Friday 16 December 2016

అయ్యప్ప జన్మ రహాస్యమ్

నమస్కారం,


 నేను అయ్యప్ప స్వామి గురించి పూర్వం తెచ్చిన ప్రస్తావనకి అనుభంధముగా పూర్వము చెప్పిన విధంగా అయ్యప్ప స్వామి గురించి కొన్ని పరిశీలనగా చూసిన కొన్ని ప్రశ్నాత్మక సందేహాలను మీ ముందు ఉంచుతున్నాను.. 



ఇది వివాదాస్పదంగా కాకుండా కేవలం సత్యము గూర్చి పరిశీలనాత్మకంగానే చూసి, సందేహాలకు స్పందించవలసిందిగా మనవి . 


1) అయ్యప్ప స్వామి జననంకి ముఖ్య కారణం నుంచి మొదలు పెడదాము,
అయప్ప స్వామి జననానికి ముఖ్య కారణం మహిషి అనే రాక్షసి సంహారం కోసమని హరి హరులకు పుట్టిన సంతానం వలన మాత్రమే మరణం సంభవముగా బ్రహ్మ వరము పొందినది అని అన్నారు.
ఆ మహిషి ఎవరు అనేది కూడా చెప్పారు, మహిషాసురుడు అనే రాక్షసుడుకి చెల్లెలు అని, మహిషాసురుడు మరణానికి దేవతల పైన పగ తీర్చుకోవడం కోసమని తపస్సు చేసి వరము పొందినది అని అంటారు.. అసలు ఇక్కడ ఒక విషయం గమనించాలి అందరూ... మహిషాసురుడుని పార్వతీ దేవి కృత యుగములో సంహరించినది... ఆ మహిషాసురుడు కి చెల్లెలు అయిన మహిషి కూడా కృత యుగం నాటిదే, మరి ఆ మహిషిని సంహరించడానికి అయ్యప్ప కృత యుగములో కోట్ల యేళ్ళు ఆగి, త్రేతా యుగంలో కోట్ల సంవత్సరాలు ఆగి, ద్వాపర యుగంలో లక్షల సంవత్సరాలు ఆగి, కలియుగంలో 3వేల సంవత్సరాలు పైగానే ఆగి ఎందుకు అవతరించి మహిషిని సంహరించాడు?

2) కొంత మంది మహిషి ఆ యుగం నుంచే తపస్సు చేస్తూనే ఉంది అంటారు, అది సాధ్యము కానిది, ఎవరు అయినా తపస్సు ఉచ్చ స్థాయికి చేరుకునప్పుడు దేవతలు తప్పక ప్రత్యక్షం అవుతారు, లేకుంటే  వారి తపస్సు తీవ్రత వలన లోకాలు కంపిస్తాయి, అది జరుగక ముందే దేవతలు వచ్చి వరం ప్రసాదిస్తారు,. అంటే కృత యుగం నాటికే మహిషి వారం పొంది ఉండాలి & అప్పటి నుంచే ఇంద్ర పదవి ఆక్రమించి ఉండాలి... మరి ఎక్కడ? ఏ పురాణ వాగ్మయంలో కానీ సంభంధిత గ్రంధాలలో కానీ మహిషి ఇంద్ర పదవి ఆక్రమించిన ప్రస్తావన ఎందుకు ఎక్కడా లేదు? అంత ఇంద్ర పదవి ఆక్రమిస్తే మరి ఎందుకు ఎందులోనూ ప్రస్తావించలేదు?

3) అసలు మహిషి గురించే ఎక్కడా ఎందుకు లేదు? మహిషి అనే రాక్షసి గురించి కానీ తపస్సు గురించి కానీ వరం గురించి కానీ లేక ఇతర ఏ ఒక్క విషయం అయినా కానీ ఎందుకు ఏ పురాణ గ్రంధంలో ప్రస్తావించలేదు?

4) ఇప్పుడు అయ్యప్ప స్వామి గురించి చూస్తే, అంతటి హరి హర పుత్రుడు అయిన అయ్యప్ప స్వామి జననం గురించి కానీ లేక జీవితం గురించి కానీ ఎందుకు ఎక్కడా ఏ పురానా ఇతిహాసాదులలో ప్రస్తావించలేదు?  కొంత మంది అసలు చదవకా స్కాంద పురాణంలో ఉంది అంటారు, కొంత మంది వరాహ పురాణంలో ఉంది అంటారు.. నేను రెండిటిలోనూ చూశాను.. ఎక్కడా లేదు... చాలా మంది దేవతల గురించి యక్ష కిన్నెర కింపురుషాదుల గురించి చెప్పిన పురాణాలు అంతటి హరి హర పుత్రుడు ఆయప్ప స్వామి గురించి ఎందుకు చెప్పలేక పోయాయి?

5) కొంత మంది అయ్యప్ప స్వామి కలియుగం వాడు అందుకనే ద్వాపర యుగములో వాడైన వేద వ్యాసుడు అయప్ప గురించి పురాణ ప్రస్తావన చేయలేకపోయాడు అనే అవకాశం ఎంత మాత్రం లేదు, ఎందుకంటే కలియుగంలో జరిగే అనేక విషయముల గురించి వ్యాసుల వారు భవిష్యత్ పురాణంలో చెప్పి ఉన్నారు,. మరి అందులో అయినా అంతటి హరి హరులకు పుట్టిన అయప్ప స్వామి గురించి ఎందుకు చెప్పలేదు? పోనీ వ్యాసుల వారు చిరంజీవియే కదా, ఆది శంకరాచార్యుల వారికి దర్శనం ఇచ్చి బ్రహ్మ సూత్ర భాష్యం గూర్చి చర్చించిన ఆయన మరి అయప్ప గురించి ఎందుకు రాయలేకపోయారు ఎందుకు రాయించలేకపోయారు?

6) అసలు అయ్యప్ప స్వామి మోహినీ పుత్రుడు ఎప్పుడు అయ్యాడు? మహా విష్ణువు మోహినీ రూపము కేవలం రెండు సార్లే తీసుకున్నాడు, మొదటిది భస్మాసుర సంహారం, రెండవది క్షీర సాగర మధనం అను రెండు సంధార్భాలలో మాత్రమే తీసుకున్నాడు, అప్పుడు ఎక్కడా శివుడు మోహినిని చూసి మోహించడము కానీ అయప్ప పుట్టుక గురించి కానీ ఎక్కడా లేదే? మరి మోహినీ పుత్రుడు ఎలా అయ్యాడు?

7) అయప్ప స్వామి విగ్రహం పరశురామ ప్రతిష్టితం అన్నారు, అది కూడా సాధ్యము కానిదే, పరశురాముడు కేవలం శివ భక్తుడు, ఆయన శివుడునే పూజిస్తాడు, అంతటి పరశురాముడు ప్రతిష్ట చేస్తే కేవలం శివలింగ ప్రతిష్ట మాత్రమే చేస్తాడు, అందుకే మనము చాలా చోట్ల పరశురామ ప్రతిష్టిత శివలింగము చూస్తాము.. ఇకపోతే శివలింగ ప్రతిష్ట ఎందుకు అంటే, ఒక మనిషిని హతమార్చిన పాపం శివలింగ ప్రతిష్ట ద్వారా పోతుంది, అందుకనే పూర్వం రాజులు అనేక గుడులలో అనేక శివ లింగ ప్రతిష్టలు చేసే వారు.. పరశురాముడు అధర్మముతో ఉన్న క్షత్రియులను సంహరించడం చేత, మనిషిని చంపిన పాపం పోవడానికి శివ లింగ ప్రతిష్టలు చేశాడు,. ఆయన వేరొక దేవుడుని అసలు కొలువరు వేరొక దేవుడు విగ్రహ ప్రతిష్ట చేయరు.. అలా ఆయన అయప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట చేసినట్టుగా కూడా ఎటువంటి ప్రామాణికం లేదు..

8) అయప్ప స్వామి దీక్ష గురించి చూస్తే శనైశ్చరుడుకి వరము ఇచ్చి ఇటువంటి నియమములు పెట్టినట్టు ఉన్నది,. అది కూడా ఎక్కడా ప్రామాణికత లేదు, పైపెచ్చు.. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే.. శనైశ్చరుడు ఆయన ధర్మము ప్రకారము జాతక చక్రములో తాను ఉన్న కాలములో కొన్ని సార్లు చెడు ప్రభావము చూపిస్తాడు కొన్ని సార్లు మంచి చేస్తాడు,. అది ఆయన ధర్మం.. అది కూడా మన మంచి కొరకే ఆయన అలా నిర్వర్తిస్తాడు... కేవలం ఆయన జాతక చక్రంలో ఎవరికి అయితే ఆ కాలములో ఉంటాడో వారి మీద మాత్రమే శని ప్రభావము ఉంటుంది,. మరి అలాంటప్పుడు ఆ జాతక పరిస్తితి  లేని మిగతా అందరినీ కూడా అలానే శని ప్రభావము నుంచి తప్పించే విషంగా బట్టలు కట్టుకోవడం నుంచి ప్రతి నియమం పాటించమని ఎందుకు చెప్పాడు అయ్యప్ప? జాతకము గూర్చి అయప్ప స్వామికి తెలియదా? అసలు పైనవి చూస్తే అయ్యప్ప స్వామి అవతరించడమే ప్రశ్నార్ధకంగా ఉన్నది.

9) నవవిధ భక్తి రీతులలో చిట్ట చివరిది “శరణాగతి” అంటే శరణు వేడడం.. ముందు రీతులు ఏవి కానప్పుడు చిట్ట చివరిది అయిన శరణాగతిని ఆశ్రయిస్తారు.. అసలు అయప్ప స్వామిని భక్తులు ఊరక ముందే శరణం శరణం అని ఎలా అనేస్తున్నారు? ఆ “ శరణం “ అనే పదానికి ఎంత అర్ధం ఉన్నది? ఎప్పుడు పడితే అప్పుడు భగవంతుడుని శరణు వేడుతారా? శరణాగతికి అసలు అర్ధమే మార్చేస్తున్నారే? అసలు ఎందుకు శరణు వెడుతున్నారు పదే పదే? వారి జీవితము మరియు అన్నీ వారి చేతుల్లో ఇక ఏమి లేక దిక్కు తోచక చేసే శరణాగతి స్థితిలో వారు ఎవరైనా ఉన్నారా అసలు?? వేరే ఏ దేవుడుకి ముందుగానే శరణాగతి చేయవలసిందే అనే నియమం వేరే ఏ దేవుడుకి లేనిది ఎందుకు అయ్యప్పకే ఉన్నది? అయప్ప శరణాగతి చేస్తే కానీ పలకడా? అదొక్కటే మార్గమా అయ్యప్ప విషయంలో? అసలు వారి ఉద్ధేశంలో అలా పదే పదే పలికే శరణాగతికి వివరం ఏమిటి?

10) అయ్యప్ప స్వామి పూజ గురించి చూస్తే,. అసలు ఉపనయన సంస్కారము జరగనిదే ఎవరికీ గాయత్రి మంత్రము ఉచ్చరించే స్మరించే అర్హత లేదు, సంకల్పము పలికి పూజలు చేసే అర్హత లేదు.. భగవంతుడుకే తప్పదు ఈ నియమం.. వినాయకుడు అంతటి వాడే ఉపనయనం చేసుకొనక తప్పలేదు.. మరి అయ్యప్ప స్వామి భక్తులు ఏ అర్హత పొంది అలా పూజలు చేసేస్తున్నారు? ఉపనయనము అయినదా? గాయాత్రి మంత్రోపదేశము జరిగినదా ? మరి ఎవరు పడితే వాళ్ళు పూర్తి శాస్త్ర విరుద్ధంగా అలా గాయత్రి పలుకుతూ అయప్ప పూజ ఎలా చేస్తున్నారు? ఏ మంత్రము అయినా ఉపదేశము లేనిదే చదివితే అది పెద్ద దోషము.. మరి శాస్త్ర విరుద్ధంగా అలా ఎలా ఉపదేశం లేకుండా గాయత్రి మంత్రము చదువుతూ, సంకల్పము చెప్పి ఎవరు పడితే వాళ్ళు పూజలు అలా ఎలా చేసేస్తున్నారు?


పైన అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కేవలం భావాత్మకముగా కాక సత్యములేని “మా నమ్మకం మాది” అనే మూఢ నమ్మకముతో కాక ప్రామాణీకముగా సందేహాల నివృత్తి చేయగలరని ప్రార్ధన..

ఇది వివాదాస్పదంగా కాకుండా కేవలం సత్యము గూర్చి పరిశీలనాత్మకంగానే చూసి, సందేహాలకు ప్రామాణికంగా  స్పందించవలసిందిగా మనవి .

శ్రీ రామ చంద్రపరబ్రహ్మణే నమః 🙏🏻🙏🏻
శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🙏🏻

 Source: internet

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

1 comments:

Write comments
Eswara
AUTHOR
27 June 2018 at 21:21 delete

కలియుగంనందు మానవులు తాము గొప్ప పండితులమని మాకు సాటి ఎవరూ లేరనే అహంకారంతో కోకిలకూత వలే నీతులు చెపుంట్తారు. కానీ చేసేవి మాత్రం నీచమైన పనులు. వీరు జీవితమంతా అజ్ఞనపు చీకటిలో ఉండి పూజకు పనికి రాని పువ్వు వలే బ్రతకాల్సి వస్తుంది

Reply
avatar

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles