Sunday, 8 January 2017

భారతీయ గోవును ఎందుకు కాపాడాలి?

                         

న్యూజిలాండ్‌ దేశ ప్రముఖ ఆహార శాస్త్రవేత్త డా|| కీల్‌ఉడ్‌ఫోర్డ్‌ తమ జాతుల ఆవుపాలు విషపూరితాలని పేర్కొన్నారు. వీటిలో ”బీటి కాసోమార్ఫిన్‌-7 (బిసిఎమ్‌-7)” అనే విషపదార్థాలవల్ల జెర్సీ లాంటి జాతుల ఆవుపాలు మిక్కిలి అనారోగ్యకరమనీ, కాన్సర్‌ వంటి భయంకర రోగాలు కలుగుతాయనీ తెలిపారు. వీటికి ఏ-1 రకం పాలని పేరు పెట్టారు.
మరి ఏ-2 రకం పాలు భారతీయ గో జాతుల పాలు (మూపురం- సూర్యకేతు నాడి ఉన్న గో జాతులు) అనీ, ఇవి రోగాలను నాశనం చేసే శక్తి కలవనీ, విదేశీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ప్రస్తుతం మన భారతీయ గోజాతుల సంతతు లను (బ్రీడ్‌లు) వారి దేశాలకు తీసుకు పోతున్నారు. అంతేకాకుండా డా||ఎన్‌.గంగాసత్యం రచించిన ”అర్క్‌ తీసుకొండి- ఆరోగ్యంగా ఉండండి” అనే చిన్న పుస్తకం ప్రకారం (19వ పేజీలో) జెర్సీపాలు త్రాగే ప్రతి ముగ్గురిలో ఒకరికి కేన్సర్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నదని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. అతి చిన్నదైన తైవాన్‌ దేశంలో, పాలలో ఉండే ఒక ప్రోటీన్‌ కేన్సర్‌ పెరుగుదలను నిరోధించగలదని వారి ప్రయోగాల గురించి ఒక వార్తా పత్రికలో వచ్చింది. ఒక దేశవాళీ జాతి గోమూత్రంలో బంగారం ఉన్నదనీ, దానికై ప్రయోగాలు అధికం చేస్తున్నట్లు ఈ మధ్యనే దిన పత్రికలలో ప్రచురించబడింది. ప్రపంచం అంతా మన గోజాతుల పాల గురించి కోడై కూస్తుంటే, మనం మాత్రం శుప్తావస్థలో జోగుతూ ఉన్నామంటే – ఎవరైనా నవ్వుతారు.
బ్రెజిల్‌ వంటి దేశాలవారు 16 కోట్ల మన ఒంగోలు జాతి సంతతిని అభివృద్ధి చేసుకొని, తమ దేశ ప్రధాన ఆర్థిక వనరు గోవులే అని ప్రకటించు కొన్నారు. మరి మన దేశంలో, రాష్ట్రాలలో ప్రధాన ఆర్థిక వనరులు ఏవో మనకు తెలుసు. ప్రముఖ న్యాయస్థానాలు కూడా ”మద్యం ప్రవాహం లేకుండా ప్రభుత్వాలు పరిపాలన చేయలేవా?” అని ప్రశ్నించిన ఉదాహరణలున్నాయి. ”అమూల్‌ బ్రాండ్‌”తో ప్రపంచ దేశాలకే పాఠం చెప్తూ-భారతీయ శక్తిని, హరిత విప్లవం, శ్వేత విప్లవం (గ్రీన్‌ వైట్‌ రివల్యూషన్స్‌) ద్వారా చాటి చెప్పిన మేటి వ్యక్తి డా||వర్గీస్‌ కురియన్‌ను మరల గుర్తు చేసుకోవలసిందే.
ప్రపంచంలోనే అతిపెద్ద గోశాల సౌదీలో వుందిట. అనేక ముస్లిం దేశాలలోను, బ్రెజిల్‌ వంటి దేశాలలోను గో సంరక్షణ, గో జాతుల ఉత్పత్తి చేస్తూ ప్రపంచ రికార్డులను ప్రదర్శిస్తున్నారు. ఏ మత గ్రంథాలలోను గోవులను వధించమని, భక్షించమని లేదనీ ప్రపంచ ప్రసిద్ధ విద్వాంసులందరు తెలియ జేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎమ్‌.ఎల్‌.ఏ. జమీరుల్లా ఖాన్‌ గోమాత రక్షణకు నడుంకట్టినట్లు పత్రికలలో చదివాము. కొన్ని ముస్లిం మతసంస్థలు కూడా గోవధ చేయరాదనీ, దానికి తాము కూడా వ్యతిరేకమే అనీ ముందుకు వస్తున్నాయి. ఒక ప్రముఖ వార్తా పత్రిక తమ విశేష సంచికలో ఒక ఆవు 10 ఎకరాల బీడు భూమిని సస్యశ్యామలం చేయగలదనీ, 300 రకాల రోగాలను నయం చేయగలదనీ, 3,00,000 రూపాయల జాతీయాదాయాన్ని పెంచుతుందనీ తెలిపారు.
జంతు జాతులన్నింటిలో గోవు విశిష్టతను గూర్చి శాస్త్రకారులు ఎప్పటి నుండో తెలియజేస్తున్నారు. తిలక్‌,గాంధీ, మదన్‌మోహన్‌ మాలవీయ, అంబేడ్కర్‌ వంటి ఎందరో జాతీయ నాయకులు మన దేశ మూలాలు, గోవులో ఉండే పవిత్ర, ధార్మిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయ సంబంధాన్నీ, శక్తినీ తెలియజేస్తూ – స్వతంత్ర భారతములో సంపూర్ణ గోవధ నిషేధాన్ని ఆశించి, రాజ్యాంగంలో పొందుపరిచారు.
నిత్య జీవితంలోనూ పతంజలి – రామ్‌దేవ్‌ బాబా, శ్రీశ్రీ రవిశంకర్‌, గో బ్రాండ్‌ ఔషధాలు వాడటం ద్వారా అన్ని మతాల, కులాల, వర్గాలవారు వారి ఆరోగ్య విషయాలలో ప్రయోజనాలు పొందుతున్న ఉదాహరణలు కోకొల్లలుగా వున్నాయి. హైద్రాబాద్‌ నేటి మేయర్‌ – బొంతు రామ్మోహన్‌ మాతృమూర్తి గో మూత్రం వాడటం ద్వారా కేన్సర్‌ జబ్బు నుండి విముక్తమై ఆరోగ్యంగా ఉన్నట్లు తెలియజేసారు. ”అమృతవర్షిణి కథావీధి” అను చిరుపుస్తకంలో ప్రముఖ విద్యావేత్త చిట్టా దామోదర శాస్త్రి ఈ మధ్యకాలంలో జరిగిన నిజ జీవితపు ఉదాహరణలు, గోమాత శక్తినీ, వైద్యపరంగా దాని విశేషతలను తెలియజేసారు. కిడ్నీల మార్పు అవసరంలేకనే రోగి ఆరోగ్యం గో మూత్రము, పంచగవ్య చికిత్సలద్వారా బాగుపడిన ఉదాహరణలు డాక్టర్లకే ఆశ్చర్యమును కలిగించేవిగా ఉన్నాయి.
భైంసా మండలం ‘ఖోని’ గ్రామ నివాసియైన గంగాధర్‌ అనే ఉపాధ్యాయుడు 28 ఎకరాల మొత్తం పొలం గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. గతంలో లక్షాముప్ఫై వేల రూపాయల ఎరువు మందులు, పురుగుమందులు వాడేవాడిననీ, కానీ ఈ రోజు ఒకపైసా కూడా ఖర్చు చేయట్లేదనీ తెలిపారు. అంతేకాకుండా అందరికంటే ఎక్కువ పంటదిగుబడి సాధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ, ఆ లక్షా ముప్ఫైవేల రూపాయలు ప్రారంభంలోనే మిగిలాయి అని సంతోషంగా తెలిపారు. ఇలాంటి రైతులు అనేక మంది గో ఆధారిత వ్యవసాయం చేస్తూ, ఆదర్శ రైతులుగా రసాయనిక విషాహారం కాని అమృతాహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.
”సోషల్‌ అప్లికేషన్‌ ఆఫ్‌ స్పిరిట్యుయాలిటీ” అంటే సమాజానికి ఆధ్యాత్మికతను అనువర్తించడం. ఆధ్యాత్మికత సామాజిక అనువర్తి భారతీయ సంస్కృతిలో అడుగ డుగునా కనిపిస్తుంది. అలాంటి జాతీయ మూల తత్వాన్ని స్వాతంత్య్రం వచ్చాక దెబ్బకొట్టే ప్రయత్నం జరిగింది. బూజు పదార్థం కూడా అనుభవజ్ఞుల చేతిలో పడితే ప్రజోపయోగ కరమైన ”పెన్సిలిన్‌” తయారైంది. భారతీయ దార్శనికులు, ఋషులు చెప్పిన ఆ మూలాలే మన సంస్కృతినీ, జాతినీ పరిరక్షించాయి. గోరక్షణ- దేశ రక్షణ కంటే ఏ మాత్రం తక్కువ కాదని మహాత్మా గాంధీ తెలిపారు. ఇంతటి మ¬న్నత లక్షణా లున్న మన గోమాతను కాపాడుకోవటం మనందరి బాధ్యత.
ఇప్పటికే దేశంలో నగరాలు, పట్టణాలలోనూ దేశీ గోవుల స్వచ్ఛమైన పాలు, పెరుగు, నెయ్యి, వాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా శ్రద్ధ చూపిస్తే మంచి దేశీ గో- సంతతులను అభివృద్ధి చేయుటం వేగవంతమవగలదు.
గో సంరక్షణ- గోవధ నిషేధానికి సంబంధించి ప్రభుత్వ- రాజ్యాంగ చట్టాల గురించి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ లేఖలు వ్రాసినట్లుగా 10.08.2016 నాటి దినపత్రికలలో చదివాము. 7వ షెడ్యూల్‌లోని 15వ అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా గుర్తుచేస్తున్నట్లు చదివాము. దేశంలోనే అతిపెద్ద గోవధశాల తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న సంగతి మరవలేము. గతంలో కొన్ని జిల్లాల కలెక్టర్లు, సైబరాబాద్‌ పోలీస్‌కమీషనర్‌ వంటివారు ఈ విషయమై నిర్దిష్ట ఉత్తర్వులనూ క్రింది శాఖలవారికి ఇచ్చారు. కనుక మన ప్రభుత్వం జిల్లాల అధికారులతో గో సంరక్షణ, గోవధ నిషేధ చర్యలు ప్రారంభిస్తే, కొన్ని లక్షల గోవధలను ఆపిన పుణ్యం ప్రభుత్వానికి దక్కుతుంది. బంగారు తెలంగాణ కూడా గోవులతో సాకారమవు తుంది.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles