వాల్మీకి రామాయణం
28వ దినము, బాలకాండ
తరవాత ఆ కన్యలందరూ కుశనాభుడి దెగ్గరికి వెళ్లి జెరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, " అమ్మా! మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని.
క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః |
క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్ ||
స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. అమ్మా! నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు, మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు, అందం అంటె ఇది. ఓర్పె దానం, అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పె, ఓర్పుకి మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఆ ఓర్పు వల్లనె ఈ భూమి నిలబడుతోంది " అని చెప్పాడు.
అదే సమయంలొ చూళి అనే ఒక మహర్షికి, ఊర్మిళకుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతొ....... నేను నీకు ఏమిచెయ్యగలను అని అడిగారు. అప్పుడామె.......నేను ఎవరికీ భార్యని కాను, కాని అపారమైన తపఃశ్శక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన, శారీరిక సంపర్కం లేకుండా, మానసికమైన తపఃఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానస పుత్రుడిని సోమదకి ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు, కాపిల్యము అనే నగరంలొ ఉండేవాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జెరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటె ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి, వాళ్ళు మళ్ళి పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది" అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.