గతాన్ని ఒక్కసారి వెనుదిరిగి చూసుకొని , పగలు - పంతాలు మరచి పోయి, కోపతాపాలు ప్రక్కన బెట్టి. దూరమైన బంధువుల్ని, మరచి పోయిన మిత్రుల్ని సాదరంగా పిలిచి చేసుకొనే వేడుక షష్టి పూర్తి.
అరవై సంవత్సరాల వయసంటే; ఎన్నో సంవత్సరాల దాంపత్యానుభవం... ఎంతో లోకానుభవం!.... కొడుకులు - కోడళ్లు, కూతుళ్ళు - అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, అన్నదమ్ములు, బంధువులు మిత్రులు.... ఇలా ఎందరో... వీళ్ళందరినీ ఒకసారి కలవాలి... అలా కలవాలంటే ఏదో ఒక వేడుక వేదిక గా అవ్వాలి అదే షష్టి పూర్తి వేడుక.
జీవితం లో ఎత్తు పల్లాలు, కష్ట సుఖాలు, దూషణ భూషణలు, చీత్కారాలు,... తెలిసో తెలియక మనం ఎవరినైనా నొప్పించిన వారు ఉండవచ్చు... వాళ్ళను పిలిచి క్షమాపణలు చెప్పుకోవాలి…. మన అభ్యున్నతికి కృషి చేసిన వారు ఉండవచ్చు; వీళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి.. ఇవన్నీ చెప్పడానికి అనువైన సమయం షష్టి పూర్తి వేడుక.
మనిషి కి 60 సంవత్సరాలు వచ్చిన తరువాత మిగిలేది ముందు ముందు అనుభవించే వార్ధక్యమే!. శరీరం లోని ఏ అవయవమూ సరిగా పని చేయదు. రోగాల గూడుగా మారిపోతుంది. మారిపోతున్న కాలానికి మార్చుకోలేని మనస్తత్వం తో మిగిలి పోవాల్సి వస్తుంది. షష్టి పూర్తి నాటికి మనం తీసుకోవాల్సిన ఎన్నో నిర్ణయాలు పూర్తి చేయాలి. ఇంత కాలం మనల్ని నమ్ముకొని జీవించిన అర్ధాంగికి మంచి జీవన మార్గం ఏర్పరచాలి... అక్క చెల్లెళ్ళకు, అన్న దమ్ములకు బట్టలు పెట్టాలి... అందరినీ ఆశీర్వదించాలి.. ఆశీస్సు లందాలి.... ఇదే షష్టి పూర్తి.
ఇంత చక్కని సదవకాశం మరలా జీవితం లో ఏ మనిషి కీ రాదు. అందుకే షష్టి పూర్తి అందరూ చేసుకోవాలి.
షష్టి పూర్తి వేడుక ఎవరు చేయాలి?
తమకు జన్మ ఇచ్చి, విద్యాబుద్ధులు నేర్పించి జీవితం లో స్థిర పడడానికి దోహదపడిన తల్లిదండ్రులకు పిల్లలు ఒక పెళ్లి లా చేయాలి.
షష్టి పూర్తి రోజు న ఏమి చేయాలి?
పురోహితులను సంప్రదించి సత్యన్నారాయణ వ్రతం / ఆయుష్ హోమం లాంటివి చేసుకొని పంచ భక్ష్య పరమాన్నములతో బంధు మిత్రులకు విందు భోజనం ఏర్పాటు చేయాలి.