జాతక చక్రంలో కుజుడు జన్మలగ్నం నుండి 2, 4, 7, 8, 12 స్థానాలలో వుంటే కుజ దోషం గా వ్యవహరిస్తారు, ఈ స్థానాలలో కుజ గ్రహ సంచారములు వుంటే సమస్యలు వస్తాయి కానీ అవి కూడా కుజ మహా దశ జరిగే సమయంలోనే వస్తాయి. ఇతర దశలలో రానేరావు, చాలా సంధర్భాలో కుజ దోషం భంగమవుతుంది కూడా. ఈ విషయం తెలియక కుజ దోషం వుందని, కుజ దోష ప్రభావంతోనే సమస్యలు వచ్చాయని. కుజ దోషం..... కుజ దోషం..... అనుకుంటూ.... చాలా మంది భయపడుతూ, మానసిక వేధనతో జాతకులు మరియు వారి తల్లిదండ్రులుండటం ఈ మధ్య కాలంలో పరిపాటి అయినది.
కుజ దోషం పలు సంధర్భాలలో భంగమవుతుంది, ఇట్టి భంగమయ్యే సంధర్భాన్ని గమనించకుండా... ఇతర గ్రహ స్థితులచే ఏర్పడిన సమస్యలను... కుజ దోష ప్రభావం చే ఏర్పడ్డాయని తలుస్తుంటారు... ప్రస్తుతం వస్తున్నాయని, భవిష్యత్ కాలంలో వస్తాయని వాపోయే వారు ఎంతో మంది. అట్టి వారందరూ ధైర్యంగా ముందుకెళ్లుటకు వారి మనసులలో ఏర్పడ్డ అపోహలు తొలగించుటకై చేసే చిన్ని ప్రయత్నమే ఇది.
కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాలలో వున్నప్పటికీ అవి కర్కాటక, సింహ రాశులలో లేక కర్కాటక సింహ లగ్నాలలో సంచారముంటే కుజ దోషం భంగమగును, మేష వృశ్చిక మకర సింహ ధనూ మీన లగ్నాలయందు, మరియు రాశుల యందు జన్మించిన జాతకులకు కూడా కుజ దోషం భంగమగును.
మిధున కన్య రాశులలో మరియు లగ్నాలలో జన్మించి జన్మ లగ్నానికి ద్వితీయ స్థానంలో కుజుడు వుంటే ఆ స్థాన దోషం భంగమగును, మకర కర్కాటక లగ్నాలలో లేక రాశులలో జన్మించి, సప్తమ స్థానాలలో కుజుడుంటే 7 వ స్థాన కుజ దోషం భంగమగును, ధనూ మీన లగ్నాలు మరియు రాశులలో జన్మించి అష్టమ స్థానాలలో కుజ గ్రహ సంచారముంటే 8 స్థాన కుజ దోషం ఉండదు, మిధున కన్య లగ్నాలు మరియు రాశులలో జన్మించి 12వ స్థానంలో కుజ దోషముంటే భంగమగును, పై విధంగా విశ్లేషిస్తే 95 శాతం జాతకులకు కుజ దోషమున్నప్పటికీ అది సంపూర్ణముగా భంగమవుతుందనే సత్యం గమనించాలి.
కుజ దోషముంటే కుజ మహా దశలోనే ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కుజ మహా దశ ఏయే నక్షత్రాలవారికి ఏయే వయసులో వస్తుందనేది తెలుసుకుంటే ఇంకా పూర్తిగా తెలుసుకున్న వారవుతారు, చిత్ర, ధనిష్ట మృగశిర నక్షత్ర జాతకులకు జన్మించిన తోడనే కుజ మహా దశ ప్రారంభమగును, ఏ పాదంలో జన్మించినప్పటికీ 7 సంవత్సరాల వయసు లోపలే కుజ మహా దశ వెళ్లును. ఈ సమయంలో వివాహాలు చేయరు, కనుక చిత్ర ధనిష్ట మృగశిర నక్షత్ర జాతకులకు కుజ దోషముందనే భయాన్ని, బెంగను విడనాడండి.
రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులకు జన్మ తోడనే చంద్ర మహాదశ ప్రారంభమై, ఆపై కుజ మహా దశ ప్రవేశించును, మొత్తం మీద 17 సంవత్సరాల వయసు నాటికి కుజ మహా దశ వెళ్లును, వివాహం 17 సంవత్సరాల తదుపరే చేస్తారు కనుక రోహిణి హస్త శ్రవణం జాతకులు కూడా కుజ దోషం వుందనే భయాన్ని విడనాడండి.
ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్ర జాతకులకు కుజ దోషముండి భంగం కాకుండా వుంటే దాని ప్రభావం కుజ మహా దశలోనే వస్తుంది, 113 సంవత్సరాలు జీవించిన తదుపరే కుజ మహా దశ వస్తుంది, ఈ జాతకులకు కుజ దోషముంటే ఇప్పుడేందుకు భయం, భయం చెందాల్సింది 113 సంవత్సరాలకు తరువాత , అది జరిగే పని కాదు.
పునర్వసు విశాఖ పూర్వాభాద్ర జాతకులు 90 సంవత్సరాలు వయసు దాటితే కుజ మహా దశ వస్తుంది, ఈ నక్షత్ర జాతకులకు కుజ దోషముంటే 90 సంవత్సరముల తర్వాత ఆలోచించాలి, ఇప్పుడు సమయం వృధా చేసుకుని కుజ దోషముందని ఆలోచించవద్దు.
పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర జాతకులకు వృద్దాప్యంలోనే కుజ దోషం వర్తిస్తుంది, అది సహజమే, కుజ దోష నివారణోపాయలు, పరిహార మార్గాలు ఎన్నో వున్నాయి వాటిని పాటిస్తూ ధైర్యంగా వుండటానికి ప్రయత్నించండి.
ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలు కుజ దోష భంగ నక్షత్రాలు, అనగా ఆశ్లేష కర్కాటక రాశి, జ్యేష్ఠ వృశ్చిక రాశి, రేవతి మీన రాశి ఈ మూడు రాశులలో జన్మించే జాతకులకు కుజ దోషమున్ననూ భంగమగునని శాస్త్ర వచనం. కనుక భయపడాల్సిన అవసరం లెనే లేదు.
అశ్వని భరణి కృత్తిక 1వ పాద జాతకులు కుజుని స్వస్థానమైన మేష రాశి లోను, మఖ పుబ్బ ఉత్తర 1 వ పాద జాతకులు కుజుని మిత్ర స్థానమైన సింహ రాశిలోను, మూల పూర్వాషాడ ఉత్తరాషాడ 1 వ పాద జాతకులు మరో మిత్ర స్థానమైన ధనూరాశిలోను జన్మిస్తారు, ఈ జాతకులకు కుజ దోషమున్నప్పటికీ కుజ స్వస్థాన మిత్ర స్థానాలలో జన్మించినందున వారికి కుజ దోషం భంగమగునని శాస్త్ర వచనం, ఇలాంటప్పుడు ఆ నక్షత్ర జాతకులకు భయం అవసరం లేదు.
చివరగా వృషభ రాశి కృత్తిక 2,3,4 పాద జాతకులు, కన్యారాశి ఉత్తర 2,3,4 పాద జాతకులు మకర రాశి ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలలో జన్మించిన జాతకులు మాత్రమే కుజ దోష ఆలోచన చేయాలి. అయినా వీరందరికి 21 సంవత్సరాల వయసు రాగానే కుజ మహా దశ వెళ్లిపోతుంది. కావునా 22 సంవత్సరాల వయసు రాగానే వివాహం చేసుకోండి.
మొత్తం మీద కుజ దోషం గురించి బెంగపడనవసరం లేదు, ఇతర గ్రహ సంచారాలచే వచ్చే సమస్యలను కుజ దోషం వలన అనుకుని బాధపడే వారు చాల వరకు కనిపిస్తారు, పై విషయాలను గమనించి అందరూ ధైర్యంగా ఉంటారని ఆశిస్తున్నాను.
(పంచాంగ స్వీకరణ - శ్రీనివాసగార్గేయ ఉవాచ)
__/\__సర్వేజనా సుఖినోభవంతు__/\__
ఓంప్రకాష్ విశ్వజ్ఞ - ఆస్ట్రో న్యూమరాలజిస్ట్