ఒకానొకప్పుడు యమదూతలు మోక్షము పొంది జన్మ రహిత్యమును పొందు వారెవరు? మరియు, నరకార్హులై సంసారమున మగ్గు వారెవరు అని అడిగినపుడు విష్ణు దూతలు ఈ విధముగా సమాధానము ఇచ్చారట.
దుష్ట జన సాంగత్యము వీడి సాదు జనులను ఆశ్రయించు వారు, అనుక్షణము భగవత్ స్మరణతో నుండు వారు, స్నాన, సంధ్యా, జప, హోమ స్వాధ్యాయము లు ఒనరించు వారు, సర్వ భూతములను సమ భావముతో చూచువారు, నిత్యమూ అన్న దానము చేయువారు, గో, హిరణ్య, విద్య , కన్య దానము చేయువారు, పరోపకార పారిణులు, జ్ఞాన మార్గ నిష్ణాతులై, ఇతరులకు ఉపదేశించు వారు, కపట రహితులై శ్రద్ధా భక్తులతో భగవత్ ఆరాధనా చేయువారు, నిర్ధనులకు ఉపనయన, వివాహాది సుభ కార్యములు చేయువారు, అనాధలకు సుశ్రుష చేయువారు, నిత్యమూ సాలగ్రామ తీర్ధము సేవించువారు, తులసి మాలను ధరించి, విష్ణు అర్చన చేయువారు, తులసి వనము పెంచువరు, గృహములందు నిత్యమూ దేవతారాధన, గీత పారాయణము, నామ సంకీర్తన జరుపువారు, గృహమందు, భాగవత గ్రంధమును పూజించు వారు , సూర్యుడు తుల, మకర, మేష రాశులందు ఉన్నపుడు స్నానము చేయువారు, మణికర్ణికా ఘట్టము నందు మరణించు వారు, పవిత్ర భగవన్నామ స్మరణ చేయుచు మరణించు వారు, పంచ మహా పాతకములు చేసిన వారుకూడా నామ సంకీర్తన మాత్రమున వైకుంఠమును చేరగలరు.
త్యాగ శీలురు, సత్య అహింస లనే ఆధారముగా చేసికొని సాత్వికపు వృత్తిలో జీవితము గడుపువారు, హృదయ సదనమున పరమాత్మను పూజించువారు దేవాలయములు, గోవులు, ఆశ్రమములు, బ్రాహ్మణులూ కనపడినపుడు దండ ప్రణామములు చేయువారు ముక్తిని పొందగలరు.
ముక్తికి జాతి, మత, వయో బేధములు లేవు. జన్మ పరమ్పరలను తొలగించుకొనుతయె ముక్తి పొందుట. కావున సర్వులు ముక్తిని పొందుటకు సర్వదా త్రికరణ శుద్ధిగా ప్రయత్నించ వలెను.