Tuesday 17 January 2017

దేవసేనపతిగా ఖ్యాతి ఎలా వచ్చింది?

పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి, సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని, బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. “ఓదేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ (సెనాపతి) విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచిమ్పుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు”.
దేవతల ప్రార్థనను ఆలకించి, సరలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను.
“పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియై, శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని (శివ తేజః ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని) ఆదరింప గలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు”.
ఓ రఘునందనా! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి, తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, పూజించిరి. అంతట ఆ దేవతలందరునూ గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి, పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతెజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రికయైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము’ అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో ‘అట్లే’అని పలికి, గంగాదేవి కడకు వెళ్ళి “ఓ దేవీ! గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమొనర్చు కార్యము” అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి, శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను.
ఓ రఘునందనా! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నియును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సుయొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో “క్షణక్షణమునాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను” అని పలికెను.  సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో “ఓ దేవీ! ఈ శ్వేత పర్వతప్రదేశమున నీ గర్భమును ఉంచుము’ అని యనెను. మహా తేజస్వివైన ఓ పుణ్యపురుషా! రామా! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి, మిక్కిలి తేజోరాశియైన ఆ గర్భమును తన ప్రవాహములనుండి అచట వదలెను. గంగానది గర్భమునుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై యుండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు, అచటి వస్తువులన్నియును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నియును రజిత మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈవిధంగా ఆ తేజస్సు భూమిని జేరి,  వివిధ ధాతువులుగా రూపొందెను.
ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆశ్వేతపర్వతమూ, అందలి శరవణమూ(రెల్లుగడ్డి) సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవా! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటినుండియు ‘జాతరూపము’ అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాయెను. తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై, ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించిరి. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. అంత దేవతలందరును “ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు” అని పలికిరి.
గంగాద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతలా మాటలను విని, వారి ఆదేశమును అనుసరించి, కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలువసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి ‘కార్తికేయుడు’ అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారినుండి పాలుద్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వియైన ఆ బాలుని కడకు చేరి, అతనిని ‘దేవసేనాపతి’గా అభిషేకించిరి. 
పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామి పై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును గూడ పొందును.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles