మనము సకల దేవతారాధనలు చేస్తున్నాము. ఇష్టదైవాల్ని ఎన్నుకోవడం ఆయా భక్తుల అనుభూతులపై, మహిమలపై ఆధారపడి ఉంటుంది. అష్టోత్తర సహస్రనామ అర్చనలు, షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఇష్టదైవాలకు అవసర నైవేద్యం, మహానైవేద్యం, తాంబూల సమర్పణ, హారతి (నీరాజనం) మంత్రపుష్పం, తీర్ధస్వీకారం, ఫలశ్రుతి అనంతరం పూజ సమాప్తమగును. ఐతే సకల దేవతా పూజా విధనం గురించి తెలుసుకుని, నైవేద్యాల వివరణలోకి వెళ్దాం.
నైవేద్యం
ఉద్ధరిణతో నీళ్ళు తీసుకుని
"ఓం భూఃర్భువస్సువః, ఓం తత్సవితురవరేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనఃప్రచోదయాత్"
అని చదివి ఆ నీళ్ళను నివేదన చేయవలసిన పదార్ధములపై చల్లవలెను.
తరువాత మరల నీళ్లు తీసుకుని
"సత్యం వ్రత్యేన పరిషంచయామి"
అని నీళ్ళను పదార్ధముల చుట్టూ ప్రదక్షిణంగా పోయవలెను.
మరల నీళ్ళు తీసుకుని
"అమృతమస్తు - అమృతోపస్తరణమస"
అని పళ్లెములో వదలవలెను.
తరువాత పదార్ధములను దేవునికి చూపిస్తూ
" ఓం ప్రాణాయ స్వాహా,
ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా,
ఓం ఉదానాయ స్వాహా,
ఓం సమానాయ స్వాహా "
అని అనవలెను.
తరువాత పళ్లెములో ఉద్ధరిణతో నీళ్ళు వదులుతూ
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి.
పాదౌ ప్రక్షాళయామి.
తాంబూలం సమర్పయామి.
నీరాజనం సమర్పయామి.
అని అన్నీ చేస్తూ చివరగా
"ఏతస్సకలం భగవదార్పణమస్తు." అని నీళ్లు వదలవలెను.
దేవతల ప్రీత్యర్ధం సమర్పించవలసిన నైవేద్యాలు
శ్రీ వేంకటేశ్వరస్వామికి
వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టవలెను. తులసిమాల మెడలో ధరింపవలెను
వినాయకునకు
బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజింపవలెను.
ఆంజనేయస్వామికి
అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజింపవలెను.
సూర్యుడుకు
మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.
లక్ష్మీదేవికి
క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజింపవలెను.
లలితాదేవికి
క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము
.
సత్యన్నారాయణస్వామికి
ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.
దుర్గాదేవికి
మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.
సంతోషీమాతకు
పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.
శ్రీ షిర్డీ సాయిబాబాకు
పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం
శ్రీకృష్ణునకు
అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళములతో పూజించవలెను.
శివునకు
కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.