Sunday 15 November 2015

నాగుల చవితి

15 నవంబరు 2015, ఆదివారం, కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి


పూజించవలసింది నాగులనా? దేవతాసర్పాలనా? పాములనా?



నాగపంచమి, నాగుల చవితి వస్తోందంటే చాలు, హిందూ సంప్రదాయాలు మూఢనమ్మకాలు, పాములు పాలు త్రాగుతాయ? వీళ్ళు పాములను హింసిస్తున్నారు, ఆదిమానవుడి కాలపు అలవాట్లను పాటిస్తున్నారు అంటూ మీడియా ఎంతసేపు దాడి చేసి, ధర్మాన్ని కించపరచాలని చూస్తోందే కానీ, నిజానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఆచరణలో ఏమైనా మార్పులు వచ్చాయా? సంప్రదాయాన్ని తప్పుగా అర్దం చేసుకున్నారా? ఒకవేళ పొరబడి ఉంటే, దాన్ని ఎలా సరిజేసుకోవాలని చెప్పే ప్రయత్నం చేయదు.

ఆంగ్లేయులు భారత్ మీదకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రభావం బాగా పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే ఎంతో విశాలమైన భాష అయిన సంస్కృతాన్ని, దాని నుండి వచ్చిన భారతీయ భాషలలోని పదాలకు ఇంగ్లీష్‌లో అర్దం వెతుక్కునే స్థితికి చేరుపోయాము. అది ఇంకా దిగజారి ఏకంగా ఇంగ్లీష్ పదాలనే ఉపయోగిస్తూ, దాని అర్దాలనే సంస్కృతపదాలకు అంటగడుతున్నాము. విషయంలోకి వస్తే ఇంగ్లీష్ వాళ్ళకు Snake అనే పదం ఒక్కటే ఉంది. కానీ మన ధర్మంలో నాగులు, సర్పాలని రెండు ఉన్నాయి. నాగులు వేరు, సర్పాలు వేరు. భగవద్గీత 10 వ అధ్యాయంలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పిన మాటలివి.




ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః|| 10-28 ||


నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మన్మదుడిని, సర్పాలలో వాసుకిని.
• సర్పాలలో తాను వాసుకి అని చెబుతున్నాడు. వాసుకి శివుని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది. ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేసారు దేవదానవులు. వాసుకి కద్రువ తనయుడు.
అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్|| 10-29 ||


నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పీత్రులలో ఆర్యముడిని, సంయమవంతులలో నిగ్రహాన్ని.
• ఈ శ్లోకంలో ‪#‎శ్రీకృష్ణుడు‬ తాను నాగులలో అనంతుడనని చెబుతున్నాడు. అనంతుడు అనగా ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, రెండవ వాడు వాసుకి. కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయనను తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు అనంతుడు. బ్రహ్మ అతడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారం లో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా.


ఇప్పుడు మనకు ఒక సందేహం రాక మానదు. పైన సర్పాలలో వాసుకి తానన్నాడు, ఇక్కడ నాగులలో అనంతుడనంటున్నాడు. అసలు సర్పాలు , నాగులు ఒకటి కాదా ? ఏమిటి తేడా? కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్ట లోకం వుంది. నాగులకు వాయువు ఆహరం, అనగా అవి గాలిని స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలకు కప్పలు మొదలైన జీవరాశులు ఆహారం.


నాగుల్లో మళ్ళీ 9 జాతులు ఉంటాయి. అట్లాగే సర్పాల్లో కూడా దేవతాసర్పాలని ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుంది. కానీ ఇవి మానవసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవు, మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు. అలా చిక్కుతాయి అనుకోవడం సినిమాల ప్రభావం మాత్రమే.


పాములు పాలు త్రాగవన్నమాట నిజం. అవి సరిసృపాలు కనుక వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నం. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటారు, ఆరోగ్యాన్ని, సంతనాన్ని అనుగ్రహిస్తారు. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయి. అవి కూడా పాలు త్రాగుతాయి.


ఈ నాగపంచమి మొదలైన నాగదేవతారాధన తిధులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవారు. అప్పటి మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. ఆ రోజులు వేరు. కనుక అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపుకుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందు వలే మర్త్యలోకంలో సశరీరంతో సంచరించడం మానేశారు. విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి, పూజించినవారికి సత్ఫలితాలను ఇస్తున్నారు. అలాగే దేవతాసర్పాలు కూడా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తిరగడం మానేశాయి. ఒక 75 ఏళ్ళ క్రితం వరకు దేవతసర్పాలను చూసి, పూజించి, వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబసభ్యులకు ఇప్పటికి ఆ విషయాలు స్మరణలో ఉంటాయి. కానీ ఇప్పుడు సదాచారం, శౌచం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేశారు, ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉన్నా, సక్రమంగా పాటించడం తక్కువ. దాంతో దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి. ఆలయాల్లో వాటికి జరిగిన అపరాధం కారణంగా కొన్ని శరీరం విడిచిపెట్టాయి.


ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేము. చాలామటుకు ఏదో మాములు పాములే జనావాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి. ‪#‎నాగపంచమి‬‪#‎నాగులచవితి‬ కి నాగదేవతలకు పూజలు చేయాలి. కానీ పైన చెప్పుకున్న విషయాలు అర్దంకాక ప్రజలందరూ మాములు పాములకు పాలు పోస్తున్నారు, పసుపు కుంకుమలు వేస్తున్నారు. మామూలు పాములు పాలు త్రాగవు, వాటికి పసుపుకుంకుమలు పడవు. అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.


ఇప్పటి ప్రజల్లో ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. నాగపంచమి, నాగులు చవితి మూఢనమ్మకలు కాదు, నాగదేవతలను పూజించి, సంతానం పొందిన దంపతులు కోకొల్లలు. ఇతర పిల్లలతో పోల్చినప్పుడు నాగదేవాతానుగ్రహంతో కలిగిన సంతానంలో నాగదేవతల యొక్క వరప్రభావం, అంశను తల్లిదండ్రులు పసిగట్టగలుగుతారు. కానీ అలా సంతానం కోసం పూజించవలసింది నాగులనే కానీ మామూలు పాములను కాదు.


ఈశ్వర సృష్టిలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంది. సాధారణ సర్పాలు జీవవైవిధ్యంలో, ఆహారచక్రంలో తమవంతు పాత్ర పోషిస్తాయి. వాటి మనుగడతోనే మానవమనుగడ సాధ్యమవుతుంది. మామూలు పాముల జోలికి వెళ్ళకుండా ఉండడం, వాటి మానాన వాటిని వదిలేయడం, వాటిని ఎవరైనా హింసిస్తుంటే రక్షించడం వల్ల కూడా దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చు.


సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు. కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా, వచ్చిన మార్పులను ప్రజలు అర్దం చేసుకోలేకపోయారు. కనీసం ఇప్పటికైనా హిందూసమాజం సంప్రదాయంలోని అసలు విషయాన్ని గమనించాలి. విషయాన్ని సగం సగం చెప్పి, మూఢనమ్మకమంటూ కొట్టిపారేయకుండా, అసలు విషయాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పేందుకు మీడియా కూడా ముందురావాలి.


---------------------------

ఈ విషయాన్ని ఎక్కువగా షేర్ చేసి, అందరికి తెలియపరచండి, హిందూసమాజాన్ని జాగృతం చేయండి.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles