దేవుడు పూజారిని కాపాడాడా.. నిజమా ఎక్కడ..??
.. అవును నిజం..అంతేకాదు ఆ దేవుడికి ఆడవాళ్ళకి ఉన్నట్టు పెద్ద కొప్పు అదే ముడి ఉంటుంది తలమీద..
ఆ మాకు తెలుసు భగీరధుడు గంగ కోసం తపస్సు చేసి భూమిమీదకు రప్పించినప్పుడు గంగ వేగాన్ని తగ్గించడానికి శివుడు తన జటాజూటం లో గంగ ని బంధించాడు కదా అదే అయ్యుంటుంది అంతేనా..కాదు..బంధించి నెమ్మదిగా వదిలిన ఆ విషయం కాదు.. ఇక్కడ తనతలమీద ఉన్న’కొప్పు’ తోనే పూజలందుకొంటున్న శివుడు ఉన్నాడు
ఇదిగో మొత్తం విషయం…
పూర్వం ఒక శివుడి గుడి లో ఉండే పూజారి దేవుడికోసం తెచ్చే పువ్వులదండలన్నీ తన ప్రియురాలికిచ్చి తర్వాత శివలింగానికి అలంకరించేవాడు రోజూ ఇంతే .అలా రోజులు గడుస్తుంటే ఒకసారి ఆదేశ రాజుగారు గుడికి వచ్చి స్వామి “మాల “ని ప్రసాదం గా ఇమ్మని అడిగేసరికి పూజారి స్వామి లింగం మీద ఉన్న ఒక దండ తీసి ఇచ్చాడు.. రాజుగారికి ఆ దండలో పొడుగ్గా ఉన్న తలవెంట్రుకలు కనిపించాయి..వెంటనే రాజుగారికి కోపం వచ్చి ఇదేవిటయ్యా స్వామి దండలో ఇంత పెద్ద తలవెంట్రుక ఉంది అని అడిగేసరికి.. పూజారికి తను చేసిన పని గుర్తొచ్చి భయం వేసి కంగారులో ఒక అబద్ధాన్ని కల్పించి ఇలా చెప్పాడు రాజుగారూ శివుడికి చాలా పొడుగుజుట్టు ఉంది రోజూ దువ్వి ముడి వేస్తాము అని అన్నాడు..
రాజుగారు అవునా !!అయితే ఏదీ నాకు చూపించు, అని అనేసరికి పూజారికి పైప్రాణాలు పైకే పోయాయి అయినా సర్దుకుని అబ్బెబ్బే ఇవాళ దండలతో ఉండి మీకు కనిపించదు.. రేపు పొద్దున్నే రండి చూపిస్తా అని తప్పించుకున్నాడు.. కానీ లోపల భయం.. తను చేసిన తప్పు గుర్తొచ్చి స్వామీ ఎంతతప్పు చేసాను అందుకే ఒక అబద్ధం చెప్తే అలా అబద్ధాలు చెప్తూనే ఉండాలి.. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు నాకు శిక్ష పడాల్సిందేనని బాధపడుతూ ఆ రాత్రంతా శివలింగం దగ్గరే ఉండిపోయాడు
.. తెల్లవారేసరికి రాజుగారు వచ్చారు.. భయపడుతూనే శివలింగం పైదాకా ఉన్న పూలదండలన్నీ తీసేసరికి ఒక్కసారే ఆశ్చర్యపోయాడు పూజారి.. అక్కడ నిజం గానే “పెద్ద కొప్పు” ఉంది.. రాజుగారు చూసి అయ్యో స్వామీ నిన్ను అనుమానించానే నన్ను క్షమించు అని బాధపడ్డాడు
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని గ్రహించిన పూజారిని భక్తసులభుడైన శివుడు తనతలమీద తనే ఒక కొప్పు ని సృష్టించుకుని కాపాడాడు విషాన్ని గొంతులో దాచుకున్న శివుడికి ఇది ఒక లెక్కా…
ఇంతటి స్థల చరిత్ర ఉన్న గుడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొత్తపేటకి మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న “పలివెల” అనే గ్రామం లో ఉంది.ఈ ఆలయం పేరు “ఉమాకొప్పులింగేశ్వరస్వామి” ఆలయం..ఈ గుడిలో ఉన్న శివలింగాన్నీ అగస్థ్య మహర్షి ప్రతిస్టించినట్టు స్థలపురాణం చెప్తోంది
రాజమండ్రికి 50 “కి.మీ,కాకినాడకి “90 కి.మీ”,అమలాపురానికి 25 “కి.మీ” దూరం ఈ పలివెల గ్రామం
Author: sandhehalu - samadhanalu