సమస్త ప్రాణులకూ నేను మహోపకారం చేయగలను కార్తీకపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చెయ్యలేవు. నేను ఏమి చెయ్యగలను? దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేష ఫలితం. యధార్ధానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించాలి. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, "దామోదరమావాహయామి" అనిగాని, "త్రయంబకమావాహయామి" అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఈ శ్లోకం చెప్పాలి...
"కీటాఃపతంగా మశకా శ్చ వృక్షాః
జటేస్ధలే... ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్వాప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః"
(ఈ దీపము దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి ఈ దీపం వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటకములు, పురుగులు, పతంగాలు, దోమలు, వృక్షాలకు వెళ్ళాలి. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతుంది. కాబట్టి దామోదరుడి చెయ్యి దానిమీద పడినట్టే! త్రయంబకుని చెయ్యి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి. నీటిలో ఉండే చేపలు, కప్పలు, తాబేళ్ళ వంటి వాటిపై ఈ దీపపు వెలుతురు పడినప్పుడు, ఆ ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో వాటి పాపపుణ్యాలన్నీ నశించుపోవుగాక! ఇక వాటికి జన్మ లేకుండుగాక! ఉదర పోషణార్ధమే బ్రతుకుతున్న భయంకరమైన స్ధితిలో ఉన్న వాడిమీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించి వాడు వచ్చే జన్మలో అభ్యున్నతిని పొందుగాక!) నువ్వు ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు.
మనం ఒక ఇల్లు కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. 365 రోజులూ దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్లీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి "కార్తీక పౌర్ణమి". అందుకే కార్తీకపౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం ఆవునేతిలో ముంచి వెలిగిస్తుంటారు.
దీపాలు ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టి.వి చూస్తాను అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం వెలిగించాలి. ఇంట దీపం పెడితే కార్తీకపౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో దీపం పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం.
-
"ఓం నమఃశివాయ"
"ఓం నమఃశివాయ"
"ఓం నమఃశివాయ"