ఒకరోజు భోజరాజు మారువేషం లో తిరుగుతూంటే ఒక ఇల్లు కనిపించింది.ఆ యింట్లో ఒక అద్భుతమైన
సౌందర్యవతిని చూశాడు.ఆ అందాలరాశి గృహ కృత్యంగా రోకలితో వడ్లు దంచుతున్నది.రాజు ఆమె సౌందర్యం చూసి ముగ్ధుడయ్యాడు.ఆయనకు ఒక వూహ వచ్చింది.అంతటి అందాల పడుచుపిల్ల చెయ్యి తగిలినా ఆ
రోకలి చిగిరించకుండా అలాగే మొండి బండగానే ఉండిపోయింది.రోకలికి శృంగార మేమి తెలుసు గనుక?
'ముసల:!కిసలయం-తే తత్ -క్షణాత్ యత్- న జాతం
అని ఆమాటే పదిసార్లు అనుకున్నాడు.ఆ భావం ఒక శ్లోక పాదంగా రూపుదాల్చింది.
"ఓ రోకలీ! నువ్వు వున్నపళాన చిగురించక పోవడానికి కారణం ఏమంటే"
మరునాడు పొద్దున తన సభలో అదే పాదాన్ని సమస్యగా కాళిదాసు కిచ్చి దాన్ని పూర్తి చెయ్యమన్నాడు.కాళిదాసు యిలా పూర్తి చేశాడు.
జగతి విదిత మేతత్ కాష్టం-ఏవ-అసి నూనమ్(నువ్వు కేవలం కట్టెవి.అని లోకమంతా తెలిసిన విషయమే సందేహం లేదు)
తదపి చ కిల సత్యం కాననే వర్దితః అసి(నువ్వు అడవిలో పెరిగిన అడవిసరుకువన్న మాటగూడా సత్యం)
నవకువలయ నేత్రా పాణి సంగోత్సవే -అస్మిన్ (అప్పుడే విరిసిన కలువల లాంటి కన్నులు గల చిన్నదాని
చేతుల స్పర్శ కలిగిన ఈ సందర్భం లో కూడా.
ముసల! కిసలయం తే తత్ -క్షణాత్ యత్ న జాతమ్ (ఓ రోకలీ !వున్న పళాన నువ్వు చిగురించక పోవటానికి కారణం యిందువల్లనే.
జగతి విదిత మేతత్-కాష్టమే వాసి నూనమ్
తదపి చ కిల సత్యం కాననే వర్దితోసి
నవ కువలయ నేత్రా పాణి సంగోత్సవేస్మిన్
ముసల!కిసలయం తే తత్ -క్షణాత్ యన్నజాతమ్.
(అడవిలో పుట్టి పెరిగిన నీకు శృంగార మేమి తెలుసు?అందుకే నీవు చిగురించలేదు).
భోజరాజు కాళిదాసును సన్మానించాడు.