కొందరు లలితా సహస్రనామ పారాయణ ప్రతి నిత్యం చేస్తుంటారు. కొందరు రెండు పూటలా చేస్తారు
కొందరు ప్రత్యేక దినాలలో…ఇలా రకరకాలుగా…
ఈ మధ్య లలితా సహస్రనామ పారాయణ చేసేవారి సంఖ్య ఎక్కువైందనే చెప్పొచ్చు.
వీరిలో కొందరికి మామూలుగా నిత్యం మహా నైవేద్యం పెట్టే అలవాటు వుంటుంది.
ఇలాంటివారికి ఏ సమస్యాలేదు.కొందరికి ఇంట్లో మడిగాగానీ, నిష్టగాగానీ చెయ్యటం కుదరదు.
ఒక్కొక్కళ్లకి ఒక్కో రకం ఇబ్బంది.ఇలాంటివారికి లలితా సహస్రనామం పారాయణ చేసినప్పుడు అనేక అనుమానాలు.
మహా నైవేద్యం పెట్టలేక పోయామే..అసలు అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి..ఏదో ఇవాళ ఒక పండు పెట్టేశాను.
సరిగ్గా చేశానో లేదో…ఇలా గుంజాటన పడతారు. అందరికీ మహా నైవేద్యం పెట్టటం అన్నివేళలా కుదరకపోవచ్చు.నిత్యం పారాయణ చేసేవారు తొందరగా అయ్యేది ఏదైనా చేసి పెట్టవచ్చు.అమ్మవారిని హరిద్రాన్నైక రసికా అని కీర్తిస్తాం.పెసర పప్పు వేసిన పులగం నైవేద్యం పెట్టవచ్చు.అదీ కుదరకపోతే కర్జూర పండు నైవేద్యం పెడితే మహా నైవేద్యం పెట్టినట్లేట.ఒక్కొక్కసారి అవి కూడా వీలు పడకపోవచ్చు..సమయానికి దొరకక, తెచ్చినవి అయిపోయి వగైరా ఏ కారణ వల్లనైనా.అప్పుడు వీలయితే ఆవుపాలలో, లేదా ఇంట్లో వుండే పాలల్లో తేనె కలిపి నైవేద్యం పెట్టవచ్చు.అందుబాటులో వున్న ఏ పండయినా నైవేద్యం పెట్టవచ్చు.అమ్మవారికి కావలసినది భక్తికానీ ఏమి పెట్టాము అన్నది కాదు.మనం నిండు మనసుతో భక్తిగా ఏదైనా సమర్పించవచ్చు.
కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వుంటాయి.చంద్ర దోష పరిహారార్ధం కొందరు పౌర్ణమినాడు చంద్రుని లలితా పరమేశ్వరి రూపంలో పూజించి, ఆరుబయట చంద్ర కిరణాలు పడే చోట పూజ చేసి పాలు, బెల్లంతో చేసిన పరవాణ్ణం నైవేద్యం పెట్టి అందరికీ పెట్టి వారు తింటారు.అలాగే నవరాత్రులలో అమ్మవారిని పూజించేవారు మినప గారెలు తప్పనిసరిగా నైవేద్యం పెడతారు.శుక్రవారం నియమంగా పారాయణ చేసేవారు అమ్మ గుడాన్నప్రీత మానస కనుకబెల్లం వేసిన పరనాణ్ణం నైవేద్యం పెడతారు.