Thursday 27 July 2017

అరుణాచలేశ్వరుడు

--: అరుణాచలేశ్వరుడు :--
===============
మనకి" అష్టమూర్తి తత్త్వము" అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.

అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు,

 సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.

 కంచిలో పృథివీ లింగం,

 జంబుకేశ్వరంలో జలలింగం,

 అరుణాచలంలో అగ్నిలింగం,

 చిదంబరంలో ఆకాశలింగం,

 శ్రీకాళహస్తిలో వాయులింగం,

 కోణార్కలో సూర్యలింగం,

 సీతగుండంలో చంద్రలింగం,

 ఖాట్మండులో యాజమాన లింగం –

 ఈ ఎనిమిది అష్టమూర్తులు.

 ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే.

 కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం.

అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు.

 అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు.

అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది.

 అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది.

ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర.

 అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు.

 అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది.

 కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు.

 అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి.

 అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది.

 అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు.

 అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు.

 అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.

దర్శనాత్ అభ్రశదసి
 జననాత్ కమలాలే
 స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది.

మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.

కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.

ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది.

 అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది.

దాని పేరే అరుణాచలం.

 అచలము అంటే కొండ.

 దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది.

ఆకొండ అంతా శివుడే.

 అక్కడ కొండే శివుడు.

 కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు.

 అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు.

 అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి.

గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి.

 ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి  ఉంటుంది.

అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు.

 అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం.

 దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది.

ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి.

 ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి.

 అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది.

 అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి.

ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు.

 అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం.

 కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.

 అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది.

 అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది.

 అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు.

 అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం.

ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు.

ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి.

 అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది.

అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు.

 ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను.

 నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని, చందా ఇవ్వమని అడిగేది.

 ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది.

అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు.

అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది.

తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది.

 రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు.

ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది.

 అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది.

 తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది.

ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు.

 అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు.

 దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది.

 అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది.

అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది.

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది.

ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది.

 పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది.

 ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు.

 లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు.

శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు.

 అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది.

ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు.

సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము.

స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే.

 అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు.

 అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ.

అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ.🙏🏻🙏🏻🙏🏻

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles