🙏🏽🌹 *కార్యదీక్ష* 🌹🙏🏽
🍃🌺🌺🌺🙏🏽🌺🌺🌺🍃
కార్యసాధకుల విజయ రహస్యం- నిరంతర కృషి. మార్గంలో ఎదురయ్యే అడ్డంకుల్ని చూసి వారు వెనకడుగు వేయరు. వాటిని అధిగమించడానికి సమధిక ఉత్సాహంతో పనిచేస్తారు. వారు కర్మయోగులు.
జీవిని ఈశ్వరుడి వైపు నడిపించడమే యోగ లక్ష్యం. కర్మయోగులకు ముగ్గురు శత్రువులుంటారు. లోభ, మోహ, అహంకారాలే ఆ శత్రువులు. ఆ బారి నుంచి తప్పించుకుంటూ, సంయమనంతో ముందుకు సాగిన వారే లక్ష్యం చేరుకోగలరు. ఆంజనేయుడు మహా బలశాలి. సీతమ్మ జాడ తెలుసుకోవడం అనే మహత్కార్యంపై పయనమయ్యాడు. మార్గమధ్యంలో సురస అనే రాక్షసి అడ్డగించింది. అంతటి మహాబలుడూ తన శరీరాన్ని కుదింపజేసుకున్నాడు. సూక్ష్మరూపంలోకి మారడం ద్వారా, ఆ రక్కసి బారి నుంచి విముక్తుడయ్యాడు. తన లక్ష్యం సాధించడానికి ముందుకు సాగిపోయాడు.
మనిషి అనుకున్నది సాధించాలంటే, మొదట అహంకారాన్ని వీడాలి. కార్యసాధనలో పొరపాటు చేయడం ఎవరికైనా సహజం. అహంకారి తన తప్పును ఒక పట్టాన అంగీకరించడు. నిరహంకారి అవసరమైతే క్షమాపణ చెప్పడానికి వెనకాడడు. అందువల్ల అతడి గౌరవం ఇసుమంతైనా తరగదు. పైగా, అతడి నిజాయతీని అందరూ ప్రశంసిస్తారు.
కార్యసాధనకు పట్టుదల, ధైర్య స్థైర్యాలే కాదు- తగినన్ని ఉపాయాలూ అవసరమవుతాయి. అవి అపాయకరమైనవి, సమాజానికి కీడు చేసేవి కాకూడదు.
శ్రద్ధ, సద్భావనలు ఈశ్వర దర్శనానికి మార్గాలు. అందువల్ల భక్తుడు రామకృష్ణ పరమహంసలా నిత్యమూ అమ్మవారి సమక్షంలోనే ఉండగలడు. ఆ జగదంబను దర్శించగలడు. శిష్యుడు గురు కృప పొందడానికీ శ్రద్ధ అత్యవసరం. రామానంద స్వామిని గురువుగా ఎంచుకున్నాడు కబీరు. కానీ దీక్ష ఇవ్వడానికి, మంత్రోపదేశం చేయడానికి ఆయన అంగీకరించలేదు. అలా ఒక వ్యక్తికే దీక్ష ఇచ్చి శిష్యుడిగా స్వీకరిస్తే, మిగతా శిష్యులకు కోపం వస్తుందని ఆయన అభిప్రాయం. రామానందులు రోజూ గంగలో స్నానం ఆచరించేవారు. ఒకరోజు ఆయన అక్కడికి వెళ్లిన సమయంలోనే, కబీరు ఆ నది ఒడ్డున ఇసుకలో పడుకున్నాడు. గంగలో స్నానానికి దిగబోతూ పొరపాటున కబీరుపై పాదం మోపారు గురువు! వెంటనే పొరపాటు తెలుసుకున్నారు. ‘రామ రామ’ అంటూ పశ్చాత్తాపం వ్యక్తపరచారు. అనంతరం, స్నానం ఆచరించి తిరిగి వెళ్లిపోయారు.
గురువు పాద స్పర్శ పొందిన కబీరు, తనకు ఆయన దీక్ష ప్రసాదించారని పొంగిపోయాడు. పొరపాటున కాలు తగిలిందన్న పశ్చాత్తాప హృదయంతో రామానందులు పలికిన ‘రామ రామ’ అనే మాటల్ని గురువు చేసిన మంత్రోపదేశంగా భావించాడు. దాన్ని స్వీకరించి తన్మయత్వం చెందాడు భక్త కబీరు! రామానందుల శిష్యుల్లో అగ్రగణ్యుడయ్యాడు. సామాజిక అంతరాల్ని తన సంస్కార బలంతో సులభంగా అధిగమించగలిగాడు. భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడై ప్రసిద్ధి చెందాడు. ఆత్మ సంస్కారం కలిగినవారికి సామాజిక కట్టుబాట్లతో పని లేదు. వారి కార్యదీక్షకు ఏవీ ఆటంకాలు కావు, కాలేవు.
దేహ బలం, సౌందర్యం, ఆర్థిక పరిపుష్టి... ఇవన్నీ కార్యసాధనకు కొంతవరకు దోహదపడే అంశాలుగా గోచరిస్తాయి. బలహీన దేహం గలవారు, పేదరికంలో మగ్గినవారు, కురూపులు సైతం అద్భుత కార్యాలు సాధించిన ఉదంతాలు పురాణ గాథల్లో కనిపిస్తాయి. వారు అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. ఒక బాలుడికి చిన్నప్పుడే కాలు విరిగింది. అతడు దేనికీ పనికిరాడని కొందరు చిన్నచూపు చూశారు. మరికొందరు సానుభూతి కురిపించారు. ఆ చిన్నచూపును, సానుభూతిని తన మనసు నుంచి పక్కకు నెట్టాడా బాలుడు. తనకు తానే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. నిర్విరామ కృషి సాగించాడు. ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల రచయితగా వన్నెకెక్కాడు. ఆయనే హెచ్‌జీ వెల్స్!.
🌻 🌻