వాల్మీకి రామాయణం
33వ దినము, బాలకాండ.
గంగ అసలు భూమి మీదకి ఎందుకొచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడుపరిపాలించేవాడు, ఆయనకి కేశిని, సుమతి అని ఇద్దరు భార్యలు. సుమతి గరుక్మంతుడి సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు స్రవణాన్ని చేరుకొని 100సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగు స్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న ఇద్దరు భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు, రెండవ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేశిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగగా, ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు. పెద్ద భార్య అయిన కేశిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది, నాకు మహొత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు.
కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనే వాడు పుట్టాడు, రెండవ భార్యకి ఒక సొరకాయ పుట్టింది, ఆ సొరకాయ కిందపడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు, వాళ్ళందరిని కలిపి సగరులు అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రొజూ రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయు నదిలోకి తీసుకెళ్ళి, నీళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి.....
ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః ||
పౌరాణాం అహితే యుక్తః పిత్రా నిర్వాసితః పురాత్ ||
తప్పు చేసినవాడు కొడుకైనా సరే, అతనివల్ల ప్రజలకి కీడు జెరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడిని తన దెగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి. అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేథ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడా సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది, కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండని చెప్పి పంపాడు. వజ్రాల్లాంటి తమ గొళ్ళతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దెగ్గరికి వెళ్లి................దేవా! సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మ దేవుడు..........మీరెవరు కంగారు పడమాకండి, ఈ భూమంతా శ్రీమహా విష్ణువుది, కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు, ప్రస్తుతం ఆయనపాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు.