శివునికి పరమపవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ నెలలో సోమవారంనాడు
ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి
విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం
సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక
మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత
కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.
ఈ వారంలో ముత్తౖదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య
భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో
శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం
సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీముహూర్తమున స్నానమాచరించి
"హరహరశంభో" అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో
పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని
కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం.
సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు
ధరించి మొదటగా శివాలయానికి వెళ్లి స్వామివారి సన్నిధిలో కార్తీక
దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించడం వలన
సమస్త దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను
పాటిస్తూ ఈశ్వరుడిని ఆరాధించడం వలన మోక్షానికి అవసరమైన
అర్హతను పొందడం జరుగుతుంది. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి
శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య
సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం.
శివుడిని బిల్వదళాలతో పూజించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని
ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పరమశివుడికి ఇష్టమైన
పాయసాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని
ప్రసాదంగా స్వీకరించడం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టం
చేయబడుతోంది.