Friday 13 January 2017

షిర్డీ సాయి ఎవరు?

షిర్డీ సాయి ఎవరు? దేవుడా? గురువా? ఎప్పుడైనా సాయి తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నారా? కేవలం గురువుగా మాత్రమే మార్గదర్శకత్వం చేశారా? అసలు సాయిని ఎందుకు పూజించాలి?.. మొదలైన ప్రశ్నలు గత కొద్దికాలంగా తలెత్తుతూనే ఉన్నాయి. తరచి చూస్తే వీటికి సమాధానాలన్నీ సాయి జీవితం నుంచి మనకు లభిస్తాయి.

సాయి అనే పదం దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ మనకు కనిపిస్తుంది. ఈ పదానికి రక్షకుడు, ఆధ్యాత్మిక గురువు, మత గురువు, రాజు, తండ్రి, భర్త, ప్రేమికుడు.. ఇలా రకరకాల అర్థాలున్నాయి. సాయితత్వం అంటే ప్రేమతత్వం అనే విషయం అందరికీ తెలిసినదే. ప్రపంచంలోని అందరికీ కావాల్సినవాడు కాబట్టే ఆయనకు సాయి అనే పేరు వచ్చి ఉంటుంది.

ఇక మన దేశంలో ఇన్ని కోట్ల మంది పూజించే సాయి.. దేవుడా? లేక ఒక సద్గురువా అనే విషయంలోకి వెళ్లే ముందు.. ఈ రెండు పదాలకు మధ్య ఉన్న తేడాని మనం గమనించాలి. సద్గురువు తన శిష్యులకు జ్ఞానమార్గాన్ని చూపించి వారిని ముందుకు నడిపిస్తాడు. దేవుడే మానవ రూపంలో వచ్చినప్పుడు ఆ వ్యక్తిని అవతారం అంటాం. మానవ అవతారంలో ఉన్న దేవుడికి 16 కళలు ఉంటాయి. వాటి ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తాడు. అంతే కాకుండా మానవావతారంలో ఉన్న దేవుడుకి పంచతత్వాలపై పూర్తి నియంత్రణ కూడా ఉండాలి. సాయిలో ఈ రెండు లక్షణాలు స్పష్టంగా మనకు కనబడతాయి. అందుకే సాయి కొందరికి సద్గురువు. ఇంకొందరికి దేవుడు.

సద్గురువు తాను ఎంపిక చేసుకున్న శిష్యులను తనతో పాటుగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ దైవం దగ్గరకు తీసుకువెళ్తాడు. ఈ ప్రక్రియ చాలా సంక్లిష్టమైనది. ఈ సృష్టిలో కొన్ని మాత్రమే సత్యాలుంటాయి. మిగిలిన భావనలన్నీ మనుషులు తామంతట తాము సృష్టించుకున్నవే! సద్గురువు తన శిష్యుల అజ్ఞానాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడా జ్ఞానజ్యోతి శిష్యులను అంతర్ముఖులను చేస్తుంది. వారికి అసలైన ముక్తిమార్గాన్ని ప్రసరింపచేస్తుంది. అయితే ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి మనిషికి కర్మ ఉండాలిగా! ఒక వేళ కర్మ ఉంటే సద్గురువు ఎలా అవుతాడు?.. అనే ప్రశ్న కొందరిలో తలెత్తవచ్చు. సద్గురువులకు పూర్వజన్మల కర్మలేమి ఉండవు. వారు ఒక విధమైన కర్మశూన్యతలో ఉంటారు. ప్రకృతి నియమాల ఆధారంగా చూస్తే.. ఈ సృష్టిలో ఏది శూన్యంతో నిండి ఉండకూడదు. అందువల్ల సద్గురువుల కర్మశూన్యతలోకి వారి చుట్టూ ఉన్న వ్యక్తుల కర్మ ఫలితాలన్నీ ప్రవేశిస్తూ ఉంటాయి. ఇది అసంకల్పితంగా జరిగిపోతుంది. శ్రీసాయి సచ్చరిత్రలో- ఒక గుర్రాన్ని గట్టిగా కొడితే సాయి వీపు మీద చారలు పడినట్లు.. భక్తులకు రోగం వస్తే ఆ బాధ సాయి పడినట్లు కనిపిస్తుంది. అందుకే చాలా మంది భక్తులకు షిర్డీ సాయి సన్నిధిలో అన్ని బాధలు తొలగిపోయినట్లు అనిపిస్తాయి. అందుకే సాయి.. ‘‘నువ్వు వేల మైళ్ల దూరంలో ఉన్నా.. నువ్వు చేస్తున్న పని నాకు తెలుస్తుంది’’ అంటారు.

ఇక సాయి తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న సందర్భాలు లేకపోలేదు. అలౌకిక ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న సందర్భాలలో.. సాయి తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. అవసరమైనప్పుడు మహిమలు చూపించాడు. కానీ కేవలం మహిమల ద్వారా మాత్రమే తాను దేవుడినని చెప్పి ప్రజలను నమ్మించలేదు. సాయి బోధనలైన జీవకారుణ్యం, సర్వమత సమానత్వం, సామాజిక సౌభ్రాతృత్వం మొదలైనవన్నీ మన ఆధునిక సమాజానికి పనికొచ్చేవే! అందుకే శ్రీసాయి సచ్చరిత్రలోని 25వ అధ్యాయంలో- ‘‘నన్ను నమ్మండి. నేను చనిపోయిన తర్వాత కూడా నా సమాధిలోని ఎముకలు మీకు స్థైర్యాన్ని ఇస్తాయి. నన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి, నాతో మమేకమైపోతారో వారితో నేను సమాధి నుంచి కూడా మాట్లాడతాను. నన్ను ఎప్పుడూ మీ హృదయంలో ఉంచుకోండి.. మీకు ఎలాంటి ఆపద రానివ్వను..’’ అని అంటారు. అందుకే ఆయన ప్రవచించిన ప్రేమతత్వం ఆయన మరణించిన 98 సంవత్సరాల తర్వాత కూడా ఖండఖండాంతరాల్లోనూ వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలో ఆయన దేవుడా? లేక కేవలం గురువా? అనే విషయంపై చర్చ కన్నా ఆయన చెప్పిన విలువలను పాటించడం మంచిది!
andhra jyothi paper nundi

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles