Wednesday 26 July 2017

నాగపంచమి వ్రతకధ



ఏటా శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.

చలి చీమ నుండి ... చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది . హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు . వాసుకి పరమేశ్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.

నాగ జాతి జనము :

కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .

"విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాదు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధమని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆతలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .

 దాంతో దెవత లంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం.అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.

నాగ పంచమి వ్రత కథ

పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తున్నవి దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .
ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విశ్వాసము వారిది.

మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి.. ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి. అలాగే పాములు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.

స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. అందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో ఒక పాముని చంపినా, ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ. జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల, ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే.

నాకు తెలిసినంత వరకూ పాము లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములన్నాయి. క్రొత్తగా, షాపింగు కాంప్లెక్సులలా కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు. కాని మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. అంతేకాకుండా, ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే.

కాలసర్ప యోగం  ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప యోగం  ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి, సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయి

🌷సర్వేజనాఃసుఖినోభవంతు 💐

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles