1945 ఫిబ్రవరిలో పరమాచార్య స్వామివారు రాణీపెట్టైలో మకాం చేస్తున్నారు. అక్కడ నివసించేవారు దాదాపుగా హైందవేతరులే అయినా కులమతాలకతీతంగా మహాస్వామివారి దర్శనానికి వచ్చేవారు. రాణీపెట్టై సమీపంలోని నావల్పూర్ ప్రజలు “కరుమారుయమ్మన్ దేవి” ఆలయం కట్టడానికి లక్షలలో నిధులు కావాలని గ్రహించి కాస్త కలత చెందారు. పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కోసం వారు స్వామివారి దర్శనానికి వచ్చారు.
“మేము ఒక మంచి కార్యక్రమం చెయ్యలనుకున్నాము. దానికి కావాల్సిన నిధులు మావద్ద సమృద్ధిగా లేవు.
పరమాచార్య స్వామివారు మమ్మల్ని అనుగ్రహించాలి“ అని వేడుకున్నారు. స్వామివారు కొద్దిసేపు మౌనం వహించి, “కోవెల అమ్మవారికి. కదా? ఆమెయే చూసుకుంటుంది” అని చెప్పారు.
“మాకు ఆ నమ్మకం ఉంది కాని కావాల్సిన ధనంలో పాతికవంతు కూడా సేకరించలేకపోయాము. . . ”.
అందుకు మహాస్వామివారు “నేలపై నాలుగడుగుల ఎత్తున నిర్మాణం చెయ్యండి” అని చెప్పారు.
”మరి గోపురం, విగ్రహాలు, కుంబాభిషేకం మొదలగువాటికి ఎలా?” అని అడిగారు వారు.
”వాటన్నిటి కోసం ఒక వ్యక్తి వస్తాడులే” అన్నారు.
వారికి ఒక దేవరహస్యం అవగతమైంది. కాని “ఎప్పుడు వస్తాడు? ఎలా గుర్తుపట్టాలి?” అని పలు సందేహాలతో సంతోషంతో ప్రసాదం స్వీకరించి, అనుమానంతో, కలతతో వెళ్ళిపోయారు.
ఈ సంఘటన జరిగినది ఫిబ్రవరి 14, 1945న. మరి ఆ వ్యక్తి ఆరోజు ఎక్కడున్నాడు?
1939లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధం 1945 వరకు కొనసాగింది. అలీన సేనలు బర్మాలోని ఐరావతి నది వద్ద జపాన్ తో తలపడుతున్నాయి. జపాన్ సైన్యం తూర్పు ఒడ్డున, అలీన సేనలు పశ్చిమ ఒడ్డున పోరాడుతున్నాయి. అలీన సేనలకు ఆ ప్రాంతము, ఆ వాతావరణము అంతగా అలవాటు లేదు. నదీజలాల దగ్గర యుద్ధం చేయగల నైపుణ్యం కలిగిన వారిని ఇక్కడకు పంపవలసిందిగా అలీన సేనలకు నాయకత్వం వహిస్తున్న మేజర్ లండనుకు అత్యవసర సమాచారం పంపారు. అటువంటి యుద్ధనైపుణ్యం కలిగిన బెటాలియన్ మడగకార్.
ఆ సైనిక దళాన్ని వెంటనే ఐరావతికి పంపారు. భారత సైనికులను ఒడ్డుకు పంపి వారు నదిలోకి దిగారు. ఈ హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేని జపాన్ సేనలు రాక్షసులుగా మారి ఒడ్డున ఉన్నవారిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు. ఆ ఊతకోచలో కేవలం ఒక్కరే బ్రతికి బయటపడ్డారు.
”నేను ఒక్కడినే ఎందుకు బ్రతికాను దేవుడా?”
1945 మేలో జెర్మనీ ఓటమితో యుద్ధం ముగిసింది.
ఐరావతి యుద్ధంలో బ్రతికి బయటపడ్డ మేజర్ నారాయణస్వామి, సైన్యం నుండి విరమణ పొందిన తరువాత భార్య చంద్రికతో కలిసి రాణిపెట్టైలో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఒకరోజు సాయింత్రం వారు నడుడుచుకుంటూ వెళ్తుండగా అనుకోకుండా అసంపూర్తిగా ఉన్న మందిరాన్ని ఆరుబయట అలా ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న అమ్మవారిని చూశారు. “చూడు! నన్ను ఎలా వదిలేశారు. నేను అంతటి భయంకర యుద్ధం నుండి నిన్ను కాపాడితే, నాకు ఒక నీడ కల్పించవా” అని అమ్మవారు అడిగినట్టు అనిపించింది.
మహాస్వామివారి దర్శనానికి వచ్చిన ఆ భక్తులందరి ఆనందభాష్పాలతో ఆ ప్రాంగణం అంతా నిండిపోయింది. ”ఈయన మిలటరి మేజర్ నారాయణస్వామి, ఆవిడ ఈయన భార్య. ఆలయ నిర్మాణాన్ని వారు పూర్తిచేసి, కుంబాభిషేకం కూడా చెయ్యడానికి ముందుకు వచ్చారు. కొద్దిరోజుల క్రితం అచ్చం స్వామివారు చెప్పినట్టుగానే”
పరమాచార్య స్వామివారి ‘కరుణాకటాక్షం’ ఆ దంపతులపై ప్రసరించి వారిని పునీతులను చేసింది.