Tuesday 29 November 2016

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి

శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మల్లూరు


వరంగల్ కి 130 కి.మీ. ల దూరంలో అటవీ ప్రాంతంలో వున్నదీ ఆలయం. 

 ఇక్కడి విశేషాలు ఇలా? 

 అటవీ ప్రాంతంకావటంతో దోవ పొడుగూ చెట్లతో ఆకర్షణీయంగా వుంటుంది.  రోడ్డుకూడా బాగుంటుంది.   పట్టణ గజిబిజి నుంచి విశ్రాంతి కావాలనుకునేవాళ్ళు సరదాగా వెళ్ళిరావచ్చు. చిన్న కొండమీద ఆలయం .. చిన్నదైనా .. అడవిలో నెలకొన్న ఆలయం, ఆలయంలో విశేష మహత్యంకల విభిన్న స్వరూపుడైన స్వామి,  కొండకింద విశాలమైన ప్రదేశం, సకల రుగ్మతలను మాయం చేసే చింతామణి జలపాతం, ఇవ్వన్నీ ఇక్కడి విశేషాలే. ఒక్కొక్కటీ వివరిస్తాను.  ఇదంతా అటవీ ప్రాంతం.  హనుమకొండనుంచి ఏటూరునాగారం వెళ్ళే మార్గంలో వున్న మల్లూరుదాకా (మంగపేట వెళ్ళే బస్సు)  బస్సు సౌకర్యం వున్నది.  అక్కడనుంచి ఆలయానికి 4 కి.మీ.లు లోపలకెళ్ళాలి. మార్గం, ఆలయ పరిసరాలు పచ్చని చెట్లతో అందంగా వుంటాయి.  ఆటో సౌకర్యం వుంటుందిగానీ రేట్లు కొంచెం ఎక్కువన్నారు.  ఇలాంటి ప్రదేశాలకు సిటీనుంచి వెళ్ళేవాళ్ళకి సొంతవాహనమయితే సౌకర్యంగావుంటుంది.
ఇంక ఇక్కడ వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి ...  ఆయన స్వయంభూ.  6 అడుగుల ఎత్తుగా, శంఖు, చక్ర, గదాయుధాలతో  నుంచున్నట్లుంటారు వక్షస్ధలంనుంచి నాభివరకు వేలితో నొక్కితే వేలు లోపలకెళ్తుంది.  వేలు తీసేస్తే ఆ ప్రాంతం మళ్లీ మామూలుగా అవుతుంది.  పూజారిగారు ఈ విశేషాన్ని చూపిస్తారు.  భక్తులను తాకనివ్వరు.  స్వామి నాభినుంచి ద్రవం స్రవిస్తూవుంటుంది.  దీనికి ఒక కధ చెప్తారు.  హిరణ్యకశిపుడి సంహారంకోసం స్వామి ఈ అరణ్యంలోకి వచ్చినట్లు, చెంచు లక్ష్మిని ఇక్కడే వివాహమాడినట్లు కాలక్రమేణా గుహాంతర్భాగాల్లో మరుగునపడ్డట్లు చెప్తారు.  తర్వాత కాలంలో భారద్వాజ, అంగీరస మహర్షులు సంచారం చేస్తూ ఈ ప్రాంతంలో ఒక రాత్రి విశ్రమించారు.  అప్పుడు స్వామి వారికి స్వప్న దర్శనమిచ్చి తనని వెలికి తీయమని ఆదేశించాడు.  వారు పలుగుతో స్వామి  చెప్పినచోట తవ్వగా స్వామి నాభి దగ్గర పలుగు తగిలి రక్తం కారిందిట.  ఋషులు వెంటనే చందనం అరగదీసి స్వామికి పరిచర్యలు చేశారుట.  ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలోనే ఇప్పడూ చీములాంటి ద్రవం స్రవిస్తూవుంటుంది.  దానిని గంధంతో కలిపి సంతానం లేనివారు సేవిస్తే సంతానం కలుగుతుందంటారు.


శని, ఆది, సోమవారాలలో స్వామికి అభిషేకం జరిగిన తర్వాత మాత్రమే ఈ ద్రవాన్ని కోరినవారికి ఇస్తారు. చిన్న గుట్టమీద వున్న ఈ ఆలయం చేరుకోవటానికి 130 మెట్లు ఎక్కాలి.  మొదట్లో స్వయంభూ ఆంజనేయస్వామిని దర్శించుకోవచ్చు.  పైన స్వామి ఆలయానికిరుపక్కలా అమ్మవార్లు ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మిల ఉపాలయాలను తర్వాత నిర్మించారు.  అసలు ఆలయం 2వ శతాబ్దంనాటిదంటారు. ఇప్పుడిప్పుడే  ప్రసిధ్ధికెక్కుతున్న ఈ ఆలయం దగ్గర కోతులు ఎక్కువగా వున్నాయి.
చింతామణి జలపాతం

ఆలయం సమీపంలోనే వున్న ఈ జలపాతంలోని నీరు అద్భుత ఔషధ గుణాలుగలదనీ, దీనిని సేవిస్తే అనేక రుగ్మతలు తొలగిపోతోయనీ విశ్వసిస్తారు.  కారణం ఈ నీరు అనేక ఔషధ మొక్కలను ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది.  జలపాతం అన్నానని ఎత్తుమీదనుంచి దూకే ప్రవాహాన్ని ఊహించుకోకండి.  అత సన్నటి ధార మాత్రమే.  దీనిని అనేకమంది సీసాలలో తీసుకెళ్లి (కావాల్సినవాళ్ళు సీసాలు తమతో తీసుకెళ్ళాలి..అక్కడ దొరకవు) రోజూ ఔషధంలాగా సేవిస్తారు.

దర్శన సమయాలు

ఉదయం 10 గం. లనుంచీ సాయంత్రం 4 గం.లదాకా.  మధ్యలో 1 గంట భోజన విరామం.  అడవి ప్రాంతం కనుక వసతి, భోజనం వగైరా సౌకర్యాలు ఏమీ వుండవు.
ఇతర దర్శనీయ ప్రదేశాలు
వరంగల్ నుంచి మల్లూరు వెళ్ళే రహదారిలో సమ్మక, సారలక్కల గద్దెలున్న మేడారం (రహదారికి సుమారు 14 కి.మీ.ల దూరంలో) జాతర లేనప్పుడుకూడా చూడవచ్చు, పాలంపేటలో ప్రసిధ్ధికెక్కిన శిల్పకళానిలయం రామప్ప దేవాలయం (రహదారినుంచి 16 కి.మీ.ల దూరంలో), రామప్ప గుడినుంచి 10 కి.మీ.ల దూరంలో అతి పురాతన కోటగుళ్ళు వున్నఘనాపూర్ సందర్శనీయ స్ధలాలు.  అయితే అరణ్య ప్రాంతం కనుక ముందు మల్లూరు వెళ్ళి, వస్తూ వీలునిబట్టి మిగతా ప్రదేశాలు సందర్శించవచ్చు.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles