Tuesday 1 December 2015

జగద్గురు ఆది శంకరాచార్య

జగద్గురు ఆది శంకరాచార్య


సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం



         కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్బములో ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

మూడవ యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదవ యేట ఉపనయన సంస్కారము జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని యింటి యిల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందిట. దిన దిన ప్రవర్థమాన మవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారత దేశ యాత్ర మొదలు పెడుతారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదానదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు.

శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలా మంది శిష్యులు ఏర్పడుతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళుతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతిచోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగ కుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు.

ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.

బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరిద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచ్చి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్బుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేసారు. హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారు. ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడు.

తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.

తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు.ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు, చార్ ధామ్ మొదలైన పుణ్య క్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి, సమాజము భాసిల్లుతున్నాయి.

శంకరుల రచనలు:

ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము
        ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పై మెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి మొదలైనవి, ఇంకొక పై మెట్టుపై భాష్యాలు.

ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. కొన్ని స్తోత్రాల వివరాలు.

విష్ణు షట్పది:

మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.

సాధనా పంచకము:

శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.

దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము.

శివ సువర్ణమాలా స్తుతి:

యాభై శ్లోకాలలో లయ బద్ధమైన పదాలు, భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనము తో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు ఆది శంకరులు రచించారు. సాంబ = స+ అంబ - నిరంతరం ఆ జగదంబ అయిన పార్వతితో కూడి అర్థనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమ శివుడు సాంబుడు అయినాడు. పార్వతీ సమేతుడవైన శివా! శంభో! నీ పాదములకు నమస్కారములు. నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి, అగణిత గుణ గణములను ఆది శంకరులు నుతించారు. స్తోత్రము ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన, కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు. యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడై, దైవ సాక్షాత్కారము కలిగి, ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే, ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడ గలుగుతుంది.

ఆయన మహిమను తెలిపే ఒక స్తుతి - తోటకాష్టకము:

ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది.
శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు. గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో 'వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం' అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు.

ముగింపు:

ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినది. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్గారువులకు శత సహస్ర పాదాభివందనములు

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles