Tuesday, 31 January 2017

సనాతన ధర్మోధ్ధరణ. -- 13

ఓం 🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏�

కంచి కామకోటి పీఠము-  సనాతన ధర్మోధ్ధరణ.  -- 13
-----------------------------------
జయ జయ శంకర హర హర శంకర!
కంచి శంకర కామకోటి శంకర  !!
🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏

కాలి నడకన భారత దేశమంతా పర్యటించారు. సనాతన ధర్మ పునరుధ్ధరణకి కృషి చేశారు. నియమ నిష్ఠలతో భక్తి తో తన శరీరాన్ని మంత్రమయం చేసుకున్నారు. సాక్షాత్తుగా కామాక్షీ స్వరూపులుగా విలసిల్లారు. హైందవులందరి చేత నడిచే దైవంగా కొలవబడ్డారు. భక్తులు ఎవ్వరూ నోరు తెరిచి చెప్పకపోయినా సర్వం గ్రహించేవారు. ఎందరినో ధర్మ పాలనా దక్షులను చేశారు. ఎందరి కాపురాలనో నిలబెట్టారు. ఎందరినో ఆరోగ్యవంతులను చేశారు. ఎందరికో పెళ్ళిళ్ళు చేశారు.

పరమాచార్యులవారి ఒక్కొక్క మాట ఈ దేశంలోని కొన్ని కోట్ల మందిని ధర్మమార్గంలోకి మార్చింది.  ఒకసారి స్వామి వారు భక్తులతో అనుగ్రహ భాషణం చేస్తూ కామాక్షి అమ్మవారి కలశాలకు బంగారు పూత పూయిస్తే బాగుంటుంది అన్నారు. ఆయన ఎవ్వరినీ ఒక్క పైసా ఇమ్మనలేదు. అయినా అక్కడ డబ్బుల కట్టలు, బంగారు రాశి పోగయింది. హైందవులలోని భక్తి భావానికి  ఆయన పులకించి పోయారు. వారందరినీ ఉధ్ధరించటానికి వారితో ' నేను అడగకుండానే ఇంత సొమ్ము అమ్మవారి కోసం ఇచ్చారు. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతాను ఇవ్వండి. ప్రతిరోజు, రోజు కి ఉన్న 24 గంటలలో రెండు నిముషాలను నాకివ్వండి. ఆ రెండు నిమిషాలు ప్రతిరోజు కేవలం మీకు నమ్మకమున్న దైవనామం చెప్పటానికి మాత్రమే కేటాయించండి ' అన్నారు. ఆ మాటకి మానవులలో ఎన్ని కోట్ల మంది ఉధ్ధరింపబడ్డారో! ఆయన తన నూరేళ్ళ జీవితం లో ఒక్క క్షణం కూడా తన ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించలేదు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశారు. ఎందరో దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. జంబుకేశ్వరంలో అమ్మవారి తాటంకాలని పునఃప్రతిష్ఠించి దీక్షలు నిర్వహించారు. ఎందరికో సన్యాస దీక్షలనిప్పించారు.
       కంచి పీఠాధిపత్యం అవిచ్ఛిన్నంగా కొనసాగాలి కనుక, అందుకు యోగ్యులైన శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారిని శిష్యులు గా స్వీకరించి పీఠాధిపత్యం ఇచ్చారు. చిన్న స్వామి వారు  శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారిని 13 ఏళ్ళ బాలుడుగా ఉన్నప్పుడు తనకు అనుయాయిగా స్వీకరించి దీక్ష ఇచ్చారు.  పీఠాధిపతిగా ప్రకటించారు. ముగ్గురు పీఠాధిపతులు కలిసి1983 వ సంవత్సరం జూలై నెలలో కర్నూలు పట్టణంలో చాతుర్మాస దీక్ష నిర్వహించటం ఆంధ్రప్రదేశ్ ప్రజల మహద్భాగ్యము.

    ఆధ్యాత్మిక చింతనాభి వృధ్ధికే కాక, సమాజ సేవాకార్యక్రమాలకు కూడ స్వామి వారు ప్రేరణ కల్పించారు. ధనికులు పేదవారిని ఆదుకోవాలని  పిలుపునిచ్చారు. 'లోకాస్సమస్తాః సుఖినో భవంతు ' అని వేదం చెబుతోంది. ఇది మన సనాతన ధర్మం చేసిన మంగళాశాసనం ! కంచి కామకోటి పీఠము ఈ ధర్మ శాసనాన్ని ఆచరిస్తోంది; ఆచరింపచేస్తోంది. మన దేశానికి చైనాతో భయంకరమైన యుద్ధం రావటానికి ముందు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు 1960 వ దశాబ్దంలో ఐక్యరాజ్య సమితి కి ' జగత్తు యావత్తూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని,  వృధ్ధి చెందాలనీ ' ఆశీర్వచన సందేశం పంపించారు. ఆయుధ విసర్జన, యుద్ధవిరమణ చేసి ప్రేమతో అందరి హృదయాలను ఆక్రమించాలని సందేశమిచ్చారు. సర్వ మానవాళి సంక్షేమాన్ని కోరి ఆశీర్వాదించారు.
మన దేశానికి చైనాతో యుధ్ధం సంభవించి, బియ్యం దొరకటం కష్టమైనప్పుడు స్వామి వారు ' ప్రతి ఒక్కరు రోజు తాము వండుకునేందుకు తీసిన బియ్యం లోంచి గుప్పెడు బియ్యం పక్కన పెట్టి సేవాదళాలకు పంపాలని పిలుపునిచ్చారు.
       శ్రీ శ్రీ శ్రీ పరమాచార్య స్వామి వారు అనేక ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టారు. 1916 వ సంవత్సరం లో కుంభకోణం లో ఆయుర్వేద వైద్యశాల ప్రారంభించారు. కుష్ఠు రోగుల కొరకు ఒక వైద్యశాలను స్థాపించారు. ప్రజల సదుపాయం కోసం తమిళ నాడులో తాంబ్రం వద్ద హిందూ మిషన్ ఆసుపత్రి, కలకత్తా లోని ' లేక్ గార్డెన్ ' లో "కంచి శంకర వైద్య కేంద్రం", కోయంబత్తూరు లో  "శ్రీ కంచి శంకర నేత్ర సంస్థ" నెలకొల్పబడ్డాయి. శ్రీ పరమాచార్యులవారు వారి శిష్యులైన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారలతో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాలకు విజయ యాత్రలు చేసి, ప్రజల మనస్సులను చైతన్య పరిచి సాంస్కృతిక ఆధ్యాత్మిక సమైక్యతకు కృషి చేశారు. ఉత్తర ఈశాన్య రాష్ట్ర ప్రజలు తాము దూరంగా ఉన్నామని బాధ పడుతున్నారని తెలుసుకుని అక్కడ యజ్ఞాలు, వేద సభలు నిర్వహింపచేశారు. శ్రీ మహాగణపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను అక్కడికి పంపించి ప్రతిష్ఠింపచేశారు. 

       ఒకసారి పరమాచార్య స్వామి వారి ఆరోగ్యాన్ని పరీక్షించటానికి వైద్యులు వచ్చారు. స్వామివారు ఆ వైద్యులతో, ' మీరేం చెప్తారో నాకు తెలుసు. నాకు ఒక ఊపిరితిత్తి పాడయిందనీ, సమయానికి భోజనం చేసి, తగినంత విశ్రాంతి తీసుకోవాలని చెప్తారు. మీకు ధన్యవాదాలు. కాని నాకు అది సాధ్యపడదు. నేను సన్యాసిని. ఈ శరీరం పడిపోతుంది. నేను శరీరం కాదు. ఆత్మను. ఈ శరీర ఆరోగ్య అనారోగ్యాలతో నాకు సంబంధం లేదు' అన్నారు. పరమాచార్యుల వారి ఆత్మ నిష్ఠ కి వైద్యులు ఆశ్చర్యపోయారు.
        కేవలము హిందువులే కాక, భారతీయులైన ఇతర మతస్థులు కూడ స్వామి వారి పట్ల తమకున్న గౌరవాన్ని భక్తి శ్రధ్ధలను చాటారు. 1994 జనవరి 8 వ  తేదీన వీరు సిధ్ధి పొందినప్పుడు శోకించని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు.
       అంతరంగ చింతన కలిగించే శ్రీ పరమాచార్య వారి కొన్ని జీవిత విశేషాలు, వారి సనాతన ధర్మ ఆధ్యాత్మికోపన్యాసాలు కొన్ని పుస్తక రూపంలో ఉండటం మనందరి అదృష్ట విశేషం !!

సశేషం
డా.టి.విశాలాక్షి

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles