హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. భస్మానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టడం జరిగింది.
"శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||"
పరమ పవిత్రమైన, అనారోగ్యాలను పోగొట్టే, సంపదలను చేకూర్చే, బాధలను నివారించే, అందరినీ వశంలో ఉంచుకునే విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను- అని ఈ శ్లోక భావం. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. విభూది అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూది స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశ్యంతో కూడా దీనిని ఆచరిస్తాం.