Friday 13 January 2017

భాగవతం - 236వ భాగం


బ్రహ్మోత్పత్తి – స్వాయంభువమనువు

విదురుడు కురుసభలో వుండగా ఒకానొక సందర్భంలో ఆయన అవమానింప బడ్డాడు. అప్పుడు విదురుడు అక్కడనుండి బయలుదేరి ఉద్ధవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. వెళ్ళి ఉద్ధవుడిని ‘కృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నాడు?’ అని అడిగాడు. అపుడు ఉద్ధవుడు “కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడు. యాదవులు అందరూ వెళ్ళిపోయారు’ అని చెప్పాడు. ఈ సందర్భంలో పరీక్షిత్తు ‘ఉద్ధవుడు కూడా యాదవుడే కదా – అతను ఎందుకు ఉండిపోయాడు?’ అని శుకుని అడిగాడు. కృష్ణుడికి ఏ జ్ఞానం ఉన్నదో అది ఉద్ధవుడికి ఉంది. కృష్ణుడు తన తరువాత లోకమునకు చెప్పడం కోసం ఉద్ధవుడిని భూమిమీద ఉంచేశాడు. ఉద్ధవుడు శ్రీమన్నారాయణుని ఆదేశమును అనుసరించి బదరికాశ్రమమునకు వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న ఉద్ధవుడిని విదురుడు కలుసుకుని ‘నీవు శ్రీమన్నారాయణుడి దగ్గర తెలుసుకున్న భాగవత జ్ఞానమును నాకు చెప్పవలసింది’ అని అడిగాడు. అపుడు ఉద్ధవుడు ‘అది నాదగ్గరే కాదు. జ్ఞానమును మైత్రేయుడికి కూడా చెప్పాడు. ఇపుడు మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వినవలసింది’ అని సలహా చెప్పాడు. అపుడు విదురుడు గంగపడిన చోటయిన హరిద్వారం వెళ్ళి, భాగవత జ్ఞానమును విన్నాడు. శ్రీమహావిష్ణువు నాభికమలంలో నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు. లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. నీటితో నిండిపోయి వున్న లోకములందు తాను ఏమి సృష్టి చేయాలో ఆయనకేమీ అర్థం కాలేదు. ‘నేనన్న వాడని ఒకడిని వచ్చాను కదా – నన్ను కన్నవాడు ఒకడు ఉండాలి కదా’ అని చుట్టూ చూశాడు. చుట్టూ నీళ్ళు తప్ప ఏమీ లేవు. జలప్రళయం అయిపోయి వుంది. కంగారుపడ్డాడు ఏమిటి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. అపుడు ఆయనకు పైనుంచి ‘తపతప’ అనే ఒక మాట వినపడింది. అపుడు ఆయన తపించాడు. ధ్యానమగ్నుడై ఈమాట ఎవరినుండి వెలువడిందో ఆయన దర్శనమును అపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనం అయింది. ఆయన ‘నీవు ఇలా సృష్టి చెయ్యి’ అని బ్రహ్మగారికి వేదములను ఇచ్చి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు సృష్టి చేయడం ప్రారంభం చేశాడు.

ఆయన అలా సృష్టి చేయడం ప్రారంభం చేయడంలో ఒక గమ్మత్తయిన ప్రక్రియ జరిగింది. బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. ఆయన మొట్టమొదట సనక, సనందన, సనత్కుమారులను సృష్టించాడు. ఆ నలుగురుని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చేయండి. బిడ్డలను కనండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు ‘మేము ప్రవ్రుత్తి మార్గములో వెళ్ళము. ఆ మార్గము మాకు అక్కరలేదు. మేము సృష్టి చేయము. మేము శ్రీహరి పాదములను చేరిపోతాము’ అన్నారు. వారు ఎప్పుడూ అయిదేళ్ళ వయసుతో, చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని, ఎప్పుడూ ధ్యానం చేస్తూ శ్రీహరి వైపు వెళ్ళిపోయారు. బ్రహ్మగారికి కోపం వచ్చింది. కోపంతో తన భ్రుకుటి ముడివేశాడు. అందులోంచి నీలలోహితుడనే పేరుగల రుద్రుడు పుట్టాడు. వాడు క్రిందపడి ఏడవడం మొదలుపెట్టాడు. అపుడు బ్రహ్మగారు వానిని ఏడవకు అన్నారు. అపుడు ఆ రుద్రుడు ‘నేను ఎక్కడ ఉండాలి, ఏమి చేయాలి?’ అని అడిగాడు.

ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ సృష్టి సంకల్పంలోంచి ప్రారంభమయింది. ఇప్పుడు ఉన్న సృష్టి మిధున సృష్టి అనగా స్త్రీపురుష మైధునం చేతనే సృష్టి జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడు జరిగిన సృష్టి కేవలము ఈశ్వర సంకల్పము చేత మాత్రమే జరిగిన సృష్టి.

అపుడు చతుర్ముఖ బ్రహ్మగారు ‘నువ్వు పుడుతూనే ఎడ్చావు కాబట్టి నిన్ను రుద్రుడంటారు అని చెప్పి రుద్రుడికి ఎనిమిది రూపములను, ఎనమండుగురు భార్యలను ఇచ్చి, నీవు అలా ఉండి సృష్టి చెయ్యి’ అని చెప్పారు. అపుడు ఆయన కొన్ని గణములను సృష్టించాడు. ఆ గణములు అక్కడ వున్న వాళ్ళను తినివేయడం మొదలుపెట్టారు. బ్రహ్మగారు రుద్రుడిని పిలిచి ‘ఇక నీవేమీ సృష్టి చేయవద్దు. కేవలం తపస్సు చేసుకుంటూ ఉండవలసింది’ అని చెప్పారు. అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు.

మళ్ళీ బ్రహ్మగారు ఆలోచిస్తూ కూర్చున్నారు. అలా ఆలోచిస్తుంటే ఆయన శరీరభాగముల నుండి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారదమహర్షి బయటకు వచ్చారు. వీపులోంచి ‘అధర్మము’ వచ్చింది. అధర్మములోంచి ‘మృత్యువు’ వచ్చింది. ముందుభాగంలోంచి ‘ధర్మం’ వచ్చింది. అపుడు బ్రహ్మగారు ‘ఇలా నేను సంకల్ప వికల్పములు చేస్తే ఎంత సృష్టి చేస్తాను’ అనుకున్నారు. ఒక్కొక్కసారి సృష్టి చేసే వారియందు కూడా మోహము కలుగుతుంది. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆ స్త్రీయందు మోహమును పొందాడు. అపుడు ఋషులు ‘మీరు సృష్టించిన స్త్రీయందు మీకు మొహమేమిటి”’ అని ప్రశ్నించారు. ఆడు ఆయన ‘ఇది సృష్టికి ఉండే లక్షణము. కాబట్టి ఏ శరీరముతో అలా మోహమును పొందానో ఆ శరీరమును వదిలిపెట్టేస్తున్నాను’ అని శరీరమును వదిలిపెట్టేశాడు. ఆ శరీరం పొగమంచు అయింది. మనకి రోజూ కళ్ళకి అడ్డంగా వచ్చే పొగమంచు అదే! తరువాత బ్రహ్మగారు మైథున సృష్టి చెయ్యాలని అనుకుణి తన శరీరంలోంచే రెండింటిని సృష్టించాడు. ఒకటి స్త్రీ, ఇంకొకటి పురుషుడు. అలా సృష్టించి ‘వీళ్ళయందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను. అపుడు ధర్మబద్ధమై ప్రజాసృష్టి జరుగుతుంది’ అన్నాడు. అలా మొట్టమొదట సృష్టించిన వాళ్ళలో మొట్టమొదట పుట్టిన వాడు స్వాయంభువ మనువు. ఆయన భార్య పేరు శతరూప. వీళ్ళిద్దరూ పుట్టారు. అపుడు బ్రహ్మగారు అన్నారు ‘కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి. నీవు సృష్టి చెయ్యి’ అన్నారు. అనగా స్వాయంభువ మనువు అయిదుగురు బిడ్డలను కన్నాడు. కానీ వచ్చి తండ్రికి తాను అయిదుగురు బిడ్డలను కనినట్లు చెప్పాడు. వాళ్ళు ఎవరు అని అడిగారు బ్రహ్మగారు. ఆయన తన బిడ్డల పేర్లు చెప్పాడు. ఒకాయన పేరు ప్రియవ్రతుడు, రెండవ కుమారుని పేరు ఉత్తాన పాదుడు. ఒక కుమార్తె పేరు అకూతి. మరొక కుమార్తె పేరు ప్రసూతి. మూడవ కుమార్తె పేరు దేవహూతి.

అయిదుగురు బిడ్డలను కన్నాను. ఇప్పుడు ఏమి చెయ్యను?” అని తండ్రిని అడిగాడు. అపుడు బ్రహ్మగారు ‘శ్రీహరిని సంకీర్తన చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయవలసినది అని చెప్పడు. అపుడు ఆయన ‘నాన్నగారూ, అలా పరిపాలించడానికి భూమి ఎక్కడ ఉన్నదండీ? అని అడిగాడు. మీరు సృష్టి తామర తంపరగా ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చిన సముద్ర జలములలో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది. పాతాళ లోకంలో ఉన్న ఆ భూమిని పైకి తీసుకువస్తే ప్రాణులన్నీ భూమి మీదకు చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీనిని పరిపాలించడానికి ఆనుకూల్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ భూగోళమును పైకెత్తండి’ అన్నాడు. ఆ భూమిని ఎలా పైకెత్తడమా అని ఆలోచించాడు బ్రహ్మగారు. ఈయన సంకల్పం చేయగానే వెనుక నుండి చేయిస్తున్న వాడు ఒకాయన ఉన్నాడు. ఇన్నిగా వస్తున్నాడు. ఆయన ఇప్పుడు బ్రహ్మగారి ముక్కులోంచి ఊడి క్రిందపడ్డాడు. నాసికా రంధ్రములలోంచి చిన్న వరాహమూర్తి ఒకటి క్రింద పడింది.

ఆ వరాహము దంష్ట్రలతో పెద్ద కొండంత అయిపోవడం మొదలుపెట్టింది. అది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలు పెట్టింది. అక్కడ వున్న ఋషులు అందరూ దానికేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్లకి అర్థం అయింది. స్వామి సంకల్పమును అనుసరించి భూగోళమును పైకి ఎత్తడానికి ఎవరు మొట్టమొదటి నుండి చివరి వరకు ఉంటున్నాడో అటువంటి ఈశ్వరుడు వచ్చాడు అనుకున్నారు. అనగా మొదటి అవతారము వచ్చినది.

ఇది యజ్ఞవరాహంగా వచ్చింది. వచ్చి అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి దూకింది. అది భూమికోసం మూపుపెట్టి వెతుకుతోంది. అలా వెతకడంలో దాని ముఖం నిండా నీళ్ళు అంటుకుపోయాయి. అపుడు అది తన ముఖమును పైకి తెచ్చి విదిలించింది. అపుడు ఋషులందరూ ఋగ్యజుస్సామవేదములతో స్తోత్రం చేస్తూ, ఆ నీళ్ళు మీద పడేటట్లు నిలబడ్డారు. ఈ కంటికి గోచరమవని వాడు రక్షించడం కోసమని ఇప్పుడు ఒక విచిత్రమయిన మూర్తిగా వచ్చి నీతితో తడిసిన దేహంలో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు. దీనిని విన్నప్పుడు విదురుడు ఒక విచిత్రమయిన ప్రశ్న వేశాడు. దానికి జవాబుగా ‘యజ్ఞవరాహం వచ్చినపుడు ఈయన ఎంత గొప్ప మూర్తియో అంత గొప్ప రాక్షసుడు ఒకడు నీళ్ళలోంచి వచ్చాడు. వచ్చి యజ్ఞవరాహమూర్తి మీద కలియబడ్డాడు. అక్కడ వున్న వాళ్ళందరూ యజ్ఞవరాహమూర్తిని స్తోత్రం చేస్తున్నారు. ఆయన ఆ రాక్షసుడిని చంపి అవతల పారేశాడు’ అని చెప్పాఉద్. ‘ఆ వచ్చిన వాడెవడు? ఎందుకు వచ్చాడు? అందరూ నమస్కరిస్తుంటే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి? అందుకు సంబంధించిన కథను చెప్పవలసినది’ అని పరీక్షిత్తు అడిగాడు. అందుకు సమాధానంగా శుకుడు చెప్పడం ప్రారంభించాడు.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles