Friday, 2 December 2016

daya chesi andaru opikaga chadavandi........(మున్ముందు మంచి రోజులు) అని దేశ ప్రజలను నమ్మించడానికి ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులైన ఎంపీలు కొలువు తీరిన సభలలో నోట్ల రద్దుపై మాట్లాడటానికి ఇష్టపడని నరేంద్ర మోదీ ప్రజలు ప్రశ్నించే అవకాశం లేని బహిరంగ సభలలో మాత్రం ఈ అంశంపై మాట్లాడుతున్నారు. ప్రధాని చెబుతున్న అచ్చే దిన్‌ వస్తాయో లేదో? వాటిని మనలో ఎందరు చూస్తారో తెలియదు గానీ ప్రస్తుతానికి బురే దిన్‌(చెడ్డ రోజులు)ను చూస్తున్నాం.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రధానమంత్రి అప్రజాస్వామికంగా, మంత్రిమండలిలో కూడా చర్చించకుండా అరాచకానికి దారితీసే నిర్ణయం తీసుకున్నప్పటికీ నిలువరించలేని, గట్టిగా నిలదీయలేని దుస్థితిలో రాజకీయ వ్యవస్థ ఉండటం శోచనీయం.

అమ్మాయి పెళ్లి.. బ్యాంకులో దాచుకున్న డబ్బును నాకు ఇవ్వడానికి మీరు షరతులు పెట్టడమేమిటి?’’, ‘‘మా యింట్లో పెద్దవాళ్ళున్నారు. ఉన్నట్లుండి వైద్యం అవసరమైతే ఎలా?’’, ‘‘నేను రైతుని, కూలీలకు డబ్బు ఎట్లా ఇవ్వాలి’’ - పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా సామాన్యులు వేస్తున్న ప్రశ్నలు ఇవి. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు అది నిలువెత్తు నిదర్శనం. నిన్నటికి నిన్న సోదరుడి అంత్యక్రియల నిర్వహణ కోసం ఒక సోదరి తన ఖాతాలో ఉన్న సొమ్మును తీసుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకోవలసిన పరిస్థితి. ఇలా దాదాపు 20 రోజులుగా దేశంలో ఒక్కసారిగా నగదు కొరత ఏర్పడటంతో సామాన్యులు, చిరు వ్యాపారుల నుంచి ప్రతి ఒక్కరూ అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. ఇంకా ఎదుర్కొంటున్నారు. ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. అవును నల్లధనంపై పోరు పేరిట ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల లక్ష్యం ఎంత వరకు సిద్ధించిందో తెలియదు గానీ, ప్రజలు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వ్యాపారాలు నిలిచిపోయాయి. తొలుత ప్రధానమంత్రి నిర్ణయాన్ని అభినందించిన అంతర్జాతీయ మీడియా కూడా వాస్తవ పరిస్థితులను గ్రహించిన తర్వాత ఇదేమి నిర్ణయం అంటూ వ్యాఖ్యలు చేసింది. దాదాపుగా 80 శాతం వరకు నగదు లావాదేవీలు జరిగే దేశంలో ఉన్నపళంగా 86 శాతం కరెన్సీని రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించడం ఏమిటి? అన్న ప్రశ్నకు ఆర్థిక నిపుణులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రధాని నిర్ణయాన్ని గట్టిగా విమర్శించడానికి దాదాపుగా అందరూ జంకుతున్నారు.

                  బహిరంగంగా విమర్శిస్తే తమ దగ్గర నల్లధనం ఉందని లేదా నల్లధనాన్ని సమర్థిస్తున్నారని అపోహ పడతారన్న భయంతో ఎవరికివారు సన్నాయి నొక్కులకే పరిమితం అవుతున్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంటును స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలు కూడా ‘నిర్ణయం మంచిదే, అయితే...’ అని మాత్రమే అంటున్నారంటే వారిలో ఏదో బెరుకు ఉందన్న మాటే కదా! పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మాత్రమే నరేంద్ర మోదీ నిర్ణయాన్ని గట్టిగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే వారి ఇద్దరిపై అవినీతి ఆరోపణలు లేవు. వారి వద్ద నల్లధనం ఉందని ఎవరూ విమర్శించలేరు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రధానమంత్రి అప్రజాస్వామికంగా, మంత్రిమండలిలో కూడా చర్చించకుండా అరాచకానికి దారితీసే నిర్ణయం తీసుకున్నప్పటికీ నిలువరించలేని, గట్టిగా నిలదీయలేని దుస్థితిలో రాజకీయ వ్యవస్థ ఉండటం శోచనీయం. పార్లమెంటులో తిరుగులేని మెజారిటీ ఉందనీ, ప్రజలలో ఆదరణ ఉందన్న నమ్మకంతో నరేంద్ర మోదీ ఈ దుస్సాహసానికి ఒడిగట్టారు. ఇవ్వాళ ఆదరించిన ప్రజలే రేపు తిరస్కరిస్తారు. ప్రజల అభిప్రాయాలు మారడానికి ఎంతో సమయం పట్టదు. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఒక్కటే సానుభూతి ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడి 30 స్థానాలు గెలుచుకుని లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించింది.

                  అప్పుడు లోక్‌సభలో తెలుగుదేశం నాయకుడిగా ఆదిలాబాద్‌ నుంచి ఎన్నికైన సి.మాధవరెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు కేంద్రంలో అధికారం చలాయిస్తున్న భారతీయ జనతా పార్టీకి అప్పుడు లోక్‌సభలో ఇద్దరే సభ్యులు ఉండేవారు. అందులో ఒకరైన సి.జంగారెడ్డి తెలుగుదేశం పార్టీతో పొత్తు పుణ్యమా అని హనుమకొండలో గెలిచారు. 1984 ఎన్నికలలో అంతటి ప్రాభవాన్ని చూసిన తెలుగుదేశం పార్టీతో పాటు కేంద్రంలో తిరుగులేని మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌ పార్టీ కూడా 1989 ఎన్నికలలో ఓడిపోయాయి. రాజకీయాలు ఇలాగే ఉంటాయి. ప్రజాస్వామ్య వాసన అంటే పడని ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విషయం తెలియదని అనుకోలేం! పెద్ద నోట్ల రద్దు తర్వాత రాజ్యసభలో మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్‌ చక్కగా మాట్లాడారు. ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో నుంచి సొమ్ములు తీసుకోవడానికి ఆంక్షలు విధించిన దేశాన్ని ఒక్కదాన్ని అయినా చూపించగలరా? అని ఆయన ప్రశ్నించారు. అవును. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకోవడంపై ఆంక్షలు ఏమిటి? ఎవడబ్బ సొమ్ము అని ఆంక్షలు పెడతారు? ప్రజలు చట్టబద్ధంగా కష్టపడి సంపాదించుకున్న సొమ్మును బ్యాంకులలో భద్రపరుచుకుంటారు. ఎందుకంటే తమ సొమ్ముకు భద్రత ఉండటంతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకోవచ్చునన్న భరోసా ఉండటం వల్లనే కదా! నీ దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే కదా అని అన్న మాటను మనం వాడుతుంటాం. అంటే మన బ్యాంకుల మీద మనకు అంత నమ్మకం ఉందన్న మాట! అలాంటి బ్యాంకులు ఇవ్వాళ మా దగ్గర డబ్బు లేదని ఖాతాదారులకు చేతులెత్తేస్తున్నాయి. కొన్ని చోట్ల బ్యాంకులను మూసివేస్తున్నారు.

                  మన వద్ద ఉన్న డబ్బుకు రిజర్వ్‌ బ్యాంకు చట్టబద్ధంగా పూచీ పడింది. మన సొమ్ము చట్టబద్ధమైనదా? లెక్కలో చూపనిదా? అన్నది తర్వాత విషయం. మన దగ్గర ఉన్న 500 లేదా వెయ్యి రూపాయల నోటుకు రిజర్వ్‌ బ్యాంకు పూచీ ఉంది. ప్రత్యామ్నాయ నోట్లను అందించకుండా నీ దగ్గర ఉన్న నోటు ఇక నుంచి చెల్లదు అని ప్రకటించే అధికారం ప్రధానమంత్రికి ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం కావాలి. మన డబ్బుకు పూచీ పడ్డ రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నవంబరు ఎనిమిదో తేదీ తర్వాత ఏమయ్యారో తెలియదు! రిజర్వ్‌ బ్యాంకు చేయాల్సిన పనులను, ఇవ్వాల్సిన వివరణలను కేంద్ర ఆర్థిక శాఖ ఇస్తోంది. ఆర్థిక రంగంలో ఇదొక విపరీతం.

                  అత్యవసరాలకు కూడా డబ్బు డ్రా చేసుకోలేని స్థితిలోకి జనాన్ని నెట్టేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయా సందర్భాలలో భావోద్వేగాలకు గురై కంటతడి పెట్టుకున్నారన్న వార్తలు వచ్చాయి. నిజానికి దాచుకున్న డబ్బును తీసుకునే వీలు లేక జనం ఏడుస్తున్నారు. అటు ప్రధాని ఇటు ప్రజలు కంటతడి పెట్టుకుంటూ ఉంటే నల్లధనం మాత్రం నవ్వులు చిందిస్తోంది. భవిష్యత్తులో కూడా చిందిస్తుంది. దేశ చరిత్రలోనే కాదు- ప్రపంచ చరిత్రలో కూడా ఇంత పెద్ద దేశంలో ఆర్థిక రంగాన్ని ఇంతగా కుదిపేసిన సంఘటన మరెక్కడా జరగలేదు. ప్రజల సెంటిమెంట్‌ను క్యాష్‌ చేసుకోవడం కోసం వారికి క్యాష్‌ లేకుండా చేసినా ఫర్వాలేదని ప్రధాని భావించినట్టు ఉన్నారు. డబ్బున్న వాడిపై డబ్బు లేనివాడికి కోపం ఉండటం మనుషుల సైకాలజీ! అందుకే ప్రధాని నిర్ణయం వల్ల నల్లధనం ఉన్నవారు ‘చచ్చారు’ అని సామాన్య ప్రజలు కొందరు సంబరపడుతున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో తమకు ఎదురుకానున్న కష్టాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతోంది.

  ఈ ప్రశ్నలకు బదులేది?
ఇంతకీ నల్లకుబేరులను అంతం చేయాలన్న ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందా? అంటే అదీ లేదు. అక్రమ సంపాదన పోగేసుకున్నవారెవ్వరూ తమ ఇళ్లలో నగదును సూట్‌కేసులలో దాచిపెట్టుకోరు. భూములు, భవనాలు, బంగారం, వజ్రాలపై పెట్టుబడులు పెడతారు. నల్ల డబ్బు భోషాణాలలో మూలగదు. అంతే కాదు నల్లడబ్బు ఎప్పటికప్పుడు రంగు మార్చుకుంటుంది. కొంతమంది చేతుల్లోకి వెళితే అది తెల్లధనం అవుతుంది. మరికొందరి దగ్గర నల్లధనంగా పిలవబడుతుంది గానీ కరెన్సీ విలువ మాత్రం మారదు. తెలుగు రాష్ర్టాలలో చాలా మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల వద్ద లంచాల రూపంలో తీసుకున్న డబ్బు కోట్లలో ఉంది. అది ఏదీ కూడా వారి వద్ద నగదు రూపంలో లేదు. ఈ విషయమై ఒక అధికారిని ప్రశ్నించగా, ‘‘నేనేమీ అమాయకుడిని కాదు. నా దగ్గర ఉన్న డబ్బును రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాను. మరికొంత బంగారం రూపంలో మార్చకున్నాను’’ అని బదులిచ్చారు. అధికారంలో ఉన్న కొంతమంది నాయకుల వద్ద వందల కోట్లలో నల్లధనం ఉండి ఉంటుంది. ప్రధానమంత్రి నిర్ణయం తర్వాత ఆ డబ్బుకు కూడా కాళ్లు వచ్చాయి. ఎవరి చేతుల్లోకి చేరాలో వారి చేతుల్లోకి చేరింది. నలుపును తెలుపుగా మార్చే పని మొదలైంది. మరికొంతమంది ఇచ్చిన వారికే ఆ సొమ్మును తిరిగి ఇచ్చి కొంత కాలం తర్వాత కొత్త కరెన్సీ రూపంలో ఇవ్వాలని ఆదేశించారు.

                  ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి తగ్గిన సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. గడచిన రెండు మూడు రోజులలోనే తెలుగు రాష్ర్టాలలో లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు నలుగురిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అవినీతి ఇవ్వాళ కొత్తగా పుట్టుకు వచ్చింది ఏమీ కాదు. కాకపోతే ఇప్పుడు జడలు విరబోసుకుని స్వైర విహారం చేస్తోంది. అవినీతికి ఆస్కారం లేని విధానాలను ప్రవేశపెట్టకుండా కరెన్సీని ఎప్పటికప్పుడు రద్దు చేసుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం ఉండదు. అక్రమార్కులకు తాత్కాలిక ఇబ్బందులు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతానికి వస్తే రద్దు అయిన పెద్దనోట్లను తీసుకునేవాళ్లు తీసుకుంటూనే ఉన్నారు.
అంటే ఆ డబ్బును తెలుపుగా మార్చడానికి మార్గాలు ఉండటం వల్లనే కదా వారు అలా చేయగలగుతున్నారు.

                  ప్రధానమంత్రి లక్ష్యం మంచిదే అని మనం కూడా నమ్ముదాం! అయితే అమలులో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ప్రత్యామ్నాయ కరెన్సీని అందుబాటులోకి తీసుకురాకుండా చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేయడం వల్లనే ప్రస్తుత దుస్థితి దాపురించింది. మన దేశ ఆర్థిక వ్యవస్థతో నల్లధనానికి విడదీయలేని బంధం ఉంది. నల్లధనం పుణ్యమా అనే పలు రంగాలు అభివృద్ధి చెందాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. దేశానికి, రాష్ర్టాలకు రాబడి పెరుగుతోంది. ప్రధానమంత్రి తాజా నిర్ణయం తర్వాత ఈ రంగం, ఆ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. డబ్బు ఖర్చు చేయడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. అన్నిటికంటే ముఖ్యమైనది- బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులపై సామాన్య ప్రజలకు నమ్మకం ఏర్పడటానికి చాలా సమయం పట్టింది. అలాంటిది ఇప్పుడు బ్యాంకులను కూడా నమ్మలేని పరిస్థితి కల్పించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం రూపంలో ఉన్న మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు ఆశపడుతున్నారు. వారు ఆశించినట్టుగానే జరుగుతుందని అనుకుందాం. కానీ రానున్న సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ రాబడి పడిపోతుంది. రాష్ర్టాల ఆదాయంపై ఇప్పటికే ప్రభావం పడింది. అంటే వచ్చేదానికి పోయేదానికి చెల్లు అవుతుంది. స్వల్ప కాలంలోనూ, దీర్ఘకాలంలోనూ దేశ ప్రజలపైన, ఆర్థిక రంగంపైన ప్రభావం చూపే ఇంతటి ముఖ్యమైన నిర్ణయాన్ని నరేంద్ర మోదీ మాత్రమే తీసుకోగలరు.

                  ఇందిరాగాంధీ వంటి నాయకురాలు కూడా సలహాలు, సంప్రదింపుల కోసం కొందరిపై ఆధారపడేవారు. ప్రధానికి ఈ సలహా ఎవరు ఇచ్చారో తెలియదు గానీ ఇచ్చిన వాళ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఎందుకు ఆలోచించలేదో? ప్రత్యామ్నాయ కరెన్సీ కోసం దేశవ్యాప్తంగా జనాలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్న దృశ్యాల తర్వాత జరిగిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఏమి జరుగుతోంది? ఏమి జరగబోతోంది? అని ప్రశ్నించలేదు. ఆ పార్టీలో మోదీ భజనపరులు పెరిగిపోవడమే ఇందుకు కారణం. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికే కాదు, బీజేపీకి కూడా మంచిది కాదు. నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబడుతున్న వారిపై విరుచుకుపడాలని బీజేపీ నిర్ణయించుకుంది. తన తప్పును తప్పుబట్టిన వారిని దేశ ద్రోహులుగా చిత్రించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీకి విశ్వసనీయత కొరవడటం వల్ల బీజేపీ పాచికలు ప్రస్తుతానికి పారవచ్చు. పరిస్థితులు ప్రతికూలించినప్పుడు ప్రజలే ప్రత్యామ్నాయాన్ని సృష్టిస్తారు. ప్రజల అవసరాలు తీర్చగలిగే స్థాయిలో ప్రత్యామ్నాయ కరెన్సీ అందుబాటులోకి రావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు చెబుతున్నారు. 86 శాతం కరెన్సీని రద్దు చేయాలని నిర్ణయించుకున్న ప్రధానమంత్రి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎందుకు దృష్టి పెట్టలేదో చెప్పాలి. ఏ ఉద్దేశంతో 2000 రూపాయల నోట్లను ముద్రించారో చెప్పాలి. చిన్న నోట్ల కొరత కారణంగా రెండు వేల రూపాయల నోట్లను ప్రజలే డీమానిటైజ్‌ చేశారు. ఆ నోటు ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే అని నిర్ధారించుకున్నారు. రెండు రోజుల్లో ఏటీఎంలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించిన ప్రధానమంత్రి ఇప్పటికీ మెజారిటీ ఏటీఎంలు అందుబాటులోకి రాకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలి. ఈ వైఫల్యాలకి బాధ్యత ఎవరిదో చెప్పాలి. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఒక్కసారిగా తమ ఆస్తుల విలువ పడిపోయిందని బాధపడుతున్న వారికి ఉపశమనం ఎవరు కలిగిస్తారో చెప్పాలి.

                  వ్యాపారాలు కుదేలై విలవిలలాడుతున్నవారిని ఎవరు ఆదుకుంటారో చెప్పాలి. సొంత డబ్బుతో పిల్లల పెళ్లిళ్లు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్న వారికి ఎవరు సంజాయిషీ ఇస్తారో చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉపాధి కోల్పోతున్నవారికి ప్రత్యామ్నాయం ఎవరు చూపుతారో చెప్పాలి. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు దేశంలో ఇకపై నల్లధనం ఉండబోదని ప్రధానమంత్రి హామీ ఇవ్వగలరా? ఇప్పుడు తాజాగా బంగారం కొనుగోళ్లపై కూడా పరిమితులు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మహిళలు తిరగబడతారు. మన దేశంలో మహిళలకు బంగారంపై ఉండే మక్కువ ఎంతో అందరికీ తెలిసిందే! కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని దేశ ప్రజలు ఇప్పటికే అభద్రతకు గురయ్యారు. ఈ కారణంగానే డబ్బులు ఉన్నా ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేక సడలింపులు, మినహాయింపులు ఇస్తూనే వస్తున్నది. అయినా పరిస్థితులలో మార్పు లేదు. ఇన్ని సడలింపులు, మినహాయింపులు ఎందుకు ఇవ్వవలసి వస్తున్నదంటే నిర్ణయం తీసుకోవడానికి ముందు కనీస ఎక్సర్‌సైజ్‌ కూడా జరగలేదని స్పష్టం అవుతోంది కదా! పచ్చిగా చెప్పాలంటే తాను ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం విజయవంతం కాలేదన్న కోపంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కక్షతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఆ పథకం గడువు ముగియడానికి ముందు ప్రధాని పలు రకాలుగా హెచ్చరించారు. ఆదాయ వెల్లడి పథకాన్ని ఉపయోగించుకోని వారు మున్ముందు ఇబ్బందులపాలవుతారని సూటిగానే చెప్పారు.

                  చివరకు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా సామాన్యులను అగచాట్లపాలు చేశారు. దేశంలో నల్లధనం ప్రభావం అధికంగా ఉంటున్న ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి మాత్రం ప్రధానమంత్రి ప్రయత్నించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. కోట్లు లేనిదే ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితిని నివారించాలంటే ఎన్నికల సంస్కరణలు తక్షణ అవసరం. సామాన్యులు సైతం ఎన్నికలలో పోటీ చేయగల పరిస్థితి కల్పించకుండా నల్లధనం అరికడతానని పెడబొబ్బలు పెట్టినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదు. వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలలో డబ్బు పంచడం కోసం కొత్త కరెన్సీని సమీకరించుకునే పనిలో బీజేపీ ముఖ్య నాయకులు ఇప్పటికే బిజీగా ఉన్నారు. అంతెందుకు బిహార్‌లో జరిగిన ఎన్నికలలో అంతా తామై వ్యవహరించిన నరేంద్ర మోదీ, అమిత్‌ షా ద్వయం ఆ ఎన్నికలలో డబ్బు ఖర్చు చేయలేదా? నిన్నగాక మొన్న జరిగిన ఉప ఎన్నికలలో డబ్బు ఖర్చు చేయలేదా? ఉప ఎన్నికలలో తమ స్థానాలను నిలబెట్టుకున్న బీజేపీ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు హర్షించారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని చెప్పుకొంది. కానీ గత ఎన్నికలలో లభించిన మెజారిటీతో పోల్చితే ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల మెజారిటీలు పడిపోయిన విషయాన్ని మాత్రం మరుగున పెట్టుకున్నారు.

నేల విడిచి సాము!
నల్లధనాన్ని నిజంగా అరికట్టాలన్న ఉద్దేశం ప్రధానమంత్రికి ఉంటే దుందుడుకు నిర్ణయాలు తీసుకునే బదులు ఆచరణ సాధ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. దేశంలో నగదు రహిత వ్యవస్థను తీసుకురావాలని ఉబలాటపడుతున్నారు గానీ అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలోనే ఇప్పటికీ 20 నుంచి 25 శాతం వరకు నగదు లావాదేవీలు జరుగుతున్నాయని మర్చిపోతున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఆ దేశాలను చూసి మన దేశంలో కూడా నగదుతో పని లేకుండా చేయాలనుకుంటే జరిగే పనేనా? మన దేశం స్వరూపం ఏమిటి? దేశ ప్రజల సైకాలజీ ఏమిటి? అవసరాలు ఏమిటి? సదుపాయాలు ఎలా ఉన్నాయి? బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంత వరకు అందుబాటులో ఉంది? నగదు రహిత లావాదేవీలు నిర్వహించగల స్థితికి ప్రజలు చేరుకున్నారా? ఆర్థిక మోసాలను అరికట్టగలమా? వంటి అంశాల లోతుల్లోకి వెళ్లకుండా నగదురహిత లావాదేవీలు జరగాలనుకోవడం నేలవిడిచి సాము చేయడమే!

                  ప్రధానమంత్రికి తోడుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తయారయ్యారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలియని ఒకరిద్దరు అధికారులు ఇస్తున్న పనికిమాలిన సలహాలతో గడచిన రెండు మూడు రోజులుగా చంద్రబాబు క్యాష్‌లెస్‌ అనే పాటను పాడుతున్నారు. ఇళ్లకు వచ్చి పాలు, కూరగాయలు అమ్ముకునే వారిని ఈపోస్‌ యంత్రాన్ని కొనుక్కుని కార్డుల ద్వారా డబ్బు తీసుకోండి అంటే జరిగే పనేనా? వారికి వచ్చే ఆదాయం ఎంత? అన్నది ఆలోచించకుండా పది వేలు పెట్టి పోస్‌ యంత్రాలు కొనుక్కోమంటే ప్రజల్లో వ్యతిరేకత రాదా? దశలవారీగా అమలు చేయాల్సిన విధానాలను తెల్లారేసరికి అటు నరేంద్ర మోదీ, ఇటు చంద్రబాబు చేయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉంది. నల్లధనాన్ని అరికట్టాల్సిందే! అయితే దేశంలో నల్లధనం పేరుకుపోవడానికి ప్రధాన కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ప్రజలకు అర్థం కాని, అలవాటు లేని విధానాలు తీసుకొచ్చి అమలు చేయాలనుకుంటే బూమరాంగ్‌ అవుతుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆశించిన మేలు జరిగిందో లేదో తెలియదు గానీ అనేక దుష్ఫలితాలను మాత్రం చవి చూస్తున్నాం. భారతీయ ఆర్థిక వ్యవస్థ గురించి కనీస అవగాహన కూడా లేకుండా ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల జీవన విధానాన్ని నరేంద్ర మోదీ మర్చిపోయినట్టున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ కూడా ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని నియంతృత్వంతో కూడినదిగా అభివర్ణించారు.

                  నియంతృత్వంతో పాటు ఆరాచక మనస్తత్వం ఉన్నప్పుడే ఇటువంటి నిర్ణయాలు వెలువడుతాయని భావించే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం. ఆ వ్యక్తిని నిలువరించే పరిస్థితులలో ఆయనను ఆ స్థానానికి చేర్చిన బీజేపీ కూడా ప్రస్తుతం లేదు. ప్రతిపక్షాలలో ఎవరి లొసుగులు వారికి ఉన్నాయి. ‘‘మీ డబ్బు మీరు వాడుకోవడానికి వీలులేదు. ఈ అర్ధరాత్రి నుంచి మీ దగ్గర ఉన్న డబ్బు చెల్లదు- ప్రత్యామ్నాయ కరెన్సీ కూడా అందుబాటులో ఉండదు. మీ చావు మీరు చావండి’’ అని మొత్తం దేశాన్ని, దేశ ప్రజలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. అమర్త్యసేన్‌ అభిప్రాయపడినట్టుగా నియంతలు మాత్రమే ఇటువంటి నిర్ణయాలు తీసుకోగలరు. నరేంద్ర మోదీ నియంతా? కాదా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఆగే అచ్చే దిన్‌ (మున్ముందు మంచి రోజులు) అని దేశ ప్రజలను నమ్మించడానికి ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులైన ఎంపీలు కొలువు తీరిన సభలలో నోట్ల రద్దుపై మాట్లాడటానికి ఇష్టపడని నరేంద్ర మోదీ ప్రజలు ప్రశ్నించే అవకాశం లేని బహిరంగ సభలలో మాత్రం ఈ అంశంపై మాట్లాడుతున్నారు. ప్రధాని చెబుతున్న అచ్చే దిన్‌ వస్తాయో లేదో? వాటిని మనలో ఎందరు చూస్తారో తెలియదు గానీ ప్రస్తుతానికి బురే దిన్‌ (చెడ్డ రోజులు)ను చూస్తున్నాం. ఈ బురే దిన్‌ ఎన్ని రోజులు ఉంటాయో చెప్పగలిగే పరిస్థితులలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా లేరు. అచ్చే దిన్‌ వచ్చే వరకు ఇలాగే బతుకుదాం!

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles