Monday 30 November 2015

ప్రమాదల నుంచి రక్షించే మహామంత్రం

ప్రమాదల నుంచి రక్షించే మహామంత్రం
.....................................................
మానవుడి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహా మృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్ర దీక్షలో హోమ భస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు. ఈ మంత్రం పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు.

ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఇది ఒక విధమైన సంజీవని మంత్రం అని చెప్పుకోవచ్చు. ఆపదలు కలిగినపుడు, అనూహ్య సమస్యలు ఎదురైనప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును. ఈ మంత్రానికి సర్వ రోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.

ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ ముక్షీయ మామృతాత్

తాత్పర్యం: అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించుచున్నాము. ఆయన దోస పండును తొడిమ నుంచి వేరు చేసినట్టుగా (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వం కొరకు మృత్యు బంధనం నుంచి విడిపించు గాక!

ఈ మంత్రాన్ని సాధారణంగా ముమ్మారు గాని, 9 మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు.  ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్ట శక్తులను తరిమికొడతాయి. దాంతో మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు.

ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో 3 కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను 3 మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.

ఓంకారంతో శ్రీకారం..
ఓం.. భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుంచి ‘అ‘ కారం. యజుర్వేదం నుంచి ‘ఉ‘ కారం, సామవేదం నుంచి ‘మ‘ కారాలు జన్మించి, ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.

త్ర్యంబకం
భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని 3వ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే 3 నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.

యజామహే
యజామహే అంటే.. ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రిగిపోయిన స్వాఇ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.

సుగంధిం
సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలు దిశలా పరిమళాలను వెదజల్లినట్టుగా మనల్ని తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి అనుగ్రహిస్తాడు.

పుష్టి వర్థనం
మనము పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి అంతటా నెలకొని ఉన్నాడు. సకలచరాచరా సృష్టి అంతా ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన మనల్ని కచ్చితంగా కాపాడుతాడు. ఇందుకు ఓ ఉదాహరణ గుహుని కథ. గుహుడనే వేటగాడు ఒక రోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈ లోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.

ఉర్వారుక మివ బంధనాత్
దోసకాయ పక్వానికి వచ్చిన సమయంలో.. దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ భగవానుడు మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తాడు.

మృతోర్ముక్షీయ
సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడా కాపాడమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే. ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.

అమృతాత్
స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను స్తుతించిన విధానం ఇలా ఉంది..
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమ శివుడు. మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే.

మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా రక్షణ పొందుతాము. మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడా పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles