Tuesday 3 January 2017

వైకుంఠ ఏకాదశి


మాసంలో వచ్చే ప్రతి ఏకాదశి అనేది ముఖ్యమైనది. మన మనస్సుని, బుద్ధిని నియంత్రించుకోవడం అనేది ప్రధానమైన అంశం. అయితే పుష్యమాసపు శుక్ల ఏకాదశికి ఒక వైలక్షణ్యం ఉంది. దీనికే వైకుంఠ ఏకాదశి అని అంటారు. ముక్కోటి దేవతలు అని మన శాస్త్రాలు చెబుతాయి, వారంతా స్వామిని సేవించుకొని తాము తరించాము అని భావిస్తారట. భగవంతుడు ఉత్తర ద్వారాలు తెరిపించి వైకుంఠంలోంచి బయలుదేరి కోరుకున్న వారిని ఆద్వారంలోంచి లోనికి తీసుకు వెళ్ళడానికి సిద్దపడతాడట. ఇది ఈ నాటి ప్రత్యేకత. వారు ఎలాంటి వారైనా సరే, పుణ్యాత్ములా పాపాత్ములా అనే ప్రశ్న లేదు. ఎవడైతే స్నానమాడి స్వామి నామాన్ని తలుస్తాడో వాడికి మోక్షం ఇస్తాడట. అందుకే ఈనాడు కాకి కూడా స్నానం చేస్తుందట. సామాన్యంగా ఈ నాడు, ఎవరిపైన కోపం వచ్చి ఉపవాసం చేసినా మోక్షమేనట. అంత పవిత్రమైన రోజు ఈ రోజు.
ఎందుకైంది అంత పవిత్రం ఈ రోజు? ఎందుకు పరమాత్మ ఉత్తర ద్వారంలోంచే రావాల్సి వచ్చింది, తూర్పు ద్వారం లేదా ? ఏ కారణం చేత ఉత్తర ద్వారం తెరువాల్సి వచ్చింది ? ఈ విషయాన్ని మనకు శ్రీపాంచరాత్ర ఆగమ సంహితల్లో శ్రీప్రశ్నం అనే ఒక సంహిత ఒక అందమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఒకనాడు భగవంతుడు సృష్టి చేద్దాం అని అనుకున్నాడు. సృష్టి అనేది ఆయన నేరుగా చేయడు. సృష్టి అనేది రెండు విడుతలుగా చేస్తాడు, కొంత తాను నేరుగా చేస్తాడు, మిగతాది ఒకరి ద్వారా చేయిస్తాడు. తాను మొదట ముడిపదార్థాన్ని తయారుచేసి ఇస్తాడు. దాన్ని తయారుచేసే విధానం ఇతరులకు రహస్యంగానే ఉంచుతాడట. దాన్ని తయారుచేసే విధానం వేదాల్లో ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకొవడం ఎవ్వరికీ రాదట. పాలకడలిలో పవలించి ఉన్న పరందాముడికి మాత్రమే తెలుసు ఆ రహస్యం. కావల్సిన భోగ, భోగ్య, భోగ ఉపకరన వస్తువులని తయారుచేసి, తన నాభిలోంచి బ్రహ్మగారిని బయటకు తీస్తాడు. అంటే సృష్టికి అవసరమైన పంచభూతాలని, కావల్సిన వస్తువులని తయారుచేసి, ఇకపై సృష్టి చేయడానికి బ్రహ్మగారిని నిర్ణయించుకుంటాడు. ఆయనకు వేదం చెప్పి సుర నర తిర్యక్ స్థావరాలను సృజింపజేస్తాడు. బ్రహ్మగారికి సంశయాలు ఏర్పడితే తొలగిస్తూ ఉంటాడు వేద ఉపదేశం ద్వారా. అయితే అప్పుడప్పుడు బ్రహ్మగారు పరాక్కు వల్ల వేదాన్ని కోల్పోతే తాను ఆయా పరిస్థితి బట్టి ఒక సారి చేపవలె, ఒక సారి హంసవలె , ఒకసారి గుఱ్ఱంవలే ఎన్నో రూపాలు దాల్చి వేద ఉపదేశం చేసాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక్కో కల్పం ఆరంభం అయినప్పుడు ఒక్కో సారి వేదోపదేశం చేస్తాడు పరమాత్మ. అయితే వేదాన్ని కొంత అశ్రద్దతో వింటే, జరిగే సృష్టిలో కొంత తప్పులు ఏర్పడుతాయి. బ్రహ్మ గారు చేసే అశ్రద్ద గురించి శ్రీసుఖ మహర్షి పరిక్షిత్తుతో చెబుతాడు భాగవతంలో. ఇట్లా బ్రహ్మగారికి వేద ఉపదేశం అనేది ఎన్నో సార్లు చేస్తాడు పరమాత్మ.

ఇట్లా ఒకసారి బ్రహ్మ గారు పరాక్కుతో విన్నాడట. అప్పుడు ఆయన చెవుల్లోంచి ఇద్దరు వచ్చారట. వారి పేర్లు మధు మరియూ కైతభ. విజ్ఞానాన్ని మనం చైతన్య మూర్తులని భావిస్తాం. బ్రహ్మ గారికి ఉపదేశం చేసిన వేదం మానవ అకృతి దాల్చి ఉన్న నలుగురు బాలరవలె ఉందట. ఆ నలుగురిని ఎత్తుకొని ఈ మధు కైతభ అనే అసురులు వెళ్ళిపోయారు. వారిని సముద్రంలో దాచి ఉంచారు. భగవంతుడు బ్రహ్మగారికి ఉపకారం చేయడానికి మశ్చ్య రూపం దాల్చి వారితో పోరాడాడు, అయితే వారు పుట్టింది సరియైన సృషి కార్యంలో కాదు, వారు అసురీ ప్రవృత్తి కల్గి ఉన్నారు. ఎంతకూ చావడం లేదు. అయితే ఇంత దెబ్బలాట ఎందుకు అని భగవంతుడు వారిని వేదాలను అందిస్తే ఒక వరం ఇస్తా అని చెప్పాడు. దానికి తోడు మరొక వరం వారే అడిగారు. అందుకు ఒప్పుకున్నాడు పరమాత్మ. మొదటి వరంగా భగవంతుణ్ణి తమకు మోక్షాన్ని ప్రసాదించమని అడిగారు. అసుర ప్రవృత్తి కలవారికి మోక్షం ఎలా వస్తుంది. మోక్షానికి ఒక మార్గం ఉంది. పరమపదానికి వెళ్ళాలంటే అర్చిరాది మార్గాల్లో ఇలా పన్నెండు లోకాలని దాటుతూ విరజానది దాటి ఐరంమదం అనే సరస్సులో అలంకరించుకొని కదా వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ పరమాత్మ ఏర్పర్చినవే కానీ నియమాలని ఆయన కూడా గౌరవిస్తాడు. మనం ఆడే ఆటల్లో నియమాల్ని మనమే పెట్టుకుంటాం, నియమాలని విడిచి ఆడే ఆటలో ఉత్సాహం అనేది ఉండదు. అట్లానే భగవంతుడు తాను ఏర్పచిన నియమాలని విస్మరించడు. కానీ ఈ అసురులు ఇద్దరూ మోక్షం కావాలనే కోరారు. అందుకు భగవంతుడు ఒక సులభమైన ఒక ఉపాయం వెతుకున్నాడు. వైకుంఠానికి ఉత్తరం వైపు ద్వారాలని తెరిపించి ఆయన వచ్చి వారిని స్వీకరించేందుకు ఒప్పుకున్నాడు. అసలు మోక్షాన్ని ఎవరు కోరుతారు. మన వాంగ్మయాలు, వేదాలు జీవుడు చేరాల్సిన ఒక ఆనంద స్థితి అనేది ఉంది అని చెబుతున్నాయి. భగవంతుడు చేసిన ఉపదేశాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ఎన్ని చెప్పినా మనం మనమే. భగవంతుని నిత్య నిలయాన్ని చేరాలి అనే ద్యాస మనకు లేదు. ఒక్క జన్మ కాదు, కోట్ల జన్మలు ఆయన ఇస్తూనే ఉన్నాడు. మనం ఈ సంసార ప్రవాహంలోంచి బయట పడాలని కోరిక అంత కంటే లేదు. సర్వ వ్యాపి అయిన నారాయణుడు ఉండేది ఎంత దూరం మనకు, కానీ మనం ఆయన సొత్తు అని ఒప్పుకోం. అసురులైనప్పటికీ వారు కోరిన కోరిక సరియైనది అని భగవంతుడు ఎంతో సంతోషించాడు. విభువైన భగవంతునికి మనపై ఉండే ప్రేమ అంత. అందుకు వారు సంతోషించి వేదాలని తిరిగి ఇచ్చారు. వారు మరొక వరం కోరుకున్నారు. వారు కోరిన వరాన్ని చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భగవన్! మామీద ఉండే దయ చేత మాకు ఇంత ఉపకారం చేస్తున్నావే, ఈ రోజు ఈ విషయాన్ని తలచుకున్నా, నీవు ఉత్తర ద్వారంలో వస్తుంటే చూస్తారో వారికి కూడా మోక్షాన్ని ఇవ్వు అని కోరారు. వారు అసురులైనప్పటికీ ఎంత ఉత్తములు అనేది తెలుస్తుంది. భగవంతుడి ముఖం వికసించింది. ఈ వైభవాన్ని తలచినా, భగవంతుణ్ణి ఉత్తర ద్వారంలోంచి వస్తుంటే చూసినా వారికి మోక్షం నిశ్చయం అని భగవంతుడు వరం ఇచ్చాడు.

అయితే పరమపదంలో ఉన్న స్వామిని మనం ఎట్లా చూడగలం. అయితే భగవంతుడు ఉండేది ఐదు స్థానాల్లో. పరమపదంలో ఆయనే ఉంటాడు. పాలకడలిలో ఆయనే ఉంటాడు. అవతారాల్లో ఆయనే ఉంటాడు. మనలో అంతర్యామిగా ఆయనే ఉంటాడు. ఈ నాలుగు స్థానాలు అందరికీ ఉపకరించవు. అతి సామాన్యులకు కూడా అందుబాటులోకి రావడానికే విగ్రహ రూపంలో ఉంటాడు. పరమపదంలోని స్వామికి అర్చా మూర్తికి తేడా లేదు అని పాంచరాత్ర ఆగమాలు తెలిపాయి. అందుకోసమే ఈ రోజు ఆలయాల్లో స్వామి ఉత్తర ద్వారం ద్వార బయటికి వచ్చి మండపంలో ఉన్న భక్తులని తీసుకొని తిరిగి ఉత్తర ద్వారం గుండానే లోనికి వెళ్తాడు. అట్లా వచ్చే స్వామిని సేవిస్తే చాలు. భూమి మీద మొదటగా అవతరించిన అర్చా మూర్తి అయిన శ్రీరంగనాథుడు కూడా బయటికి వచ్చి భక్తులని తరింపజేస్తాడు. అట్లానే అనేక స్థానాల్లో స్వామి వేంచేసి ఉన్నాడు అనేక ఆలయాల్లో, స్వామి ఉన్న గర్భాలయాన్ని పరమపదం అనే భావిస్తారు. స్వామి అర్చా రూపంలో వచ్చినా ఆయన పూర్ణత్వంలో లోటు ఉండదు. అట్లా వచ్చే స్వామిని సేవించుకుంటే చాలు తరించిపోతాం. దానికి తోడు ఆయన నామాల్ని పాడుతే ఆయనెంతో సంతోషిస్తాడు.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles