కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువైన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు.
ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని లోనికి వెళ్ళకుండా అడ్డగించాడు.
దాంతో పరశురాముడు ధిక్కరించడంతో గణేశుడు తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి పడేశాడు. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడి పడింది.
ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు బయటకు వచ్చారు. నెత్తురోడుతున్న బాల గణపతిని పార్వతి ఎత్తుకొని పరశురాముడిని తీవ్రంగా మందలించింది.
తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించమని పరశురాముడు వేడుకున్నాడు. ఒక దంతం పోగొట్టుకున్న ఆ నాటినుంచి గణపతి ఏకదంతుడుగా పేరు పొందాడు.