ఆ కళ్యాణమంటపంలో నాదస్వరం మేళతాళాలు సుస్వరంగా వినిపిస్తున్నాయి. చిన్నపిల్లలు అటూ ఇటూ పరిగెడుతూ, ఆడుకుంటూ పెళ్ళి వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తున్నారు. మంటపంలో అందరూ తమతమ పనుల్లో నిమగ్నులై ఉన్నారు.
పెళ్ళికుమారుడు కాశీయాత్రకు బయలుదేరి బావమరిది కోరిక మేరకు తన చెల్లిని పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించి తిరిగివచ్చాడు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఊయలలో కూర్చుని ఊగుతున్నారు. సువాసినులు రంగురంగుల అన్నపు ముద్దలను వారి భుజాలమీదుగా వేస్తున్నారు. తరువాత ఇద్దరూ ఒకరిచేతులొకరు పట్టుకుని కళ్యాణవేదికను ఎక్కి కూర్చున్నారు.
హఠాత్తుగా ఇంతటి ఆనందం ఆవర్ణమై మంటపంలోని సంతోషమయ దృశ్యాలు ఆగిపోయాయి. ఏం జరిగింది? అక్కడ కూర్చున్న పెళ్ళికుమార్తె హఠాత్తుగా కళ్ళుతిరిగి కుప్పకూలిపోయింది. వెంటనే ఆ అమ్మాయికి మూర్ఛ వచ్చింది. కాళ్ళు చేతులు కొట్టుకోవడం ప్రారంభించింది. నోటి నుండి నురగ రావడం మొదలైంది.
అమ్మాయి తల్లితండ్రులు భయపడుతున్నారు. ఏం చెయ్యాలో పాలుపోక ఇరుకుటుంబాల వారు ఆందోళన చందుతున్నారు. బంధువులొకరు వైద్యునికి కబురుచేసి ప్రథమ చికిత్సకోసం అమ్మాయిని పక్కకు మోసుకెళ్ళారు.
తరువాత ఏం జరుగుతుంది? వివాహం జరుగుతుందా? అందరిలోనూ ఇదే ప్రశ్న. భగవంతుడా! ఎంతటి విషమ పరీక్ష. అలా మూర్ఛ రావడం ఆ అమ్మాయికి ఇదే మొదటిసారి. మరి ఆ అమ్మాయి భవిష్యత్తేంటి?
ఇరుకుటుంబాల వారు పరమాచార్య స్వామివారి భక్తులు. లగ్నపత్రిక ముద్రించడానికి ముందే స్వామివారి అనుగ్రహం అనుమతి పొందారు. మరి ఇప్పుడు ఎందుకిలా జరిగింది?
వివాహ క్రతువు నిర్వహిస్తున్న పురోహితుడు తేరుకుని ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా వల్ల అందరికి కొంత ఉపశమనం లభించింది.
”చూడండి ఎవరూ ఖంగారు పడాల్సిన అవసరం లేదు. ముహూర్తానికి ఇంకా చాలా సమయం ఉంది. మనందరకు పరమాచార్యులవారే రక్షకులు. ఎవరైనా ఇక్కడ జరిగినదంతా స్వామివారికి విన్నవించి వారి సలహా తీసుకోండి. వారి ఆజ్ఞప్రకారం నడుచుకుందాం” వెంటనే ఆయన చెప్పినట్లు చేశారు. విషయమంతా మేనేజరుకు చెప్పగా వారు స్వామికి విశదపరిచారు.
స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత మేనేజరుతో, “ఆ అమ్మాయి కులదైవం మహామాయి అమ్మవారు. ఆ అమ్మవారిని ప్రార్థించి అమ్మాయి తలకు కొన్ని వేప రెమ్మలు ధరింపజేయమని చెప్పు. వెంటనే స్వస్థత చేకూరుతుంది.” అని చెప్పారు.
మేనేజరు ఈ విషయాన్ని ఫోన్లో ఆ అమ్మాయి తల్లితండ్రులకు చెప్పగా పెళ్ళికూతురు తల్లి వారి కులదైవం అయిన మహామాయిని ప్రార్థించి కొన్ని వేపరెమ్మలను అమ్మాయి తలకు గుచ్చింది. ఆశ్చర్యకరంగా వెంటనే ఆ అమ్మాయికి స్పృహ వచ్చి లేచి కూర్చుంది.
అబ్బాయి తరుపు వారు కూడా పరమాచార్యస్వామి వారికి భక్తులగుటవలన ఎటువంటి ఆక్షేపణ చెప్పలేదు. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల సరైన ముహూర్తానికే చక్కగా వివాహం జరిగింది. మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని రెండు కుటుంబాలవారు కంచి ప్రయాణమయ్యారు.
”పెరియవ అనుగ్రహం వల్ల పెళ్ళి సాఫీగా జరిగిపోయింది” అని అన్నారు ఇరు కుటుంబాల పెద్దలు వినయంతో.
అందుకు స్వామివారు “మహామాయి అమ్మవారి అనుగ్రహం వల్ల చక్కగా జరిగింది” అని చిన్నగా నవ్వారు.
అమ్మాయి తండ్రి స్వామివారితో, “పెరియవ మా అమ్మాయికి ఇలా ఎప్పుడూ మూర్ఛ రాలేదు. . .” అని అన్నాడు.
”ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు” అని పరమాచార్య స్వామివారు చెప్పి, అమ్మాయి చక్కగా ఉంటుంది అని చెయ్యెత్తి ఆశీర్వదించారు.
అంతకంటే కావల్సినది ఏముంది?