శివానందలహరీ -------
యథా బుద్ధిశ్సుక్తౌ రజత మితి కాచాశ్మని మణి,
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ట్నాసు సలిలమ్,
తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో,
మహాదేవేశం, త్వాం మనసి చ న మత్వా పశుపతే !!
ఓ పశుపతీ! సర్వేశ్వరుడివైన నిన్ను మనసులో చింతించక మూడమతియగు మానవుడు ముత్యపు చిప్పను వెండిగాను, గాజుముక్కను మణిగాను, పిండి నీటిని పాలుగాను, ఎండమావుల్లో నీళ్ళను చూచి ఎలా భ్రాంతి కలిగించు కుంటాడో అలా నీకంటే పరులైన వారిని దేవుడని భ్రాంతితో సేవిస్తున్నాడు.
మహాకాళేశ్వరస్వామీ! ప్రాపంచికమైన శాశ్వతము కానివి శాశ్వతము అని భ్రమించి, మాయలో తిరుగుతూ, మిమ్మల్ని మరచి, చేసిన కర్మఫలములను అనుభవించలేక, ఎవరెవరినో ఆశ్రయించే మీ బిడ్డలమైన మాకు, కనువిప్పు కలిగించి. మాలో పశుత్వాలను పోగొట్టి పశుపతివై మమ్మల్ని రక్షించి కాపాడే సర్వేశ్వరా! ఈ ఎర్రటి మట్టి కుండల్లో తోడుపెట్టిన ఈ ఆవుపెరుగుతో మీకు అభిషేకము చేస్తున్నాను. స్వీకరించు తండ్రీ. పరమేశ్వరా! చేసేవాడిని నేనే, చేయించేవాడిని నేనే, చేయబడే వస్తువుని నేనే, అని మీరే కదా స్వామి అన్నారు. చేసేది మీరే, చేయించేది మీరే, చేసే ఆ పెరుగును నేనై నిన్ను అభిషేకించనా శివా! ఇంతకుమించి ఇంక నాకు ఏమి కావాలి. తండ్రీ! అన్నీ నీవే అయ్యి, అంతా నీవే అయ్యి, అన్నింటా నీవే ఉన్నావని మాకు తెలియజేసి, మాలో ఉన్న అజ్ఞానమనే బ్రాంతిని తొలగించి, నీవే సర్వమూ, సర్వస్వము అనే సత్యాన్ని కలిగించి మమ్మల్ని నీ సన్నిధికి చేర్చుకో శివా! మహాకాళేశ్వరస్వామీ! మీ పాదములకు నమస్కరించుచున్నాను. మా నమస్కారాన్ని స్వీకరించండి స్వామీ!