హారికి, నందగోకుల విహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్త దుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంప దపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితా ప్రహారికిన్.
భావము:
మనకావ్యాలలో ఒక సంప్రదాయం ఉన్నది. కవి తనకావ్యాన్ని ఎవనికి అంకితం ఇస్తు న్నాడో అతని మహిమలను పేర్కొంటూ కొన్ని పద్యాలను పీఠికలో వ్రాస్తాడు. ఆవిశేషణాలన్నీ షష్ఠ్యంతాలతో శ్రీకృష్ణచంద్రుని స్తుతిస్తున్నాడు.
ఆ చిన్నారి కన్నయ్య అందరి హృదయాలను అలరింపజేసే అందగాడు. నందుని గోకులంలో విహారాలు చేసేవాడు. సుడిగాలిరూపంలో వచ్చిన రక్కసుని మక్కెలు విరుగదన్ని చంపింనవాడు. భక్తుల దుఃఖాన్ని తొలగించేదయామూర్తి. గోపకాంతల మనస్సులను దొంగిలించే మహనీయుడు. చెడుగుణాలనే సంపదలను నాశనంచేసే మహాత్ముడు. గొల్ల భామలకుటీరాలలో దాచుకున్న పాలూ, నెయ్యీ మొదలైన వానిని కొల్లగొట్టిన వెన్నదొంగ. బాలకగ్రహరూపంలో వచ్చిన పాడురక్కసి పూతన ప్రాణాలను చనుబాలతో పాటు పీల్చిచంపి వేసిన అద్భుత బాలకుడు. అటువంటి శ్రీకృష్ణచంద్రునకు నా కావ్యాన్ని అంకితం చేస్తున్నాను.
మనోహర హారాలు ధరించువాడికిం; సంద వంశం వారి గోకులంలో విహరించినవాడికి; తృణావర్తు డనే దానవుణ్ణి సంహరించిన వాడికి; భక్తుల పరితాపాలను పరిహరించువాడికి; గోపాంగనల మనస్సులను అపహరించినవాడికి; దుష్టుల సంపదలను హరించిన వాడికి; వ్రేపల్లెలో గోపికల యిండ్లలో పాలు, నెయ్యి, అపహరించినవాడికి; పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టు పెట్టినవాడికి.