భూగోళం పై సృష్టి జరగకముందు మొత్తం భూమిని ఆవరించి ‘సముద్రుడు’ ఉండేవాడు. ఎక్కడా కుడా ఇసుమంతైనా భూభాగం కనిపించేది కాదు. దేవతలు సముద్రుడికి భూగ్రహాన్ని నివాసంగా ఇవ్వడం జరిగింది. అటువంటి సమయంలో దేవలోకంలో ఉన్న బ్రహ్మ సృష్టి జరగాలనీ, అదికూడా మహాశివుని ద్వారా జరగాలనీ, అదికూడా ‘భూమి’ మీద సముద్రుడి చుట్టుకొలతలతో జరగాలనీ ఆశించాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న సముద్రుడు తను ఆవరించిన చుట్టుకొలతలో కొంతమేర తగ్గించి అక్కడక్కడ భూమి బయటకు కనిపించే విధంగా తన రూపాన్ని అమర్చుకున్నాడు. అంతట పరమశివుడు మరణము సంభవించనీ, సమానగుణములూ, సత్వగుణములు కలిగిన మానవజాతిని సృస్టించడానికి కావలసిన శక్తి కోసం పాతాళలోకంలో ఒకానొక శుభదినాన్న తపస్సు ప్రారంభిస్తాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ సృష్టి అంటే ‘చరాచర’ జగత్తు. అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటూ ఒకదానిమీద మరొకటి ఆధారపడేలా ఉండాలి కాని సృష్టి అంటే సమాన జగత్తు కాదనీ, 5 భిన్న సముదాయాల సమ్మేళనమే (పంచ భూతాలు) సృష్టి అనీ, శివుని తపస్సు అందుకు భిన్నంగా ఉందనీ “నేనొకటి తలిస్తే శివుడొకటి తలుస్తున్నాడని” అందరిలో (తను కలిసిన వారందరితో) చెబుతాడు. ఆ విషయాన్ని పాతాళలోకంలో తపస్సులో ఉన్న శివునికి తపోభంగం కలిగించి మరీ చెబుతుంది ‘ప్రకృతి’.
ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు ఆవేశంతో అయితే “ఆయన్నే సృష్టి చేసుకోమని” కైలాసం వెళ్ళడానికిగానూ పాతాళలోకం నుండి పైకి వచ్చుటకొరకై చక్రాకార భ్రమణం చేయుచున్న భూమి అడ్డువచ్చుట చూసి “నేను వెళ్ళాలి దారిని వొదులు, అడ్డులే!” అని అరుస్తాడు. అప్పుడు భూమాత వినయంతో “పరమశివా! రాకరాక ఇక్కడికి వచ్చావు. కారణమేదైనా, ఎవరిమీద కొపమున్నా దయచేసి నాకు నీ స్పర్శన భాగ్యం కలిగించి, నన్ను భాదింపకుండా సూక్ష్మరూపధారుడవై నాలో ప్రవేసించి, నా కర్ణముల గుండా కైలాసానికి వెళ్ళవలసింది” అని దీనంగా స్తోత్ర సహితంగా ప్రార్దించింది. ఆస్తోత్రాన్ని విన్న రుద్రుడు శాంతించి అంగుష్టమాత్ర శరీరాన్ని ధరించి భూమాత కర్ణముల గుండా బయటకు వచ్చి ఆనందంతో “నీకు గల మరొక పేరు (భూమికి గల మరొక పేరు) ‘గో’, ఇది నీ కర్ణ ప్రదేశం కనుక ఇకనుండి ఈ సుందర ప్రదేశం “గోకర్ణ” గా ఖ్యాతి పొందుతుంది. ముందు యుగాలలో ఇక్కడ గోకర్ణ ఆకారంలో, “గోకర్ణేశ్వరుడనే మహాబలేశ్వరుడు ఆత్మలింగంగా”స్థాపింపబడతాడు. అశ్వనీదేవతల పై నాకుగల ప్రేమను చాటడంకోసం ఈ పేరులో అంతర్లీనము గా ఉన్న గోకర్ణ (ఆవుచెవి – ఆవు చెవిలో అశ్వనీ దేవతలుంటారు) ఆకారం లోనే గోకర్ణేశ్వరుడు ఉంటాడు. ఈ ప్రాంతం అనేక గోవులకు ఆలవాలమై ఉంటుంది. నేను పాతాళం నుండి బయటకు వెళ్ళునప్పుడు ఈ ప్రదేశం “యోని” లాగా నాకు కనిపించినందున ఈ ప్రాంతాన్నే “రుద్రయోని / విశ్వయోని” అనీ, ప్రళయకాలంలో భూమిపై గల సముద్రుడు ఇక్కడే “సుడి” తిరిగి సృష్టిని తనలో కలిపేసుకుంటాడుగాన దీనికి “వరుణావర్తం” అనీ పేరు వస్తుంది. “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి పొద్దున్న ఉచ్ఛరించిన , గత రాత్రి చేసిన పాపములన్నీ హరించుకుపోవును. అలాగే “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి సాయంత్రం ఉచ్ఛరించిన, పొద్దున్న చేసిన పాపములన్నీ హరించుకుపోవును. ముందు ముందు క్రమంగా ఇక్కడకు మహర్షులూ, దేవతలూ, గంధర్వులూ, యోగులు వచ్చి వారి పాపముల ప్రక్షాళనగావించుకొనెదరు. ఇక్కడికి తీసుకురాబడేవారెవరైనా, ఇక్కడనుండి తీసుకుపోబడేవాడేవడైనా (ఇక్కడ మరణం పొందినవారు) అత్యంత అదృష్టవంతుడని తలంపుము. ఇక్కడే తాంత్రిక విద్యలు పుడతాయి. వాటిని నిరోధించే హనుమంతుడూ ఇక్కడే పుడతాడు. ఈ ప్రాంతం భూమి మీద గల ప్రత్యేక ప్రాంతంగా, భౌతిక సుఖాలకు, ఆధ్యాత్మిక సుఖాలకు కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాంతంలో ముందు ముందు “అఘనాశిని మరియు గంగావళి ” (అఘనాశిని = పాపమును నశింపజేసేది, గంగావళి = గంగతో సమానమైనది) అనే పాపాలను సమూలంగా కడిగే ఈ విశ్వం లోనే గల ఏకైక సముద్ర సంగమసహిత రెండు నదులు పారుతాయి. (కాశి లోని గంగానది సముద్రసంగమ ప్రదేశం కాదు). ఎవరైతే ఈ అఘనాశిని మరియు గంగావళి నదులు సముద్రంలో కలిసే చోట స్నానమాచరిస్తారో వారికి పన్నెండు పూర్వ జన్మలలో చేసిన పాపాలూ, అలాగే ప్రస్తుత జన్మలో అప్పటివరుకు చేసిన పాపాలూ “శూన్యమవుతాయి”, ఇక్కడికి మునులూ దేవతలూ సైతం వచ్చి సంధ్యవార్చి స్నానం చేసి వెళ్ళవలసిందే!” అని రుద్రుడు భూమికి వరముని ఇచ్చి కైలాసానికేగుతాడు.