దుర్వాసుడు పరమశివుని అంశతో పుట్టాడని ప్రతీతి. దుర్వాసుడి పుట్టుక గురించి పురాణాలలో అనేక కథలున్నాయి.
ఒకసారి బ్రహ్మకు, శివుడికి మధ్య మాటామాటా పెరిగి వాదోపవాదాలు చెలరేగి అది పెద్ద యుద్ధంగా మారింది. పరమేశ్వరుడు ప్రళయ రుద్రుడయ్యాడు. ఆయన కోపాగ్నీ జ్వాలలకు దేవతలు తాళలేకపోయారు. బ్రహ్మ పలాయనం చిత్తగించాడు. భవాని సైతం భయభ్రాంతురాలైంది. భర్త దగ్గరకు వెళ్ళి "దుర్వాసం భవతి మి" అని ప్రాధేయపడింది. 'మీతో ప్రశాంతంగా కాపురం చేయటం నానాటికీ కష్టమవుతోంది' అని ఆ మాటకు అర్థం. తన కోపం క్షణికమే అయినా దానివల్ల పార్వతి సుఖంగా వుండలేకపోతోందని గ్రహించి తనలోని కోపాన్ని ఉద్రేకాన్నీ మరొకరిలో ప్రవేశపెట్టాలని నిశ్చయించుకున్నాడు శివుడు.
ఈ సంఘటన జరిగిన రోజుల్లో శిలావతి అనే సాధ్వీమణి వుండేది. ఆమె భర్త ఉగ్రస్రావుడు దుశ్శీలుడు , కుష్ఠురోగి. వ్యాదితో బాధపడుతూ కూడా వారకాంతల ఇళ్ళకు తీసుకువెళ్ళమని భార్యను వేధిస్తుండేవాడు. ఒకరోజు శిలావతి భర్త కోరికపైన నడవలేని అతనిని నెత్తి మీద బుట్టలో కూర్చోబెట్టుకుని ఓ వారకాంత ఇంటికి తీసుకువెళ్తుండగా అనుమాండవ్య మహాముని ఎదురై అతన్ని చీదరించుకుని, "రేపు సూర్యోదయ వేళ నువ్వు తలపగిలి మరణిస్తావు" అని శపించాడు. అందుకు ప్రతిగా "రేపు అసలు సూర్యోదయమే వుండదు" అని శిలావతి పలికింది.
పతివ్రతాశిరోమణి మాటకు తిరుగులేదు కనుక మరునాడు సూర్యుడు ఉదయించలేదు.వెలుగు కోసం ప్రాణికోటి గగ్గోలుపెట్టింది. అప్పుడు త్రిమూర్తులు అత్రిమహర్షి భార్య అనసూయ దగ్గరకు వెళ్ళి శిలావతి తన శాపాన్ని ఉపసంహరించుకునేట్లు చేయమని అర్థించారు. అనసూయ కోరిక మేరకు శిలావతి తన శాపాన్ని వెనుకకు తీసుకుంది. మరుక్షణం సూర్యుడు వేన వేల కిరణాలతో వెలిగాడు. త్రిమూర్తులు సంతోషించి అనసూయను ఏదైనా వరం కోరుకోమని అడిగారు. " మీ ముగ్గురి అంశతో నాకు బిడ్డలు కలగాలి" అని కోరుకుంది ఆవిడ. సరేనన్నారు త్రిమూర్తులు. ఆ ప్రకారం బ్రహ్మ అంశతో చంద్రుడు, మహావిష్ణువు అంశతో దత్తాత్రేయుడు కలిగారు. పార్వతి భరించలేకుండా వున్న తన ఆగ్రహాన్ని శివుడు అనసూయలో ప్రవేశపెట్టాడు. ఆ అంశతో అనసూయకు కలిగినవాడే దుర్వాసుడు. కోపం నుంచి పుట్టాడు కనుక ఎప్పుడూ కోపంగా వుండును.
ఈ కథ బ్రహ్మాండపురాణంలో వుంది.
పూర్వం శ్వేతకి అనే రాజుగారుండేవారు. వందేళ్లపాటు సాగే ఒక మహా యజ్ఞాన్ని ప్రారంభించాడు ఆయన. అనేక మంది విప్రులు ఆ యజ్ఞానికి పౌరోహిత్యం వహించారు. కొన్నాళ్ళయ్యాకా వాళ్ళు హోమగుండం నుంచి వచ్చే పొగకి తట్టుకోలేక కంటిచూపు కోల్పోయి వెనక్కి వెళ్ళిపోయారు. దానితో యజ్ఞం ఆగిపోయింది. శ్వేతకి చాలా బాధపడి శివుణ్ణి గురించి తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై దుర్వాసుణ్ణి పురోహితునిగా నియమించుకోమని చెప్పాడు. ఆ తరువాత దుర్వాసుడి పర్యవేక్షణలో శ్వేతకి యజ్ఞం పూర్తిచేసాడు.
ఓ సారి దుర్వాసమహర్షి పితృలోకానికి వెళ్ళాడు. పితృనాథుడు మహర్షికి ఎదురువెళ్ళి ఘనంగా స్వాగతం చెప్పాడు. వారిద్దరూ ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుంటూ వుండగా ఎక్కడినుంచో పెద్దపెట్టున దీనారావాలు వినిపించాయి. రకరకాల గొంతులు తమను హింసించవద్దంటూ చేస్తున్న ఆక్రందనలకు కరిగిన తాపసి "ప్రభూ! నువ్వు దీనులపాలిటి పెన్నిధివని, కారుణ్యమూర్తివని విన్నాను. మరి ఇక్కడ ఈ ఆర్తనాదాలేమిటి?" అని పితృనాథుణ్ణి అడిగాడు.
"మహర్షీ! నిజానికి ఇది పవిత్ర స్థలమే. పుణ్యకార్యాలు మినహా మరేమీ జరగవు. కాని ఇక్కడకు దగ్గరలో యమపురి వుంది. దాన్ని సంయమని అని పిలుస్తారు. న్యాయ రక్షకుడు యముడు అక్కడ అనేక క్రూరమైన పద్ధతుల్లో పాపుల్ని శిక్షిస్తుంటాడు. అక్కడ ఎనభై ఆరు నరక కూపాలుంటాయి. అన్నిట్లోకీ కుంభిపాకం అతి దారుణమైనది. భగవంతుణ్ణీ, తల్లిదండ్రుల్నీ దూషించే వాళ్ళనూ, గురుపత్నిని ఆశించే వాళ్ళనూ ఈ కుంభిపాక నరకంలోకి తోసి శిక్షిస్తారు. ఇప్పుడు మీరు విన్న ఆ అరుపులు అక్కడినుంచి వచ్చినవే" అన్నాడు పితృనాథుడు.
దుర్వాసుడికి ఇదంతా విన్న తరువాత యమపురిని సందర్శించాలన్న కోరిక కలిగింది. పితృనాథుడి సేవకులు వెంటరాగా అతడు యమపురికి వెళ్ళాడు. చిత్రం- మహర్షి అడుగు పెట్టగానే భీతి, బీభత్సం స్థానే శాంతి, సంతోషం చోటు చేసుకున్నాయి. నరకం నాకంగా మారింది. అప్పటివరకూ నానాహింసలు పడ్డవాళ్ళు ఆనందనాట్యం చేయటం మొదలు పెట్టారు.
యమభటులకు ఇదంతా ఆశ్చర్యం కలిగించింది. హుటాహుటిన వెళ్ళి జరిగినదంతా తమ ప్రభువుకు విన్నవించారు. ఆశ్చర్యపోయిన యముడు వెంటనే మహిషవాహనంపై వచ్చి చూశాడు. తన లోకం అచ్చం ఇంద్రలోకంలా కనిపించింది. కారణం తెలియలేదు. ఈ వింతవార్త తెలిసి ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, అష్టదిక్పాలకులు కుంభిపాకనరకానికి వచ్చి చూశారు. వాళ్ళకీ ఏమీ బోధపడలేదు. చివరికి శ్రీమహావిష్ణువు కొందరు దేవతలను వెంటపెట్టుకుని కైలాసానికి వెళ్ళి , దుర్వాసుని రాకతో నరకం స్వర్గంగా మార్పు చెందటం గురించి శివుడికి సవివరంగా విన్నవించాడు.
ఫాలాక్షడు నవ్వుతూ "ఇదంతా దుర్వాసుడి ప్రభావం. కుంభిపాకనరకంలోకి అడుగు పెట్టగానే ఆ తాపసి ఒంటిమీద విభూతి రాలి కిందపడి వుంటుంది. ఆయన మెడలోని పవిత్ర రుద్రాక్షల గాలి నరకమంతా వ్యాపించి వుంటుంది. అందుకే కుంభిపాకం స్వర్గంలా భాసిస్తుంది. ఇకమీదట ఆ ప్రాంతం 'పితృతీర్థం' అని పిలవబడుతుంది. అక్కడవున్న తటాకంలో స్నానమాచరించిన వారికి పుణ్యగతులు కలుగుతాయి. అక్కడ నా విగ్రహాన్ని , శివలింగాన్ని, పక్కనే ఉమాదేవి విగ్రహాన్నీ ప్రతిష్ఠించండి" అని సెలవిచ్చాడు పరమేశ్వరుడు. మహావిష్ణువు సంతోషించి ఆయన చెప్పినట్లే చేసాడు.