Sunday 8 January 2017

08-28-గీతా మకరందము

08-28-గీతా మకరందము
అక్షరపరబ్రహ్మయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ|| యోగియొక్క సర్వోన్నతస్థితిని, యోగముయొక్క అపారఫలితమును తెలియజేయుచున్నాడు -
 
వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం  విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ||

తా:- యోగియైనవాడు దీనిని (ఈ అధ్యాయము చెప్పబడిన అక్షరపరబ్రహ్మతత్త్వము మున్నగువానిని) ఎఱింగి వేదములందును, యజ్ఞములందును, దానములందును, తపస్సులందును ఏ పుణ్యఫలము చెప్పబడియున్నదో, దానినంతను అతిక్రమించుచున్నాడు. (దానిని మించిన పుణ్యఫలమును బొందుచున్నాడు). మఱియు అనాదియగు సర్వోత్తమ (బ్రహ్మ) స్థానమును బొందుచున్నాడు.

వ్యాఖ్య:- ఈ అధ్యాయమందు చెప్పబడిన అక్షరపరబ్రహ్మతత్త్వము నెఱింగినవాడు ఎట్టి మహత్తరపుణ్యఫలమును నొందగలడో, ఎట్టి సర్వోన్నతస్థానము నలంకరించగలడో ఇచట వచింపబడినది. (1) వేదాధ్యయనమువలన (2) యజ్ఞాచరణమువలన (3) తపఃక్రియలవలన (4) దానములుచేయుటవలన జీవునికెంతటి పుణ్యముకలుగునో దానికంటె నధికతరమగు పుణ్యమును పరబ్రహ్మతత్త్వము నెఱింగిన యోగి పొందుచున్నాడని యిచట స్పష్టముగ చెప్పివేయబడినది. దీనిని బట్టి అన్ని పుణ్యములలోను అత్యధికమైనది యేదియో, దేనినాశ్రయించినచో పుణ్యము లన్నిటియొక్క పరాకాష్ఠను జీవుడు పొందగలడో యిచట నిరూపింపబడినట్లైనది. ప్రపంచమున పరబ్రహ్మవస్తువొకటియే సత్యమైనది. తదితరములన్నియు మిథ్యాభూతములు. కావున సత్యవస్తువు నాశ్రయించినవారికే పరిపూర్ణమగు పుణ్యఫలము లభించగలదు.
     వేదములవలన, యజ్ఞములవలన, తపస్సులవలన, దానమువలన కొంతకొంత పుణ్యము జీవునకు లభించుచునేయున్నది. కాని పరమాత్మను ధ్యానించు యోగి, లేక ఆత్మ (బ్రహ్మ) జ్ఞానము కలిగియుండు యోగి వానినన్నింటిని దాటివేయుచున్నాడు. ఆత్మప్రాప్తిచే నతడు అనంతపుణ్యమును సంపాదించుచున్నాడు. సముద్రమునందు బిందువు అంతర్భూతమైయే యుండును. ‘శతే పంచాశత్’ అనునట్లు నూటియందు యాభై యిమిడియే యుండును. అట్లే బ్రహ్మజ్ఞానజనిత మహాపుణ్యమందు తక్కిన పుణ్యములన్నియు అంతర్భూతములైయుండును. పైగా, ఆ చిన్న చిన్న పుణ్యములన్నియు పుణ్యఫలానుభవానంతరము కాలక్రమమున నశించిపోవును. కాని బ్రహ్మానుభూతి వలన కలుగు పుణ్యము అనంతమైనది. అది ఏ కాలమునను క్షయింపదు. అది నిరతిశయమైనది. తక్కిన పుణ్యములన్నియు శ్రేష్ఠములే అయినను ఇయ్యది శ్రేష్ఠతమమై వెలయుచున్నది. కాబట్టి విజ్ఞులద్దానికొఱకే యత్నించవలెను.
     లోకములో కొందఱు చదువురానందువలన వేదములను అధ్యయనము చేయలేక పోవచ్చును. అర్థబలములేనందువలన యజ్ఞాదు లాచరింపలేకపోవచ్చును, శరీరదార్ఢ్యము లేనందుచే కఠినములైన తపస్సులు చేయలేకపోవచ్చును. బీదవారగుటచే దానములు చేయలేకపోవచ్చును. ఇక నట్టివారికి పుణ్యప్రాప్తికి మార్గమేది? వారు దిగులుపడవలసినదేనా? కాదు, వానియన్నింటిని మించిన పుణ్యమును సంపాదింపగల్గు ఉపాయమును భగవాను డిచట కరుణతో నుపదేశించిరి. అదియే పరమాత్మధ్యానము ,బ్రహ్మవిజ్ఞానము. అద్దానికి చదువులతోగాని, తపస్సులతోగాని, యజ్ఞములతోగాని, దానములతోగాని పనిలేదు. మనశ్శుద్ధియే, హృదయపవిత్రతయే, నిర్మలభక్తియే దానికి కావలసినది. అదికలవారు ఆత్మ (బ్రహ్మ) జ్ఞానప్రాప్తిద్వారా తక్కిన పుణ్యఫలములన్నిటిని దాటివైచుదురు. దీని అర్థము పైన దెల్పిన దానాదులను, వేదపఠనాదులను ఉపేక్షింపవలెననికాదు. వానిని నిష్కామముగ ఆచరించుచు క్రమముగ చిత్తశుద్ధిని బడసి తద్ద్వారా ఆత్మానుభూతిచే మహాపుణ్యము నొందవలెననియే.
    ఇంతియే కాదు. అట్టి బ్రహ్మతత్త్వము నెఱుంగుయోగి ఆద్యమై, సర్వోత్తమ స్థానమైనట్టి సాక్షాత్ బ్రహ్మమునే పొందుచున్నాడని యిట వచింపబడినది. బ్రహ్మవేత్త బ్రహ్మస్వరూపుడే యగునని శృతిభగవతియు పలుకుచున్నది. ‘పరంస్థానమ్’ అని చెప్పుటవలన ప్రపంచమునగల అన్ని పదవులకంటెను, స్థానములకంటెను బ్రహ్మపదవి సర్వోత్కృష్టమైనదని తేలుచున్నది. తక్కిన పదవులు, స్థానములు, సంపదలు క్షయిష్ణువులు, దేశకాలాధీనములు ,
దేహవియోగముచే వియోగమును బొందునవి. కాని బ్రహ్మపదవి, ఆత్మస్థానము అట్టిదికాదు. అది శాశ్వతమైనది. కనుకనే  ‘పరంస్థానమ్’ అని భగవానుడు దానినిగూర్చి వర్ణించిరి. కాబట్టి ముముక్షువులగువారు చిన్న చిన్న పుణ్యములతో సంతృప్తినొందక పుణ్యతిథి (Fountain of Virtue)యై మహత్తరస్థానమై యలరారుచుండు ఏ పరబ్రహ్మపదవి కలదో, ఏ ఆత్మస్థానము కలదో అద్దానిని భగవానుడు గీతయందు తెలిపిన అభ్యాసములద్వారా పొంది మానవజీవితమును సార్థకము చేసికొనవలెను.
   ‘యోగీ’ - యోగమనగా జీవుని భగవంతునితో చేర్చుమార్గము. అది నిష్కామకర్మయైనను, భక్తియైనను, ధ్యానమైనను, జ్ఞానమైనను సరియే దేనిననుసరించినను అతడు యోగియే యగును.
ఈ శ్లోకముద్వారా వేదములు, యజ్ఞములు, తపస్సులు, దానములు - వీని యన్నిటికంటె బ్రహ్మజ్ఞానము, ఆత్మానుభవము శ్రేష్ఠమని సర్వోత్తమమని స్పష్టపడుచున్నది. కావున ప్రారంభస్థితిలో ఆ తపోదానాదులను ఆశ్రయించినను, వానితో సంతృప్తినొందక ఇంకను పైకిబోయి క్రమముగ చిత్తశుద్ధిద్వారా ఆత్మజ్ఞానమును, బ్రహ్మానుభూతిని బడయవలెను.
       
ప్ర:- (అక్షర) పరబ్రహ్మము తెలిసికొనువా డెట్టి పుణ్యమును బడయును?
ఉ:- (1) వేదశాస్త్రాదుల నధ్యయనము చేయుటచేతను (2) యజ్ఞాదు లాచరించుటవలనను  (3) తపస్సులను సలుపుటవలనను (4) దానములను గావించుటవలనను - ఏయే పుణ్యఫలములు జీవునకు లభించునో, బ్రహ్మవేత్తకు వాని యన్నింటిని మించిన పుణ్యఫలము కలుగును. 
ప్ర:-  పరబ్రహ్మమెట్టిది?
ఉ:- (1) ఆద్యస్వరూపము  (సమస్తమునకు మూలకారణము) (2) సర్వోన్నతస్థానము (అన్నిస్థానముకంటెను శ్రేష్ఠమైనది).
ప్ర:- ప్రపంచములోగల స్థానములన్నిటిలోను, పదవులన్నిటిలోను గొప్పదియేది?
ఉ:- పరమాత్మస్థానము  (పరబ్రహ్మపదవి).
ప్ర:- అన్నిటికంటెను గొప్ప పుణ్యము నాశించువా డేమిచేయవలెను?
ఉ:- చిత్తశుద్ధిగలిగి పుణ్యనిధియగు పరమాత్మ నాశ్రయించవలెను. దానిచే వృక్షముయొక్క మూలమును పోషించినచో శాఖాపత్రాదులన్నియు పుష్టినొందునట్లు సమస్తదేవతలను, సమస్తపుణ్యములను ఆశ్రయించినట్లే కాగలదు.

ఓమ్
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే అక్షరపరబ్రహ్మయోగోనామ
అష్టమోఽధ్యాయః

ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,
శ్రీకృష్ణార్జున సంవాదమునగు
శ్రీ భగవద్గీతలందు అక్షరపరబ్రహ్మయోగమను
ఎనిమిదవ అధ్యాయము
ఓమ్ తత్ సత్

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles