వినాయకుడు కళ్ళు తెరిచా(డు)డా? (పార్ట్ 2)
ఆ శిల్పి కూడా నమ్మకంగా చెప్తున్నాడు. “లేదు సామి! వినాయకుని కళ్ళు ఇంకా తెరవలేదు. విగ్రం మలచినవారే కళ్ళు తెరవాలని ఏం లేదు. కాని నేను ఖచ్చితంగా చెప్పగలను అది ఇంకా జరగలేదు” అని ఆ శిల్పి స్వామివారికి మూడు సార్లు సాష్టాంగం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
“వినాయకుని కళ్ళు తెరవబడ్డాయి. ఆయన సంతోషంగా మనల్ని చూస్తున్నాడు. ఇంకా ఆలస్యం చెయ్యడం మంచిది కాదు. త్వరగా మంచి ముహూర్తంలో కుంబాభిషేకం చెయ్యండి. అంతా మంచి జరుగుతుంది” అని స్వామివారు అక్కడినుండి బయలుదేరారు. పీఠపరివారం కూడా బయలుదేరింది. ఊరిప్రజలంతా పొలిమేరదాకా వచ్చి స్వామివారికి వీడ్కోలు పలికారు.
వెంటనే అందరూ కలిసి పంచాయితి వద్ద సమావేశం అయ్యారు. స్వామివారి మాటల గురించి చర్చించుకోసాగారు. కొద్దిగా పెద్దవాడైన ఆ శిల్పి ఇలా చెప్పాడు.
”స్వామివారికి ఉన్న దూరదృష్టి వల్ల ఏమి జరిగిందో వారికి ఖచ్చితంగా తెలుసు. కాని నేను మాత్రం ఆ కళ్ళను తెరవలేదు. మరి స్వామివారు ఎందుకు అలా చెప్పారో అర్థం కావడం లేదు. నేను విగ్రహం దగగ్రికి వెళ్ళి పరిశీలించాను. అలా జరిగినట్లుగా నాకు కనబడడం లేదు. ఇప్పుడేం చెయ్యాలి?”
అంతా నిశ్శబ్ధం. ఎవరూ ఏమి మాట్లాడడం లేదు. హఠాత్తుగా ఒక పన్నెండేండ్ల బాలుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. చేతులు కట్టుకుని అక్కడ నిలబడ్డాడు.
ఆ గ్రామపెద్ద ప్రేమతో “ఎందుకు అలా పరిగెత్తుకు వచ్చావు? ఏమిటి సంగతి?” అని అడిగాడు.
ఆ పిల్లవాడు ఆయనతో, “అయ్యా! ఆ దేవాలయ వినాయక విగ్రహం గురించి నాకు ఒక విషయం తెలుసు. ఇక్కడ చెప్పవచ్చా?” అని అడిగాడు.
గ్రామపెద్ద ఆసక్తిగా, ”నీకు ఏమి తెలుసు? చెప్పు బాబు” అన్నాడు. అందరూ ఆ పిల్లడీ వంకే చూస్తున్నారు.
”అయ్యా! నేను ఈ విగ్రహం గురించి చెప్తున్నది నిజం. ఆ స్వామివారు చెప్పినట్టుగానే వినాయకుని కళ్ళు తెరవటం నిజం. అది ఎలా అంటారేమో – అది పదిరోజులక్రితం ఒక మధ్యాహ్నం అప్పుడు. విగ్రహం చెక్కిన ఈ తాతగారి మనవడు నేను స్నేహితులం. వాడు ఏం చేసాడో తెలుసా? వినాయకుని కళ్ళు తెరవడానికని పెట్టిన ఉలి, సుత్తి తీసుకుని గుడికి వచ్చాడు.
“హే! ఇటుచూడండి మా తాతయ్య ఇలాగే విగ్రహాల కళ్ళు తెరుస్తాడు” అంటూ వినాయకుని కళ్ళు తెరుస్తున్నాడు. మేమందరమూ అప్పుడు “ఓ వినాయకా కళ్ళు తెరువు ఓ వినాయకా కళ్ళు తెరువు” అంటూ పాడుకుంటున్నాము. అంతా ముగించిన తరువాత “వినాకుడు కళ్ళు తెరిచాడు” అని మేమంతా చిందులు వేశాము. ఈ విషయం ఊళ్ళో ఇంకెవరికి తెలియదు. మేము కూడా ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. ఇదే జరిగింది మమ్మల్ని క్షమించండి” అని చెప్పాడు.
అక్కడ కూర్చున్న వారందరూ ఆశర్యపోయారు. గ్రామపెద్ద కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మహాస్వామి వారి గొప్పదనం తలచుకుని ఊరంతా పరవశించిపోయారు. ఆ శిల్పి మనవడి వయస్సు ఎనిమిదేళ్ళు. అతణ్ణి పిలుచుకుని వచ్చి విచారించారు. అతను వినాయకుని కళ్ళు తెరిచినట్టు ఒప్పుకున్నాడు. వెంటనే అందరూ దేవాలయానికి పరిగెత్తి వినాయకుడికి సాష్టంగం చేశారు. స్థపతి దుర్భిణి(భూతద్దం) సహాయంతో కళ్ళను పరిశీలించాడు.
నేత్రోన్మీలం జరిగిన విధానం విని అందరూ పులకించిపోయారు. పరమాచార్య స్వామివారు వెళ్ళిన వైపుకు మొత్తం ఊరంతా పరిగెత్తారు. మరొక గ్రామ సరిహద్దులో స్వామివారు పెద్ద మర్రిచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు.
అందరూ పరిగెత్తుకుని వెళ్ళి స్వామివారి పాదాలపై పడ్డారు. గ్రామపెద్ద, శిల్పి ఏడ్వడం మొదలుపెట్టారు.
ఆ పరబ్రహ్మం వీరివంక చూసి నవ్వుతూ, “ఇప్పుడు విచారణ చేసి నిర్ధారించుకున్నారా వినాయకుని కళ్ళు తెరవబడ్డాయని. వెళ్ళండి! వెళ్ళి త్వరగా కుంబాభిషేకం జరపండి. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంతుంది” అని అన్నారు.
ఆ నడయాడే దేవుడు చెయ్యెత్తి వీరినందరిని ఆశీర్వదించాడు.
#KanchiParamacharyaVaibhavam - #కంచిపరమాచార్యవైభవం