పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం
స్యను పరిష్కారించేది అద్వైతం ఒక్కటే. అది ఎలాగని అడగవచ్చు. నాకే గదా సమస్య అంటున్నావు. ఆ నేను ఎవరు. అది ఈ శరీరం కాదు. మనస్సు కాదు. ప్రాణం కాదు. ఏదీ కాదు. కేవలం నేనున్నాననే స్పురణే నేను. స్పురణ అనేది జ్ఞానం. ఉండటం దాని అస్తిత్వం. రెండూ నిరాకారం నిర్వికల్పం గనుక ఆకాశం లాగ సర్వవ్యాపకం. శరీరమూ మనః ప్రాణాలు మొదలుకొని బాహ్యమైన చరా చర పదార్దాల వరకు సర్వత్రా అస్తిత్వమూ దాని స్పురణే చూస్తున్నాము మనం. ప్రతి ఒక్కటి ఉన్నది ఉన్నదనే చూస్తామే కాని లేదని చూడము. ఒకవేళ లేకున్నా లేమిని కూడ ఉన్నదనే చూస్తాము. అలాగే ప్రతిదీ నాకు స్పురిస్తున్నదనే దర్శిస్తాను. ఈ సత్తా స్పూర్తులు తప్ప ఎక్కడ మరేది నీకు కనిపించదు. అది నీ శరీరం కాని. ఈ ప్రపంచం కాని. ఆ ఈశ్వరుడు కాని ఏదైనా కావచ్చు. ఉన్నదనే స్పురణ తప్ప మరేముందక్కడ.
అయినా ఆ ఆకారాలూ ఆ చేష్టలూ వాటి తాలూకు ఆలోచనలు కూడ గోచరిస్తూ ఉన్నాయి కదా. అంటే అదికూడా ఉండటమూ ఊన్నట్టు స్పురించటమే. అవి రెండు వాటి నుంచి తొలగిస్తే అక్కడ ఏదీ నిలవదు. ఉండకుండా ఏలా ఉంటుంది. స్పురించకుండా ఏలా కనిపిస్తూంది. అయినా ఉన్నట్టు కనిపిస్తున్నది అది ఏమిటని నీకు సందేహం. ఏదో కాదది ఈ ఉండటమనే స్పురణే. అన్యంగా ఏదో ఉన్నట్టు స్పురిస్తున్నట్టు నీకు భాసిస్తున్నది. దీనికే ఆభాస అని పేరు. ఆభాస వాస్తవం కాదు గనుక భయం లేదు. ఎండలో నడిచి పోతుంటే మన నీడ మనకు కనిపిస్తున్నది. అది మనకు మన శరీరమే మరో రూపంలో కనిపిస్తున్నది. మనకు అన్యంగా లేదు.కనుక దాని వల్ల సమస్య లేదు.
అలాగే నేననే స్పురణే నా ఉనికే. నాలో మాత్రమే గాక సర్వత్రా అంటే నీవు జీవ జగదీశ్వరులుగా భావించే వాటన్నిటిలో నీవెప్పుడు చూస్తున్నావో అప్పుడది ఇక ద్వైతం కాదు. అద్వైతమే. ఇలాంటి అద్వైత దృష్టికి ఇక సమస్య ఏముంది. దృశ్యంగా కనపడేదంతా దృష్టి విలాసమే. దాని ఆభాసే. దాని విభూతే. అంటే దృగ్రూపుడనైన నేనే దృశ్యమైన జీవ జగదీశ్వరులుగా స్పురిస్తూంటాము. కనుక జీవితమైనా నా స్పురణే, మరణమైనా నా స్పురణే. నేనే సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడిక నాకు మరణమే లేదు. మరణమే కదా సమస్య. సమస్య ద్వైతం వల్లనైతే దానికి అద్వైతమే పరిష్కారం. ఇదే అద్వైత విజ్ఞానంలోని విశిష్టత. సూత్రప్రాయంగా తెలియ చేసిన ఈ సత్యమే బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారి ప్రవచనములు, రచనల ద్వారా విపులంగా తేలుసుకోవచ్చు.