*సూర్యరశ్మితో ఉపయోగమేంటి*?
ప్రశ్న: *మన శరీరానికి సూర్యరశ్మి ఎలా మేలు చేస్తుంది?*
జవాబు: బూజు, బాక్టీరియా లాంటి సూక్ష్మ జీవులను నశింప చేయడంతో పాటు సూర్యరశ్మి మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కూడా దోహదపడుతుంది. వీటితోపాటు సూర్యరశ్మికి మన శరీరాలను ఆరోగ్యవంతంగా ఉంచే ప్రక్రియలో ఎంతో ప్రమేయం ఉంది. రోజులో కొంతసేపైనా మన శరీరానికి సూర్యరశ్మి సోకితే, దేహంలోని కండరాలతో పాటు నాడీ మండలం కూడా ఉత్తేజితమవుతుంది. రక్తంలోని తెల్లకణాలు సూర్యరశ్మి వల్ల మరీ శక్తివంతమై అంటు వ్యాధులు సోకకుండా అడ్డుకుంటాయి. సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాలు శరీరంలో డి విటమిన్‌ను ఉత్పన్నం చేసి ఎముకలు దృఢంగా బలంగా ఉండేటట్లు చేస్తాయి. పాశ్చాత్యుల్లా తెల్లగా, మచ్చలతో పాలిపోయినట్లు ఉండే శరీర వర్ణం కంటే, మన దేశ వాసుల చర్మ సౌందర్యం ఈ అతినీలలోహిత కిరణాలు సోకడంతో ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల వారు ఈ కిరణాలు ఎక్కువ మోతాదులో లభించే మన దేశ గోవా లాంటి సముద్ర తీర ప్రాంతాలకు వచ్చి అక్కడ సూర్యస్నానాలు చేస్తుంటారు. ఏది ఏమైనా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కొంతసేపు సూర్యరశ్మి తగిలేటట్లు జాగ్రత్త పడటం మన శరీర ఆరోగ్యానికి మంచిది.