క్షంతకుఁ గాళియోరగ విశాల ఫణోపరివర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధఘోర వాహినీ
హంతకు నింద్రనందననియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచిత భక్తజనానుగంతకున్.
భావము:
క్షమాగుణశీలికి; కాళియుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడికి; పొంగి దాడిచేసిన భయంకరమైన జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడికి; పార్థుని రథాన్ని నడిపినవాడికి; సమస్త చరాచర ప్రపంచం స్మరిస్తుండే వాడికి; జితేంద్రియులైన భక్తుల వెంటనుండువాడకి.