అరిషడ్వర్గాల అంతానికే అయ్యప్పస్వామి దీక్ష ||
మానవ జన్మకి పరమార్థం మోక్షాన్ని పొందడమే - అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డు తగిలే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్యర్యాలనే అరిషడ్వర్గాలని అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను వహించాల్సి వుంది.
"జీవానాం నరజన్మ దుర్లభం" - సకల చరాచర జీవరాశులన్నిటికన్నా మానవుడే శ్రేష్టుడు గనుక, ఋషి అంతటి వాడవ్వల్సిన మనిషి మసై, బూడిదై పోకూడదని, ఈ జన్మలోనే ముక్తిని పొంది "మానవుడు తన జన్మను చరితార్థం చేసుకోవాలనే" ఉద్దేశంతో 41 రోజులు దీక్షను ఆచరించి, ఆ దీక్షలో పొందిన ఆధ్యాత్మిక ఆనంద, అనుభవాలను మానవుడు తన జీవితకాలమంతా పొంది తద్వారా మోక్షాన్ని పొంది తరించాలన్నదే భగవంతుని ఆంతర్యం.
ఈ దీక్షా కాలంలో కఠిన బ్రహ్మచర్యాన్ని, శీతలోదకస్నానం(చన్నీటి స్నానం), భూతలశయనం, ఏకభుక్తం, స్వయంపాకం వంటి పలు నియమాలు పాటిస్తారు. ఇంద్రియ నిగ్రహం కోసం 41 రోజులు దీక్ష తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళ్ళడంలో మనిషిని శారీరకంగా, మానసికంగా, దృఢంగా, క్రమశిక్షణలో ఉండేందుకు ఈ అయ్యప్ప దీక్ష ఎంతో ఉపకరిస్తుంది. శరీరంలో ఉన్న సమస్త కల్మషాలను దూరం చేసి శరీరాన్ని తేలిక పరిచే ఆరోగ్య నిధానం అయ్యప్ప దీక్షా విధానం.
భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు నియమనిష్ఠలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో, స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు జామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసి మాల, నుదుట విబూది గంధం బొట్టు ధరిస్తారు. దినచర్యలో అధిక భాగం పూజ, భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకుంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలను ఆచరిస్తారు.
కుల మత భేదాలకు అతీతంగా, జాతి, భాషల వ్యత్యాసం లేకుండా శాంతిప్రియులై, నియమ నిబంధనలతో కూడిన జీవన విధానముతో, నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ , సేవలు చేయుచూ జీవన శైలిని సుగమనము చేసుకోవటమే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను, ఇంద్రియ వికారములను, భవధారలను, భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజముగా సిద్ధింపజేయుటే అయ్యప్ప దీక్షలోని విశిష్టత...ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.