతని మాటకేం కానీ, ఆఖరు మెట్టు మీద - ఈ మూల నుండి ఆ మూల వరకూ, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ సర్దుకు కూర్చుండిపోయారు....వందల కొద్దీ చేపలను, వాటి అబ్బురపరిచే కదలికలను దగ్గర నుండి చూడడానికి. నిజాయితీగా చెప్పాలంటే, నేను చేపలను చూడడమంటే అది నేస్తాల ఇళ్ళల్లో అక్వేరియంలలోనే. థాయ్‌లాండ్‌లో వాటర్ స్పోర్ట్స్ కోసం "ఫుకెట్" వెళ్ళినప్పుడు "స్నోర్క్లింగ్" చేస్తూ కాళ్ళను చుట్టేసే చేపపిల్లలను, రకరకాల జాతుల్లోనూ, రంగుల్లోనూ ఉన్న వాటిని గైడ్ చూపిస్తుంటే చూశాను కాని, అది ఒక మహా సముద్రం.ఆనాడు అంతటి ఆపరాని ఆత్రమూ, ఉరకలేసిన ఉత్సాహమూ ఆటలకూ - ఈత రాని వాడు మహా సముద్రంలో పడితే ఏం జరుగుతుందన్న కుతూహలానికీ మాత్రమే పరిమితమయ్యాయి.

ఈ సారి అలా కాదు. నిశ్చలంగా ఉన్న ఏటి ఒడ్డున అంతలేసి చేపలు తుళ్ళిపడుతూ...పసి వాళ్ళు మరమరాలు, బిస్కట్లు వేసినప్పుడల్లా నీరంతా చెదరగొడుతూ గుంపుగా పైకి లేచి, నోట కరుచుకుని నీటి క్రిందకు వెళ్ళిపోయి, సొగసుగా తిరుగాడుతూ, చూపరుల కళ్ళను కవ్విస్తూ, నవ్విస్తూ... ఒహ్! ఓహ్! ఒక దాన్ని మించి ఒకటి, ఆకారంలోనూ అందంలోనూ పోటీలు పడి, ఆ రెండు రోజుల్లోనూ మేము వాటితో గడిపిన మూడు గంటల సమయంలోనూ, "మీనాక్షి" అన్న పేరు మీద నాకున్న ప్రీతిని పదింతలు పెంచాయి.

నరసింహ వనం :

ఈ మీనాల మాయామోహపు వల  నుండి బయటపడితే, ఆ నదిపైని వంతెన దాటి , అటు వైపు వున్న నరసింహ వనానికి వెళ్ళవచ్చు.ఇది ఎంతటి సుందర సురభిళ ప్రాంతమంటే, అడుగడుక్కీ కాసేపు ఆగిపోయి చల్లగాలికి సేదతీరాలనో, పూల గుసగుసలు వినాలనో, ఆ వృక్షజాతుల పేర్లను ఊహిస్తూ ఉండిపోవాలనో అనిపించక మానదు.
. మత్తెక్కించే వాసనలు వెదజల్లే పూల మొక్కలను   ఒళ్ళంతా కప్పుకు వగలుపోయే వనమిది.

నే బెంగళూరుకు వచ్చిన కొత్తల్లో , ఆఫీసులో మా బిల్డింగ్ బయటకు వచ్చి ఎవరితోనో కబుర్లాడుతుంటే, పక్కన ఉన్న చెట్ల పొదల్లో నుండి ఆకుల శబ్దం లాంటిదేదో వచ్చింది. నాలోని సౌందర్యోపాసకురాలు కళ్ళు మూసుకుని చెవులు రిక్కించి "ఏమి ఈ వింతైన శబ్దము" అని ఆశ్చర్యపోతూండగా, మెదడులో నిద్రపోతున్న తెలివి ఉలిక్కిపడి లేచి "అమ్మా తల్లీ , కళ్ళు తెరిచి ఆశ్చర్యపో! అది నీ అంత పొడవున్న పాము" అని అరిచి గోలెట్టింది. ఆ తర్వాత ఒక్క నా బిల్డింగ్ మాత్రమే కాకుండా అటు నాలుగు , ఇటు నాలుగు భవంతుల్లో నుండి జనాలు బయటకు రాకుండానే పాము వచ్చిందన్న సంగతి అర్థం చేసుకునేలా అరిచాననుకోండీ..అది వేరే విషయం :).



ఈ నరసింహ వనంలో అడుగు పెట్టగానే , " Beware of snakes" అని హెచ్చరిక కనపడగానే ఆ విషయమే జ్ఞప్తికొచ్చి, కాస్త ఉలిక్కిపడ్డాను. చాలా పెద్ద "నాగ సంపంగి" చెట్టు ఉంటుంది మొదట్లోనే! అబ్బబబ్బ, ఏమి ఘుమ్మను పరిమళాలనుకున్నారూ.... పాములేం ఖర్మ, అనకొండలొచ్చినా అక్కడ నుండి వెంటనే కదిలేది లేదని నా లాంటి భీతహరిణులు కూడా భీష్మించుకుని చాలా సేపు కూర్చున్నారిక్కడ. ఇక అది మొదలు వనాన చిట్టచివరకు ఉన్న కాల భైరవ గుడి వరకూ, దారి పొడవునా బోలెడు పూల మొక్కలూ, కొబ్బరి, అరటి, తమలపాకు తోటలూ, గజశాల, గోశాల, శంకర ప్రభోదిత అద్వైత సంబంధిత విషయాలపై రీసర్చ్‌కు గానూ చక్కటి లైబ్రరీ, గురు పరంపరను చిత్రాల్లో చూపించే విశాలమైన భవంతులు, తోరణాలల్లే అమరిన పూలతీవెలూ, మొత్తం వనమంతా - కాలి బాట పొడుగూతా ఓపిగ్గా వేసిన రంగవల్లికలూ, భూమి వైపు వాలి, వంగి కనువిందు చేసిన ఎంచక్కటి ఎర్రటి ముద్ద మందారాలూ అన్నీ స్పర్శాభాగ్యమైనా పొందరేమని మనని తొందరపెడుతున్నట్టే ఉంటాయి.

ఋష్యశృంగ గుడి

నేను మొదటిసారి విన్నప్పుడు విపరీతంగా ఆశ్చర్యపోయిన కథల్లో, ఋష్యశృంగుడి కథ ఒకటి. ఆయన జననం, ఆయన శక్తి, ఆయన రూపం - అన్నీ అచ్చెరువొందించేవే! ఈయన పేరు మీదుగానే ఈ ప్రాంతానికి శృంగగిరి అని నామకరణం చేశారని మనలో చాలా మందికి తెలుసు. శృంగేరికి రమారమి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఋష్యశృంగుడి గుడి ఉంటుంది. శిధిలావస్థలో ఉందనలేను కానీ, మరింత మెఱుగ్గా ఉంచుకోవలసిన స్థలపురాణం కలిగిన చోటు. ఇక్కడి శివలింగం ముందు వైపు ఋష్యశృంగుడినీ, వెనుకవైపు శివుడినీ కలిగి ఉంటుంది. ఈ శివలింగము, పక్కనే ఉన్న ద్విభుజ గణపతి స్వయంభువులని పూజారులు చెప్పారు. అన్నట్టూ - ఈ ఏడెనిమిది కిలోమీటర్లూ అడవిలో ఆటో ప్రయాణం -అది అద్భుతమంతే! మరో మాట లేదు. తిరిగి వచ్చేసేటప్పుడు దారిలో ఒక చోట కుడి వైపుగా నాలుగు కిలోమీటర్ల దూరం వెళితే చక్కటి దుర్గా ఆలయం ఉంటుంది. చుట్టూ మరింకేమీ ఉండవు - అరటిపళ్ళేమైనా తెచ్చామేమోనని మన వైపు ఆశగా పరుగులిడుతూ వచ్చే లేగదూడలు తప్ప.

ఇవన్నీ కాక, పుస్తకాభిమానుల కోసం ప్రత్యేకంగా మఠం వాళ్ళదే ఒక బుక్ హౌస్ ఉంది. "శ్రీమత్పయోనిథి నికేతన చక్రపాణే..భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే.." అన్న నరసింహ కరావలంబ స్తోత్రమూ, "భజగోవిందం", "సౌందర్యలహరి", లింగాష్టకాలూ..ఒక్కటేమిటీ, ఆదిశంకరులు రాసిన ప్రతీదీ మనసులోకి చొచ్చుకుపోవలసిందే, ముద్ర వేయాలసిందే! ఆ మహనీయుని అవతార విశేషాలన్నీ రంగరించిన శంకర విజయం మొదలుకుని, గురుపరంపర వరకూ అన్నీ ఆ పుస్తక విక్రేతల వద్ద దొరుకుతాయి. ఆసక్తి కలవారు అక్కడొక అరగంట గడిపే వీలుంది.

మఠం వాళ్ళు ఏర్పాటు చేసిన వసతి సదుపాయాలు బానే ఉంటాయనీ, అంతగా నచ్చని పక్షంలో నాలుగడుగుల దూరంలోనే మంచి హోటల్స్ ఉంటాయనీ విని ఉండడంతో, ఒక్క రాత్రి బసకు ముందస్తు ఏర్పాట్లేవీ లేకుండానే వెళ్ళిపోయాం. ఆ ధైర్యం మమ్మల్ని నిరాశపరచలేదు. 150/- కు ఇంత మంచి గదులు ఈ మధ్య కాలంలో నేనెక్కడా చూడలేదు. మీరు గనుక వెళ్ళడం కుదిరితే అక్కడొకసారి ప్రయత్నించి చూడండి.


ఇవీ, ఈ రెండు రోజుల ప్రయాణంలో , "సౌందర్య లహరి"లో ఏకమైన మనసు దాచుకున్న మధుర స్మృతులు. "సౌందర్య లహరి"ని ప్రస్తావించాను కనుక, అందులో నుండి, చదివినప్పుడల్లా/విన్నప్పుడల్లా మనసుకు ఆహ్లదాన్నీ, పెదవులకు చిన్ని చిరునవ్వునీ కానుకిచ్చి పోయే - నాకిష్టమైన పద్యంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.


సుధా మప్యాస్వాద్య రతిభయ జరామృత్యు హరిణీం
విప్పద్యంతే విశ్వే విథిశత ముఖాద్యాదివిషదః |
కరాళం యత్వేళం కబళితవతః కాలకలనా
న శంభో స్తన్మూలం తవ జనని తాటంక మహిమా||

( సకల దేవతలూ అమృతము పుచ్చుకుని కూడా ప్రళయ కాలమున నశించినా, కాలకూట విషము త్రాగిన సదాశివునికి మరణము లేదు లేదంటున్నారు కానీ, తల్లీ, అదంతా నీ తాటంక(చెవి కమ్మల) మహిమ గాక ఆ పరమేశ్వరునిదా!"

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles