వినాయకుడు కళ్ళు తెరిచా(డు)డా? (పార్ట్ 1)
చాలా ఏళ్లక్రితం కంచి పరమాచార్య స్వామివారు దక్షిణ తమిళనాడు యాత్రచేస్తున్నారు. తంజావూరు, తిరుచిరాపల్లి, తిరువనైక్కావల్, శ్రీరంగం, దిండిగల్, చోలవండన్ చూసుకుని మధురై వైపుగా ప్రయాణం చేస్తున్నారు.
దారిలో దగ్గర్లోని గ్రామప్రజలు పిల్లాపాపలతో సహా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామివారు వారినందరిని చిరునవ్వుతో ఆశీర్వదించి, పళ్ళు కలకండ ప్రసాదంగా ఇచ్చి ముందుకు సాగిపోయారు.
ఇంకొద్దిసేపట్లో పుణ్యక్షేత్రమైన మధురై చేరుకుంటారు. దార్లోని ఒక గ్రామం వారు మహాస్వామిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారి భక్తికి ఉత్సహానికి స్వామివారు చాలా ఆనందపడ్డారు. రోడ్డుపక్కన ఉన్న ఒక మర్రిచెట్టు వేర్ల పైన కూర్చున్నారు. ఆ గ్రామ ప్రజలందరూ స్వామివారికి సాష్టాంగం చేశారు.
ఆ ఊరి పంచాయితి పెద్ద స్వామికి సభక్తికంగా సాష్టాంగం చేసి స్వామివారితో, “మేము పెరియవను ఒకటి కోరుకుంటున్నాము. పేదవారమైన మేమందరమూ కలిసి ఇక్కడికి దగ్గర్లో ఒక వినాయకుని దేవాలయం కట్టుకున్నాము. మామీద దయౌంచి స్వామివారు దేవాలయంలోకి విచ్చేసి మమ్ములని అనుగ్రహించవలసిందిగా మేమందరమూ ప్రార్థిస్తున్నము” అని వేడుకున్నాడు.
పరమాచార్య స్వామివారు ఉత్సాహంగా లేచి “ఎక్కడుంది దేవాలయం?” అని అడిగారు. ఆ గ్రామపెద్ద “ఇక్కడే కూతవేటు దూరంలో. వచ్చి మీరు అనిగ్రహించాలి” అని చెప్పాడు.
స్వామివారు వడివడిగా నడిచి ఆలయం చేరుకున్నారు. మంగళవాద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతంతో స్వామివారు ఆలయం లోపలికి వచ్చారు. గర్భగుడిలో ఆరడుగుల వినాయకుడు నిండుగా కూర్చుని ఉన్నాడు. స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. మహాస్వామివారు కన్నార్పకుండా కొద్దిసేపు ఆ విగ్రహం వంక చూస్తూ, కుంబాభిషేకం పూర్తయ్యిందా అని పంచాయితి పెద్దని అడిగాడు.
అతను “ఇంకా కాలేదు సామీ” అని బదులిచ్చాడు.
”అంతా జరిగింది కదా! మరి కుంబాభిషేకం ఎందుకు జరపలేదు?” అని అడిగారు. ఆ గ్రామపెద్ద వినయంతో, “అంతా పూర్తయ్యింది స్వామి. మరొక నెలలో మహాత్మాగాంధీ గారు ఈ వైపుగా వస్తున్నారు. వారు వచ్చిన రోజునే వారి సమక్షంలో కుంబాభిషేకం జరపడానికి మధురైలోని కొంతమంది పెద్దలు అంగీకరించారు. అదే సామి కారణం; గాంధీగారి కోసం వేచియున్నాము” అని చెప్పాడు.
స్వామివారు తనలో తానే నవ్వుకుని రెండు నిముషాలపాటు విగ్రహంవంక తదేకంగా చూసి వారితో, “నాకు తెలిసి ఆ అవసరం లేదు. ఇప్పటికే వినాయకుడు బాగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఇంక మీరు కుంబాభిషేకం ఆలస్యం చెయ్యవలదు. మంచి రోజు చూసి వెంటనే చెయ్యండి” అని సెలవిచ్చారు.
”లేదు సామి! వినాయకుడికి కళ్ళు తెరిచే ఘట్టం (నేత్ర ఉన్మీలనం) ఇంకా జరగలేదు. మీరు ఇలా ఆజ్ఞాపించడం మాకి ఏమి అర్థం కావడం లేదు” అని అయోమయంగా చెప్పాడు.
స్వామివారు మరలా నవ్వి, “ఇది నాకోసం చెప్పడం లేదు. వినాయకుడు కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నాడు. తొందరగా కుంబాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యండి. గాంధీగారు వచ్చినప్పుడు మంచిగా దర్శనం చేసుకుంటారు”
పంచాయితీ పెద్దకి ఏమి చెయ్యలో పాలుపోవటం లేదు. వినాయకుని విగ్రహాన్ని చెక్కిన స్థపతికి (శిల్పి) కబురు చేశారు. అతను రాగానే స్వామివారు చెప్పినదంతా విన్నవించారు.
(సశేషం)
#KanchiParamacharyaVaibhavam - #కంచిపరమాచార్యవైభవం