వాల్మీకి రామాయణం
35వ దినము, బాలకాండ.
అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బొటనువేలి మీద నిలబడి ఒక సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి, నీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరస్సు మీద పడతాను అన్నాడు. అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి, రెండు చేతులు నడుము మీద పెట్టుకొని, కాళ్ళని చాపి, తన జటాజూటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. నా ప్రవాహంలో ఈ శంకరుడిని కూడా పాతాళం దాకా తీసుకుపోతాను, ఈయన నన్నేమి పట్టగలడు అనుకుంది గంగ. అలా అనుకొని ఆకాశం నుంచి శంకరుడి జటాజూటంలోకి జారింది. అలా ఆ గంగ ఒక సంవత్సరం పాటు పడుతూనే ఉంది, కాని శంకరుడి శిరస్సు నుండి ఒక చుక్క నీరు కూడా నేల మీద పడలేదు. అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు శంకరుడిని ప్రార్ధించగా, ఆయన ఆ గంగని బిందుసరోవరంలో వదిలాడు. అప్పుడు ఆ గంగహ్లాదినీ, పావనీ, నళిని అని మూడు పాయలుగాతూర్పుదిక్కుకి వెళ్ళింది, సుచక్షువు, సీతా, సింధువుఅని మూడు పాయలుగా పడమరదిక్కుకి వెళ్ళింది, ఆ ఏడవ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది. రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించింది. గంగతో పాటు మొసళ్ళు, తాబేళ్లు, చేపలు ఆ గంగలో ప్రవహించాయి. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూడడానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు, పాపాలు చేసిన వాళ్ళు ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారు. కొందరు శంకరుడి పాదాల దెగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్ళు తల మీద జల్లుకొని తమ పాపాలు పోగొట్టుకున్నారు.
అలా వెళుతున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్నజహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతా మింగేశారు. భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమి లేదు. వెంటనే భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ళ మీద పడి ప్రాధేయపడగా, ఆయన గంగని తన చెవులలోనుంచి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవులనుంచి వచ్చింది కనుక గంగని జాహ్నవిఅని పిలిచారు. అలా భగీరథుడి వెనకాలే ప్రయాణించి పాతాళ లోకంలో ఉన్న ఆయన పితృదేవతల భస్మాల మీద నుంచి ప్రవహించింది. గంగ యొక్క ప్రవాహం తగలగానే ఆ సగరులు స్వర్గానికి వెళ్ళారు.
స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని మందాకినీ అని, భూమి మీద భాగీరథి అని, పాతాళ లోకంలో భోగవతిఅని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగావతరణం గూర్చి చెప్పాడు.