ప్రశ్న: మోచేతి మీద అనుకోకుండా ఏదైనా వస్తువు తగిలితే ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టుగా ఉంటుందెందుకు?
జవాబు: మన శరీరంలో వివిధ భాగాల నుంచి మెదడుకు సమాచారం అందాలన్నా, మెదడు నుంచి అవయవాలకు ఆదేశాలు చేరాలన్నా నాడీ వ్యవస్థ (nervous system) కీలక పాత్ర వహిస్తుంది. పంచేంద్రియాలు గ్రహించిన సమాచారం విద్యుత్ రసాయనిక పొటన్షియల్ (electrochemical action potential)గా మారి నాడుల ద్వారా ప్రయాణిస్తుంది. ఈ నాడులన్నీ శరీరంలో అస్థిపంజరానికి దగ్గరగా ఉంటాయి. అంటే ఎముకలనే పందిరికి అల్లుకున్న తీగల్లాగా అన్నమాట. కండరాలకు దిగువగా ఉండడం వల్ల నాడుల్ని మనం చేత్తో సరాసరి స్పృశించలేము. కానీ మోచేయి, మణికట్టు, వేళ్ల కణుపుల దగ్గర కండరాలు తక్కువగా ఉండడం వల్ల అక్కడ నాడీతంత్రులు చర్మపు పొరకు దగ్గరగానే ఉంటాయి. మోచేతికి దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రకంపనాలు అక్కడే ఉన్న నాడులకు వెంటనే తగులుతుంది. అవాంఛితమైన, అలవాటు లేని సంకేతాలు హఠాత్తుగా పుట్టడం వల్ల ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు మనకి అనిపిస్తుంది.
నటరాజ్ కులకర్ణి