ఈ విశ్వం ఐశ్వర్య మయం. సూర్య చంద్రులు, వర్షం, ఋతువులు, భూమి, పంటలు, నదులు, పర్వతాలు, పువ్వులు, ఫలాలు, మన ఇంద్రియ శక్తులు, స్నేహితులు, కుటుంబం . . . . అన్నీ మన జీవితానికి అవసరమైన ఐశ్వర్యాలు. ఈ ఐశ్వర్య శక్తినే 'మహాలక్ష్మి' అని ఆరాధించడం మన సాంప్రదాయం.
సిరి సంపదలలో ఉన్న దివ్యత్వాన్ని లక్ష్మీ దేవతాకృతిగా దర్శించారు - మహర్షులు. జగత్కారణుడైన ఈశ్వరుని శక్తే లక్ష్మి. ఈ ఈశ్వరత్వం విశ్వా వ్యాపకమైంది. కనుక 'విష్ణువు' అని పిలుస్తారు. ఆయన శక్తి లక్ష్మి. యోగ్యుడైన వాణ్ణి విష్ణు కృప లక్ష్మీదేవిగా అనుగ్రహించి సంపన్నుణ్ణి చెస్తుంది. అతడు యోగ్యతను వదలుకుంటే, ఆ సంపద క్రమంగా హరించుకు పోతుంది. అందుకే సంపద లభించినప్పుడు మరింత అణకువగా (అహంకారం లేకుండా) సత్ప్రవర్తనతో ఆ సంపదను భగవత్ ప్రసాదంగా భావించడం ఉత్తమ స్వభావం.
మహాలక్ష్మి అనగానే కేవలం ధన రూపిణియే కాదు. శుద్ధ సత్త్వ స్వరూపిణి. శుభంకరమైన గుణాలకు సాకారం. సౌమ్యం, కారుణ్యం, శాంతం, ఉత్సాహం, ఉల్లాసం, అనసూయత, మంగళత్వం, సాత్వికత మొదలైన కళ్యాణ గుణాల సమాహార స్వరూపమే శ్రీలక్ష్మి.
ఈ తల్లికి 'పద్మా' అనే పేరుంది. వికసించె లక్షణమే పద్మం. పద్మం , అయిశ్వర్యానికీ చిహ్నం. విష్ణువు హృదయ పద్మంలో లక్ష్మీ దేవి ఉందని మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. దీని అర్థం - మహా విష్ణు సంకల్ప శక్తే లోకంలో ఐశ్వర్యంగా వ్యాపించింది - అని గ్రహించాలి.
ఆయన మనస్సంకల్పం, మనసులోని దయా, ఐశ్వర్యాల తల్లిగా అనుగ్రహిస్తున్నది . అయితే ఈ లక్ష్మీ దేవి హృదయం వద్దనే కాక, స్వామి చరణాల చెంత కూడా కొలువై, ఆయన పాద పద్మాలను సేవిస్తోంది. ఎంత చక్కని అద్భుత భావన ఇది! హృదయం లోని ఆదిలక్ష్మే, పాదాల వద్ద సేవిక. స్వామి శ్రీ జననికి ఇచ్చిన చోటు హృదయం. అది ఆయన అనురాగం. లక్ష్మీ దేవికి ఇష్టమైన చోటు స్వామి పాదపద్మం. అది ఆమె అంకిత ప్రణయం, సేవా పరాయణత్వం. దాంపత్య ధర్మానికి ఇంత చక్కని ఉదాహరణం ఇంకెక్కడ కనిపిస్తుంది?
భగవంతుడు తన హృదయంలోని దయను మనకు సంపద రూపంగా అనుగ్రహిస్తే, దాన్ని మనం భగవంతుని చరణాలకు కైంకర్య రూపంగా అర్పించాలనే భావన ఈ స్వరూపంలో గోచరిస్తుంది. నిస్స్వార్థమైన స్వధర్మ నిర్వహణను భాగావదారాధనగా సాగించడమే కైంకర్యం. మహాలక్ష్మి స్వాభావికంగా విష్ణు దేవుని ఐశ్వర్య శక్తి. ఇంద్రుడు తపశ్శక్తితో ఆరాధించి, లక్ష్మీనారాయణుల దయతో ముల్లోకాల ఐశ్వర్యాన్నీ సంపాదించాడు. కానీ క్రమంగా సంపదలవల్ల అహం పెరిగి అంతా తన ప్రయోజకత్వమనే భావనతో అవినయం అలవడి, లక్ష్మీ కతాక్షాన్ని కోల్పోయాడు. మరలా పశ్చాత్తాపంతో పాల కడలిని మధించగా అమ్మవారు ఆవిర్భవించింది. కానీ, ఆ తల్లి దేవతా సమూహాన్నంతటినీ కాదని, నారయణునె వరించింది. అంటే సంపద ఎప్పుడు వచ్చినా, అది లోకేశ్వరునిదే అనే జ్ఞానాన్ని మనకు కలిగిస్తోంది.
ముందు సంపదపై కాకుండా, సంపదకు మూల కారణుదైన భాగావానునిపై దృష్టి నిలపాలి. గజేంద్రుడు శ్రీహరి కోసం మోర పెట్టగా హరి అన్నింటినీ మరచి, వదలి, తానొక్కడే కదిలాడు. హరి కదిలిన వెంటనే హరి వెంట సిరి బయలుదేరింది. సిరి వెంట హరి కాదు - హరి వెంట సిరి. హరిణి వదలని పతివ్రత సిరి. హరిణి కొలిచిన వారిని సిరి అనుగ్రహిస్తుంది. హరిణి భక్తితో కదిలిస్తే చాలు - ఆయన వెంట బలమో, బలగమూ కదిలివచ్చి మనల్ని ఆదుకుంటాయి. ఆయన్ను మరచి, సిరినే కోరితే లాభం లేదు. లక్ష్మీ నారాయణుల అన్యోన్యత - ప్రపంచనాయకునికీ, ఆ తల్లికీ ఉన్న అవిభాజ్యాన్ని థెలియజెస్తోంది. హరి ఏ అవతారం దాల్చినా ఆయన వెంట ఉండే 'అనపాయిని' (వీడనిది) అమ్మ.
- సామవేదం షణ్ముఖ శర్మ