భాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు. ఈ దశమ స్కంధమును పూర్వోత్తర భాగాములని మరల రెండుగా విభజించారు. పూర్వభాగమును రుక్మిణీకళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందు వలన, చూసినందు వలన, వినినందు వలన, చదివినందు వలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడయిన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీకళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారు
వినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు లగ్రజుం
డనయుఁడు రుక్మినాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.
విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి.అయిదుగురి చెల్లెలయిన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది.
పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబు లందు;గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;
రమణీయ మందిరారామ దేశంబులఁ బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు; సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగుబాలికలతోడఁ జెలరేగి బంతు లాడ శారికా కీర పంక్తికిఁ జదువుఁ జెప్పు బర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళంబులకుఁ జూపు మందగతులు. ఆతల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీ దేవి అంతఃపురము నుండి ఎప్పుడూ డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపుకుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను ఒండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాలు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఊయలలు ఊగుతూ ఉండేది చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.