తెలుగు వారి పెద్ద పండుగ "సంక్రాంతి".
సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన నాటినుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ఇది 30 రోజుల పాటు కొనసాగే ప్రక్రియ. ఈ సమయములోనే వాతావరణంలో మార్పులు వచ్చి చలి మొదలౌతుంది. ఉత్తరాయణం ప్రవేశించే ఈ కాలంలో సూర్యుడు ధనూ రాశి నుంచి మకర రాశి లోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి.
మూడు రోజులు జరుపుకునే ఈ పండగతో ప్రతీ పల్లే పచ్చ చీర కట్టి ముద్దబంతి పూలతో అలంకరించిన శ్రీ మహాలక్ష్మిలా కళ కళ లాడుతూ ఉంటుంది.
ఈ పండుగను జరుపుకొనే మూడు రోజుల్లో మొదటి రోజును భోగి అని (ఇంటి కోసం )
రెండవ రోజును సంక్రాంతి అని(ఉనికికి కారణమైన పెద్దల కోసం) మూడవ రోజును కనుమ అని (పంట పండడంలో భాగస్వాములైన పశువుల కోసం) పిలుస్తారు.
ఈ చలి కాలంలో స్త్రీలు ఉదయాన్నే బ్రహ్మీముహూర్తంలో నిద్రలేచి ఆవుపేడతో వాకిలి కళ్ళాపిజల్లి రంగవల్లులు తీర్చిదిద్దుతారు. చక్కటి ముగ్గులో కళాత్మకంగా రంగులద్ది ఇంద్రధనుస్సు అందాలను ఇంటిముందుకు తెస్తారు. ముగ్గుల మధ్య ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి పసుపురంగు పూలతో అలంకరిస్తారు. ఈ ముగ్గు చుట్టూ స్త్రీలు, బాలికలు లయబద్ధంగా అడుగులు వేస్తూ గొబ్బి తట్టుతారు.
పేరుకు మూడురోజుల పండగే ఐనా ధనుర్మాసం నెలంతా పల్లె పల్లెనా తెల్లవారు ఝామున ఇంటిిముంగిట రంగవల్లులతో, పదిహేను రోజుల ముందు నుండే వంటింట్లో పిండివంటలతో పండగ వాతావరణం మొదలౌతుంది.
హేమంత ఋతువు, పుష్య మాసం.
ఈ నెలలో బలి చక్రవర్తి ఏడాదికోసారి పాతాళం నుండి భూలోక సంచారానికి వస్తాడని ప్రతీతి. పైగా పండించిన పంట ధాన్యలక్ష్మి రూపాన చేతికొచ్చే సమయం కూడా. బలిచక్రవర్తిని, ధాన్యయలక్ష్మిని స్వాగతిస్తూ నెలంతా ఇంటిి ముంగిట ముగ్గులు పెడతారు.
పంట చేతికొచ్చిన ఆనందంలో పనిచేసిన కూలీలకు పండగ సందర్భాన రెండు మూడు బుడ్ల దాన్యం ఎక్కువిస్తాడు రైతు.
పంట చేతికొచ్చి రైతూ, చేసిన పనికి ఇచ్చే కూలీకన్నా వడ్లు ఎక్కువ ఇచ్చారన్న ఆనందంలో కూలీలు, అందరూ సంతోషంగా చేసుకొనే పండుగ.
నెలంతా రోజుకొక వేషంతో పద్యాలు పాడుతూ పగటి వేషగాళ్ళూ;
నెత్తిమీద చెంబుతో, నుదుటన నిలువు నామాలతో, చేతిలో చిడతలు వాయిస్తూ 'హరిలో రంగ హరీ' అంటూ ఇంటింటికీ తిరిగే హరి దాసులూ;
'అంబ పలుకు జగదాంబ పలుకు' అంటూ ఆపకుండా అరగంట మాట్లాడే బుడబుక్కల వాళ్ళూ;
'అమ్మగారికి దణ్ణం పెట్టు, అయ్యగారికి దణ్ణం పెట్టు' అంటూ గంగిరెద్దుల వాళ్ళూ,
శంఖారావం చేస్తూ వచ్చే జంగం దేవరలూ,
వీరంతా పండుగ మూడు రోజులూ పిండివంటకమో, సంభావనో, ధాన్యమో లేక పాత వస్త్రమో ఇస్తే మహదానందంగా దీవెనలిస్తూ మరలిపోతారు .
అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
Author: sandhehalu - samadhanalu